Skip to main content

Success Story: ఫస్ట్, సెకండ్, థర్డ్‌... మూడుసార్లు సక్సెస్‌ .. మూడో సారి ఏకంగా 14వ ర్యాంక్‌

ఐఏఎస్‌ ఈ పదంలోనే ఏదో తెలియని గమ్మత్తుంటుంది. అది అధికారం కావొచ్చు.. సమాజానికి సేవ కావొచ్చు... ఒకసారి ఐఏఎస్‌గా ఎంపికైతే చాలు అనుకునే యువత లక్షల్లో ఉంటారు. ఐపీఎస్, ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్‌ ఇలా అన్నింటికి సెలెక్ట్‌ అవుతున్నా తమ లక్ష్యం మాత్రం ఐఏఎస్‌ అని ఘంటాపథంగా చెబుతుంటారు. అలాంటి కోవలోకే వస్తారు చేకూరి కీర్తి. ఫస్ట్, సెకండ్, థర్డ్‌ అటెంప్ట్‌లలో వరుసగా సివిల్స్‌కు ఎంపికై సత్తాచాటారు. ఆమె విజయగాథ మీకోసం...
IAS Chekuri Keerthi

హైదరాబాద్‌లోని కమర్షియల్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌. కీర్తి చేకూరికి ఐఆర్‌ఎస్‌ అధికారిగా అది రెండో రోజు. మరుసటి రోజే సివిల్స్‌ తుదిఫలితాలు. అప్పటికే ఆమె రెండు సార్లు సివిల్స్‌ రాసింది. మొదటి సారి 440వ ర్యాంకు తెచ్చుకుని ఐఆర్‌ఎస్‌గా ఎంపికయ్యారు. రెండో సారి 512 ర్యాంకు తెచ్చుకున్నారు. ఐఏఎస్‌ లక్ష్యంతో పట్టుదలగా చదివి మూడోసారి ఆల్‌ ఇండియా లెవల్‌లో 14వ ర్యాంకు సాధించారు.   
కుటుంబ నేపథ్యం ఇదీ...
ఓ వైపు ఐఆర్‌ఎస్‌ శిక్షణ, మరోవైపు మూడోసారి సివిల్స్‌ కోసం సిద్ధం కావడం.. రెండు పడవల్లో ప్రయాణంలా అనిపించింది. మాది వైజాగ్‌. నాన్న వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చేశాం. ఇంట్లో నేనూ, తమ్ముడు. మొదటి నుంచి సమాజానికి ఉపయోగపడే కీలక బాధ్యతల్లో ఉండాలనే కోరిక నాలో ఉండేది. దానికి మూలం మా తాత డీసీహెచ్‌ తిరుపతి రాజు. విశాఖ నౌకాశ్రయం ఆపరేషన్‌ మేనేజర్‌గా ఉన్నా.. ఎన్నో సేవాకార్యక్రమాలు ఆయన నిర్వహించేవారు. స్కూల్, కాలేజీ డేస్‌లో నేనూ నలుగురికి సాయపడటం అలవర్చుకున్నా.  
ఐఐటీ మద్రాస్‌లో సీటు...IAS Chekuri Keerthi
ఇంటర్‌ తర్వాత మద్రాసు ఐఐటీలో చేరా. నాకొచ్చిన అత్తెసరు ర్యాంకుకి మెటలర్జీ అండ్‌ మెటీరియల్ సైన్స్‌ ఎంచుకోవాల్సి వచ్చింది. అక్కడ మూడో ఏడాది వరకూ ఏం చేయాలో నాకో స్పష్టత లేదు. ఓసారి అక్కడ నిర్వహించిన కెరీర్‌ గైడెన్స్‌ కార్యక్రమానికి తమిళనాడు ఐఏఎస్‌ అధికారి వచ్చారు. ఐఏఎస్‌గా ఎంపికైతే ప్రజలకెంత మేలు చేయొచ్చో ఆయన వివరించిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడే సివిల్స్‌ రాయాలని నిర్ణయించుకున్నా. నా స్నేహితులంతా క్యాంపస్‌ ఎంపిక కోసం సిద్ధమవుతుంటే నేనేమో ఐఏఎస్‌ కలలతో.. ప్రణాళికలు వేసుకోవడంలో మునిగిపోయా. 
పట్టువదలకుండా ప్రయత్నించా...
