Skip to main content

1.24 లక్షల మంది ప్రైవేట్‌ టీచర్లకు ఆర్థిక సాయం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా ప్రభావంతో ఇబ్బందుల్లో పడ్డ ప్రైవేటు పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి సాయం అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.
మొత్తంగా 1,24,704 మంది లబ్ధిదారులను విద్యాశాఖ ఎంపిక చేసింది. వారికి మంగళవారం నుంచి ఆర్థిక సాయం, బుధవారం నుంచి 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనుంది. రూ.2 వేల చొప్పున ఇచ్చే ఆర్థిక సాయం నేరుగా టీచర్లు, సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో వేయనుండగా.. ఎవరెవరు ఎక్కడెక్కడ రేషన్‌ బియ్యం తీసుకోవాలనే వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక సాయం కోసం ఇప్పటికే రూ.32 కోట్లు మంజూరు చేయగా.. 3,625 టన్నుల సన్న బియ్యాన్ని అందుబాటులో ఉంచింది.

ముందుగా యూడైస్‌ లెక్కల మేరకు..
ప్రభుత్వం అందించే సాయాన్ని ముందుగా విద్యాశాఖ లెక్కల్లో (యూ–డైస్‌) ఉన్న బోధన, బోధనేతర సిబ్బందికి అందించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 2020 మార్చి నాటికి తమ రికార్డుల్లో ఉన్న స్కూళ్లు, టీచర్లు, బోధన సిబ్బంది సమాచారాన్ని జిల్లాల డీఈవోలు ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్రంలోని 10,923 ప్రైవేటు స్కూళ్లలో 1,12,048 మంది బోధన సిబ్బంది, 12,636 మంది బోధనేతర సిబ్బందిని లబి్ధదారులుగా గుర్తించారు. మంగళవారం నుంచి ఈనెల 24వ తేదీలోగా ఆర్టీజీఎస్‌ ద్వారా నగదును వారి ఖాతాల్లో వేయనున్నారు. 25 కిలోల చొప్పున బియ్యాన్ని వారు దరఖాస్తు చేసుకున్నపుడు పేర్కొన్న రేషన్‌ షాపుల్లో అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు.

దరఖాస్తులు 2.06 లక్షలు..
వాస్తవానికి ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేసుకున్న బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్య 2.06 లక్షలు ఉంది. మొత్తం 1,53,525 మంది టీచర్లు, 52,820 మంది బోధనేతర సిబ్బంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ప్రస్తుతం సాయం అందేవారు పోగా.. మరో 41,477 మంది టీచర్లు, 40,184 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. వీరి విషయంలో ప్రభు త్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, వారికి కూడా ఆర్థిక సాయం అందుతుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నిర్ధారించిన లబ్ధిదారుల జాబితాను వెబ్‌సైట్‌లో (https:/ schoole du.telangana.gov.in) పెట్టనున్నా రు. డీఈవో కార్యాలయాలు, ఆయా పాఠశాలల్లోనూ జాబితాలను ప్రదర్శించనున్నారు.
Published date : 20 Apr 2021 04:55PM

Photo Stories