6 వస్తువులతో జగనన్న విద్యా కానుక..!
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘జగనన్న విద్యా కానుక’ కింద ఆరు రకాల వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
ఇవన్నీ నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1వ తరగతి నుంచి 10 తరగతి వరకు చదివే 42 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ కిట్లను అందిస్తారు. ప్రతి కిట్‌లో 3 జతల యూనిఫామ్ క్లాత్, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, షూ- 2 జతల సాక్స్‌లు, స్కూల్ బ్యాగ్, బెల్టు ఉంటాయి. యూనిఫామ్ కుట్టించేందుకు అయ్యే ఖర్చులను విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది. వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు తెరిచే నాటికి ఈ కిట్లను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాఠశాల విద్యపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులకు అందించే కిట్లలోని వస్తువులను ముఖ్యమంత్రికి చూపించారు. వాటిని పరిశీలించిన సీఎం కిట్‌లో వస్తువులు పూర్తి నాణ్యతతో ఉండాలని స్పష్టం చేశారు. పిల్లలు ఏడాది పాటు వినియోగించే వస్తువులు కనుక నాణ్యత విషయంలో రాజీపడొద్దని ఆదేశించారు.
సీఎం ఇచ్చిన ఆదేశాలివీ
ప్రతి స్కూల్‌కూ స్మార్ట్ టీవీ
సీఎం ఇచ్చిన ఆదేశాలివీ
- పభుత్వ స్కూళ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చేందుకు చేపట్టిన ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
- స్కూళ్లలో ఏర్పాటు చేయతలపెట్టిన 9 రకాల కార్యక్రమాలను నిర్ణీత సమయానికి పూర్తిచేసేలా కార్యాచరణ చేపట్టాలి.
- నాడు-నేడు పథకం కింద తొలి విడతలో ఎంపిక చేసిన 15,715 స్కూళ్లలో పనులను వేగంగా పూర్తి చేసి స్కూళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి.
- పాఠశాలలను ఇంతకు ముందే తీయించిన ఫొటోలతో పోల్చి చూపి అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలి.
- జూన్ నాటికి ఏ ఒక్క పనికూడా పెండింగ్‌లో ఉండకూడదు.
- వచ్చే సమావేశం నాటికి స్కూళ్లలో చేపట్టిన పనులు ఏయే దశల్లో ఉన్నాయో వివరాలు తయారు చేయాలి. పనుల్లో ప్రగతి కనిపించాలి.
ప్రతి స్కూల్‌కూ స్మార్ట్ టీవీ
- డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలను బోధించేందుకు వీలుగా ప్రతి స్కూల్‌కూ స్మార్ట్ టీవీలను అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
- ఆంగ్ల మాధ్యమ బోధనపై సమీక్ష నిర్వహిస్తూ విద్యార్థులకు సమగ్రంగా అవగాహన కలిగేలా బోధన జరగాలని ఆదేశం.
- నూతన పద్ధతులను అనుసరింపచేయాలని సూచన.
- మధ్యాహ్న భోజనంలో నాణ్యత ఏమాత్రం తగ్గకూడదని ఆదేశం.
- రాష్ట్రమంతా ఒకే రకమైన మెనూ అమలు చేయాలి.
- రుచి, నాణ్యత ఒకేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- గోరుముద్ద కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు, సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించాలి.
- ఈ కార్యక్రమాన్ని యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలి.
- పాఠశాల ఆవరణల్లోని మరుగుదొడ్లు రన్నింగ్ వాటర్ సదుపాయంతో పరిశుభ్రంగా ఉండేలా తీర్చిదిద్దాలి.
- ఇందుకోసం ఏర్పాటు చేసిన యాప్‌లు సరిగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని తరచూ పరిశీలిస్తుండాలి.
- గోరుముద్ద పథకం బిల్లులు పెండింగ్‌లో ఉండకూడదని సీఎం ఆదేశం.
Published date : 11 Mar 2020 03:02PM