Skip to main content

3,298 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి కసరత్తు..ఎక్కడంటే..!

సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో 3,298 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. అందుకు సంబంధించి కసరత్తు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
వాస్తవంగా వైద్య, ఆరోగ్యశాఖకు ముఖ్యమంత్రి గతంలో 12,289 పోస్టులను మంజూరు చేశారు. అందులో 9,381 పోస్టుల నియామకానికి అనుమతించారు. వాటిలో 2,917 మంది డాక్టర్లు, 4,268 నర్సులు, 2,196 పారామెడికల్ పోస్టు లున్నాయి. ఇప్పటికే 2,272 పోస్టులను సర్కారు భర్తీ చేసింది. ప్రస్తుతం 4,811 పోస్టులు భర్తీ ప్రక్రియలో ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘ఇంకా 2,298 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టా ల్సి ఉంది. అందులో 275 డాక్టర్, 957 నర్సులు, 1,011 పారా మెడికల్ పోస్టులున్నాయి. ఇవిగాక మరో వెయి్య పోస్టులను కూడా భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.. మొత్తంగా 3,298 పోస్టులు ఈసారి భర్తీ చేస్తాం..’అని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఖాళీ పోస్టులపై శుక్రవారం వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సమావేశమవ్వనున్నారు.

మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారానే..
ఇక ఆయా ఖాళీ పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఆర్‌బీ) ద్వారానే వైద్య పోస్టులను భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. గతంలో టీఎస్‌పీఎస్సీ ద్వారా వైద్య పోస్టులను భర్తీ చేసేవారు. కానీ భర్తీ ప్రక్రియ జాప్యమవుతుండటంతో ప్రభుత్వం మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఖాళీలను తప్పనిసరిగా భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవంగా ఇటీవలి కాలంలో అనేక ఆసుపత్రులకు తాత్కాలిక పద్ధతిలో డాక్టర్లు, నర్సులను నియమించారు. ఆయా పోస్టులనూ భర్తీ చేయాల్సి ఉందని అంటున్నారు. ఇటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది.
Published date : 18 Dec 2020 02:17PM

Photo Stories