Skip to main content

ఐఐఎస్‌ఈఆర్‌ కోర్సులపై... తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో అవగాహన కరువు!!

సాక్షి, హైదరాబాద్‌: అవగాహన లేక జాతీయ స్థాయి సైన్స్ విద్యా, పరిశోధన సంస్థల్లో ప్రవేశాలపై రాష్ట్ర విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)లలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర విద్యార్థులు ఎక్కువ మంది ముందుకు రావడం లేదు. కేరళ, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు ఐఐఎస్‌ఈఆర్‌లలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య వందల్లోనే ఉంటోంది. ఇందుకు ఆయా కోర్సుల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం అని అధికారులే పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అంటున్నారు. ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌కు ఇటీవల ఆయన లేఖ రాశారు.

ఏడు ప్రాంతాల్లో ఐఐఎస్‌ఈఆర్‌లు
జాతీయ స్థాయిలో సాంకేతిక విద్యా సంస్థలైన ఐఐటీల తరహాలోనే సైన్స్ కోర్సుల కోసం కేంద్ర విద్యాశాఖ దేశవ్యాప్తంగా ఏడు ఐఐఎస్‌ఈఆర్‌లను ఏర్పాటు చేసింది. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్థుల కోసం బరంపూర్, భోపాల్, కోల్‌కతా, మొహలీ, పుణే, తిరువనంతపురం, తిరుపతిలో ఏర్పాటు చేసిన ఐఐఎస్‌ఈఆర్‌లలో బయోలాజికల్‌ సైన్సెస్, కెమికల్‌ సైన్సెస్, ఎర్త్‌ అండ్‌ క్‌లెమైట్‌ సైన్స్/ ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్మెంటల్‌ సైన్సెస్, ఎకనామిక్‌ సైన్సెస్, ఇంజనీరింగ్‌ సైన్సెస్‌ (కెమికల్‌ ఇంజనీరింగ్, డాటా సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్), జియోలాజికల్‌ సైన్సెస్, ఇంటిగ్రీటెడ్‌ అండ్‌ ఇంటర్‌డిసిప్లీనరీ సైన్సెస్, (బయోలాజికల్‌ సైన్సెస్, కెమికల్‌ సైన్సెస్, డాటా సైన్సెస్, మ్యాథమెటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌) వంటి కోర్సులను నిర్వహిస్తోంది. వాటితోపాటు ఐదేళ్ల డ్యుయల్‌ డిగ్రీ కోర్సులను కూడా గత ఏడేళ్లుగా నిర్వహిస్తోంది. వాటిల్లో డిగ్రీ దశ నుంచే పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చి ఆయా కోర్సులను నిర్వహిస్తోంది. సైన్స్, ఇంజనీరింగ్‌ విభాగాల్లో లోతైన అధ్యయనానికి ఈ కోర్సులు వీలు కల్పిస్తున్నాయి. అయితే అలాంటి కోర్సుల పట్ల తెలుగు రాష్ట్ర విద్యార్థుల్లో అవగాహన లేకపోవడం వల్ల విద్యార్థులు ఉత్తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండే కోర్సులను చదువలేకపోతున్నారు.

ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించిన ఐఐఎస్‌ఈఆర్‌
వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐఐఎస్‌ఈఆర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఐఏటీ 2021) నిర్వహిస్తోంది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోనూ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజమాబాద్, వరంగల్‌లలో కేంద్రాలను ఏర్పాటు చేసింది. మే నాలుగో వారంలో ప్రవేశ పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. ఇంకా పరీక్షల తేదీలను ఖరారు చేయలేదు. 2021–22 విద్యా సంవత్సరం తరగతులను వచ్చే ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ఈ ప్రవేశ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య తెలుగు రాష్ట్రాల నుంచి చాలా తక్కువగా ఉన్నట్లు విద్యాశాఖ సేకరించిన వివరాలే చెబుతున్నాయి. జేఈఈ అడ్వాన్స్ డ్‌ లో 10 వేల లోపు ర్యాంకు వచ్చిన (కటాఫ్‌ను ప్రకటిస్తారు) విద్యార్థులకు, కిశోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై) ఫెలోషిప్‌ పొందిన వారికి... ప్రవేశపరీక్ష లేకుండా నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు.

ఐఐఎస్‌ఈఆర్‌ ఇచ్చిన సమాచారం మేరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు

రాష్ట్రం

దరఖాస్తులు

తెలంగాణ

644

ఆంధ్రప్రదేశ్‌

653

ఒడిషా

1,332

పశ్చిమబెంగాల్‌

2,138

కేరళ

7,555


సైన్స్ లో బంగారు భవిష్యత్తు కోసం ప్రోత్సహించండి
ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్థులు సైన్స్ కోర్సులు చదివేందుకు ఐఐఎస్‌ఈఆర్‌లు మంచి వేదిక. వాటిల్లో చదివే డిగ్రీ, పీజీలతో విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయి. అత్యున్నత స్థాయిలో విద్యాబోధన సాగే ఈ సంస్థల్లో రాష్ట్ర విద్యార్థుల ప్రవేశాలు పెరగాలి. తద్వారా సైన్స్ లో బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలి. ఇతర రాష్ట్రాలతో పోటీపడి రాష్ట్ర విద్యార్థులు వాటిల్లో ప్రవేశాలు పొందాలి. ఈ విషయంలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు లేఖ కూడా రాశాను.
– బోయినపల్లి వినోద్‌ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్
Published date : 03 Mar 2021 05:50PM

Photo Stories