నా ప్రాప్తం ఇంతే.. అనుకోలేదు. మరోసారి ప్రయత్నించాలనుకున్నా. ఐఆర్‌ఎస్‌ శిక్షణకు వెళుతూనే మరో ప్రయత్నం చేయాలనుకున్నా. కొద్దికాలం శిక్షణకు హాజరయ్యా. ఓ పక్క తరగతులకు హాజరవుతూ రికార్డులు, పరీక్షలు, టూర్‌లతో తీరిక ఉండేది కాదు. ఐఆర్‌ఎస్‌లో చివరి ఆరునెలల శిక్షణ మరింత కఠినంగా మారింది. దేశ, విదేశాల్లోని పలు ప్రాంతాల్లో తిరగాల్సి వచ్చింది. ఇంటిపట్టున ఉంటే చదివేందుకు కొంత సమయం చిక్కేదేమో. ఐఆర్‌ఎస్‌ శిక్షణ తీసుకుంటూ ఒక్కోసారి 20 గంటలు నిరంతరంగా చదివితే.. ఒక్కోసారి గంటైనా ఉండదు. ఈ సమయంలో నన్ను నేను మోటివేట్‌ చేసుకోవడానికి చాలా కష్టపడ్డా. 
సమయం ఉన్నప్పుడల్లా మాక్‌ ఇంటర్వ్యూలే...
కానీ సమయం ఉన్నప్పుడంతా మాక్‌ ఇంటర్వ్యూలకు హాజరయ్యేదాన్ని. మొదటి రెండు సార్లు ఎంపిక కాకపోవడానికి కారణాలను వెతుక్కున్నా. అప్పట్లో మార్కులకంటే సబ్జెక్టులపైనే దృష్టి పెట్టేదాన్ని. మెయిన్స్‌లో స్టోరీ రైటింగ్‌ ప్రధానమని అర్థమైంది. అందరి దగ్గరా ఒకేలాంటి సబ్జెక్ట్‌ ఉన్నప్పటికీ దాన్ని వ్యక్తీకరించే విధానం ముఖ్యమని అర్థమైంది. మూల్యాంకనం చేసేవాళ్లు అందరి పేపర్లు చదువుతారు. ఇలాంటప్పుడు మనం విభిన్నంగా కనిపించాలి. చిన్న చార్ట్‌లూ, బాణపు గుర్తులూ, డయాగ్రమ్‌లూ, కేస్‌ స్టడీస్‌ ఇలా.. విభిన్నంగా ప్రత్యేకంగా రాయడం అలవాటు చేసుకున్నా.  
చందేరీకి.. పోచంపల్లికీ తేడా ఏంటీ?
నేను అనుకున్నంత కఠినంగా లేదు. గంభీరంగా ఉంటుందనుకున్న ఇంటర్వ్యూ వాతావరణం అలా లేదు. మొదటి ప్రశ్నతోనే భయం పోగొట్టారు. ఇంటర్వ్యూకి కాస్త గంభీరంగా కనిపించాలని చందేరీ చీర కట్టుకుని వెళ్లా. అదేం రకం అని అడిగితే.. చెప్పా. మరి చందేరికీ, పోచంపల్లికీ తేడా ఏమిటీ? అని అడిగారు. ‘తెలియదు సార్‌’ అన్నా. ‘నేటితరం అమ్మాయి..’ అంటూ అందరూ నవ్వేశారు. ఆ తర్వాత ప్రశ్నలు నా వృత్తి, ఇతర అంశాలపై సాగాయి. ముఖ్యంగా కస్టమ్స్‌ అధికారిగా ట్రేడ్‌ ఆఫీస్‌ని టాప్‌ పొజిషన్‌ లోకి ఎలా తీసుకొస్తారని అడిగారు. లాభాలు పెంచడానికి ఏం చేస్తావని ప్రశ్నించారు. అలా సాఫీగానే సాగింది.
నాలుగేళ్లలో ఏ రోజూ టీవీ చూడలేదు...
నాలుగేళ్లలో నేను విఫలమైన ప్రతిసారీ నాలో కసి పుట్టిందే తప్ప నిరుత్సాహం నా దరికి చేరలేదు. మధ్యలో చాలా సార్లు నా ఏకాగ్రత దెబ్బతింది. నిజానికి మొదటిసారి నేను సివిల్స్‌ సన్నద్ధం అవుతున్నప్పటి నుంచి ఇప్పటిదాకా మా అమ్మ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఉదయాన్నే నేను 3.30కి లేచి చదవాలనుకుంటే అమ్మ గంట ముందే లేచి తాను తయారయ్యేది. అలా నాకు గడియారం అవసరమే రాలేదు. నాలుగేళ్లలో ఒక్కసారీ కూడా టీవీ చూడలేదంటే నమ్మండి. అలా అనడం కన్నా.. మా ఇంట్లో టీవీ లేదు అనడం మేలేమో. అమ్మేమో పత్రికలు, మేగజైన్‌లలో వచ్చిన స్ఫూర్తిమంతమైన విజేతల కథనాలను చదివి వినిపించేది. నా కోసం అమ్మ పెళ్లిళ్లూ, పేరంటాలకి పోవడం కూడా మానేసింది.

Published date : 09 Dec 2022 07:16PM

Photo Stories