Skip to main content

ప్రమోషనా.. వద్దులే! ఈ వింత గాథ మీరే చదవండి...

ఆయన పేరు డాక్టర్ సతీష్ (పేరు మార్చాం).. హైదరాబాద్‌లోని ఒక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పీడియాట్రిక్ అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్నారు.

2017లో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా పదోన్నతి కల్పించి నిజామాబాద్‌కు బదిలీ చేశారు. ఆయనకు అక్కడకు వెళ్లడం ఇష్టంలేదు. ఎందుకంటే ఇక్కడ సొంత ప్రాక్టీస్‌తో పాటు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్సల్టెంటుగా పనిచేస్తున్నారు. దీంతో పదోన్నతిని వదులుకున్నారు.

ఆయన పేరు డాక్టర్ రాజేందర్ (పేరు మార్చాం).. హైదరాబాద్‌లో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ఆయన భార్య హైదరాబాద్‌కు సమీపంలోని జిల్లాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించే వారు. ఆమెకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా ప్రమోషన్‌తో హైదరాబాద్‌కు బదిలీ అయింది. అయితే భర్తకు ప్రొఫెసర్‌గా పదోన్నతిపై పక్క జిల్లాకు బదిలీ అయింది. కానీ భార్య ఇక్కడకు రావడంతో ఆయన ప్రమోషన్‌ను తిరస్కరించారు. భార్యాభర్తలిద్దరూ ఒకేచోట ఉండాలనుకోవడం సహజం. రెండోసారి కూడా అలాగే తిరస్కరించాడు. దీంతో ఆయనకు మూడోసారి చాన్స్ లేకుండా పోయింది. భార్య మాత్రం ప్రొఫెసర్‌గా పదోన్నతిపై ఇక్కడే ఉన్నారు. అరవై ఏళ్లు దగ్గర పడుతున్నా, జూనియర్లు కూడా ప్రొఫెసర్లు అవుతున్నా భర్త మాత్రం అసోసియేట్ ప్రొఫెసర్‌గానే ఉండిపోయారు.

అనేకమంది ప్రభుత్వ వైద్యులు పదోన్నతులు వదులుకుంటూ ఏళ్లుగా ఒకేచోట తిష్ట వేస్తున్నారు. మరీ ఒత్తిడి చేస్తే ఉద్యోగాన్ని కూడా వదిలేసుకుంటున్నారు. విచిత్రమేంటంటే రెండేళ్ల కిందట వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో స్పెషలిస్ట్ వైద్య పోస్టులను భర్తీ చేస్తే, ఇష్టమైన చోట పోస్టింగ్ ఇవ్వలేదని దాదాపు 200 మందికి పైగా ఉద్యోగాలు వదిలేసుకున్నారు. అంతేకాదు పోస్టింగ్ ఇచ్చాక సమాచారం ఇవ్వకుండా గైర్హాజరైన వారిలో దాదాపు 90 మందిని తీసేయడం గమనార్హం. ఇలా తృణప్రాయంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని, పదోన్నతులను తిరస్కరిస్తున్నారు. ఇష్టమైన చోట ఇస్తేనే ఉద్యోగమైనా, పదోన్నతైనా అన్న ధోరణి డాక్టర్లలో నెలకొంది. ప్రస్తుతం తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో పదోన్నతుల వ్యవహారం మొదలు కావడంతో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్న ఆందోళన వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలను వేధిస్తోంది. దాదాపు 500 మందికి ప్రమోషన్ ఇవ్వాల్సి ఉంది. కొందరు అసిస్టెంట్ సివిల్ సర్జన్ నుంచి డిప్యూటీ సివిల్ సర్జన్లుగానూ, నేరుగా సివిల్ సర్జన్లుగా పదోన్నతి పొందనున్నారు. కొందరు డిప్యూటీ సివిల్ సర్జన్ నుంచి సివిల్ సర్జన్లుగా పదోన్నతి పొందనున్నారు.

బాగా సెటిలయ్యారు... కదలట్లేదు
స్పెషలిస్ట్ వైద్యులుగా ఆసుపత్రుల్లో చేరేవారంతా ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో సొంత ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కొందరు క్లినిక్‌లు, మరికొందరు నర్సింగ్ హోంలు, ఇంకొందరు కన్సల్టెంట్లుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. దీంతో రెండు చేతులా లక్షల్లో సంపాదిస్తున్నారు. ఏళ్లుగా ఒక ప్రాంతంలో ఆసుపత్రి, ఇళ్లు సమకూర్చుకొని స్థిరపడ్డాక ఇక బయటకు వెళ్లడానికి ఏమాత్రం సుముఖత కనబరచడంలేదు. హైదరాబాద్‌లో, మరీ ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లో స్థిరపడినవారు మరోచోటకు పదోన్నతిపై వెళ్లడానికి ఇష్టపడడం లేదు. ఒకవేళ పదోన్నతి లభించినా తమకు అత్యంత సమీపంలో ఉన్న చోటకే వెళుతున్నారు. లేకుంటే పదోన్నతిని తిరస్కరిస్తున్నారు. ప్రాక్టీసుతో వచ్చే ఆదాయం ముందు... పదోన్నతితో కలిగే ఆర్థిక ప్రయోజనాలు ఏమూలకు అనే భావన నెలకొంది. దీంతో అనేక ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరత వేధిస్తోంది.

రెండుసార్లు వదులుకుంటే మూడోసారికి అనర్హత
పదోన్నతుల విషయంలో ఒక నిబంధన ఉంది. రెండుసార్లు ప్రమోషన్‌ను తిరస్కరిస్తే, అటువంటి వారు మూడోసారి ప్రమోషన్‌కు అర్హత కోల్పోతారు. ఇలా అర్హత కోల్పోయిన డాక్టర్లు అనేకమంది ఉన్నారని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే కొందరు నిబంధన తెలియక అర్హత కోల్పోతున్నారని, ఈ నేపథ్యంలో ప్రమోషన్లను తిరస్కరించడం వల్ల వచ్చే నష్టాన్ని ఈసారి వివరిస్తామని అధికారులు అంటున్నారు. అలాగే ఈసారి ప్రమోషన్లకు కౌన్సిలింగ్ నిర్వహిం చాక వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వెంటనే రిలీవ్ ఆర్డర్లు ఇస్తామని ఒక కీలకాధికారి తెలిపారు. ఇది ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందో చూడాలి.

Published date : 19 Feb 2021 03:19PM

Photo Stories