Skip to main content

5 కంపెనీలు.. లక్ష ఉద్యోగాలు..:మెగా క్లస్టర్ ప్రారంభ సమావేశంలో కేటీఆర్

సాక్షి, హైదరాబాద్: శాస్త్రీయ పురోగతి మూలంగా అభివృద్ధి పథంలో తెలంగాణ అగ్ర భాగాన ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు.
హైదరాబాద్‌లో ఏర్పాటయ్యే సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ ద్వారా ప్రయోగశాలల్లో పురుడు పోసుకునే ఆవిష్కరణలు పౌరుల జీవితాల్లో మార్పులు తెస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్) ఆధ్వర్యంలో నడిచే సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్‌ను శుక్రవారం కేటీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో రాష్ట్రంలో 5 పెద్ద కంపెనీలను ఏర్పాటు చేయడం ద్వారా సంపదతోపాటు లక్ష ఉద్యోగాలు సృష్టించడంపై దృష్టి సారించామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణను లైఫ్ సెన్సైస్, వ్యవసాయం, డిజిటల్ టెక్నాలజీ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తామని పేర్కొన్నారు. రిచ్ ద్వారా రాష్ట్రంలోని జాతీయ పరిశోధనాసంస్థలు, స్టార్టప్‌లు, పౌర సంఘాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒకేతాటిపైకి తెచ్చి స్థానికంగా నెలకొన్న సంక్లిష్ట సవాళ్లకు పరిష్కారం చూపుతామన్నారు. తద్వారా స్థానికుల జీవితాల్లో పరివర్తన సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఏరోస్పేస్, డిఫెన్స్, ఆహార, వ్యవసాయ, లైఫ్ సెన్సైస్ రంగాల్లో రిచ్ ఆవిష్కరణ వ్యవస్థలను ఏర్పాటు చేసిందని చెప్పారు. పునరుద్ధరణీయ ఇంధనం, వ్వర్థాల నిర్వహణ, ఎమర్జింగ్ టెక్నాలజీ రంగాలకు కూడా రిచ్ తన కార్యకలాపాలు విస్తరించిందని కేటీఆర్ గుర్తు చేశారు.

స్టియాక్ నిర్ణయం మేరకే మెగా క్లస్టర్..
దేశంలో శాస్త్ర పరిశోధన, ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఉద్దేశంతో ప్రధానమంత్రి శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణల సలహామండలి(పీఎం స్టియాక్) నిర్ణయం మేరకు హైదరాబాద్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ కె.విజయ రాఘవన్ వెల్లడించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేస్తున్న నాలుగు నగరాల్లో ఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, పుణే ఈ జాబితాలో ఉన్నాయన్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలను ఆధారంగా చేసుకుని మెగా క్లస్టర్లు సమర్థవంతమైన శాస్త్రీయ ఫలాలను అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మూడో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా భారత్..
‘దక్షిణ, మధ్య ఆసియా దేశాల్లో అత్యంత వినూత్న దేశంగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అగ్రస్థానానికి చేరే సత్తా భారత్‌కు ఉంది. తెలంగాణ కొత్త రాష్ట్రమైనా అన్ని రంగాల్లోనూ ఆవిష్కరణల మీద దృష్టిని కేంద్రీకరిస్తుండటంతో దేశంలోనే అత్యధిక వృద్ధిరేటును సాధిస్తోంది. అందుకే క్లస్టర్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేశాం. హైదరాబాద్‌లో 200పైగా కంపెనీలతో కూడిన అతిపెద్ద బయో క్లస్టర్ జీనోమ్ వ్యాలీ ఉంది. మరోవైపు ఫార్మా రంగానికి రాజధానిగా పేరు సంపాదించింది. దేశంలోని ఫార్మా ఉత్పత్తుల్లో 35 శాతం ఇక్కడ నుంచే వస్తున్నాయి. విత్తన రాజధానిగా, డిజిటల్ టెక్నాలజీ హబ్‌గా పేరు సంపాదించడంతోపాటు 60కి పైగా ప్రభుత్వ, బహుళ జాతి, ప్రైవేటు పరిశోధన సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి’అని విజయ రాఘవన్ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కేంద్ర శాస్త్రీయ విభాగం కార్యదర్శి డాక్టర్ అరబింద మిత్రా, రిచ్ డెరైక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్ పాల్గొన్నారు.
Published date : 09 Jan 2021 01:06PM

Photo Stories