Skip to main content

విశ్లేషణతో విజయం ముంగిటకు...సివిల్స్ మెయిన్స్ జీఎస్-2

సివిల్స్-2014 ప్రిలిమ్స్‌లో విజయం సాధించిన అభ్యర్థులు ఇప్పుడు మెయిన్స్‌కు సిద్ధమవుతున్నారు. ఇందులోనూ గెలుపు గమ్యాన్ని చేరుకోవాలంటే కీలకమైన జనరల్ స్టడీస్ పేపర్లలో మెరుగైన మార్కులు సాధించాలి.
మెయిన్స్‌లో మెరిట్‌కు పరిగణనలోని తీసుకునే ఏడు పేపర్లలో నాలుగు జీఎస్ పేపర్లే! వీటికి వెయ్యి మార్కులు కేటాయించారు. ఈ తరుణంలో పొలిటికల్ సైన్స్ ప్రధానంగా ఉన్న జీఎస్ పేపర్-2 సిలబస్‌లోని అంశాలు, వాటిపై పట్టు సాధించేందుకు వ్యూహాలపై విశ్లేషణ...

పేపర్ 2- పాఠ్యాంశాలు
  • పరిపాలన, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు.
  • భారత రాజ్యాంగం, చారిత్రక నేపథ్యం, పరిణామ క్రమం, లక్షణాలు, సవరణలు, మూల నిర్మాణం.
  • కేంద్రం, రాష్ట్రాల కార్యకలాపాలు, బాధ్యతలు, సమాఖ్య వ్యవస్థ తీరుతెన్నులు.
  • ప్రభుత్వంలోని వివిధ అంగాల మధ్య అధికారాల విభజన.
  • వివిధ దేశాల రాజ్యాంగాలు-భారత్ రాజ్యాంగంతో పోలిక.
  • పార్లమెంటు, రాష్ట్రాల శాసన వ్యవస్థలు- నిర్మాణం, కార్యకలాపాలు.
  • కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల నిర్మాణం, పనిచేసే విధానం.
  • ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ముఖ్యాంశాలు.
  • వివిధ రాజ్యాంగ పదవుల నియామకాలు, రాజ్యాంగ పదవులు, అధికారాలు, విధులు.
  • చట్టబద్ధ, నియంత్రిత, వివిధ పాక్షిక న్యాయ సంస్థలు.
  • ప్రభుత్వ విధానాలు,ప్రగతికి ప్రభుత్వం చూపే చొరవ.
  • అభివృద్ధి ప్రవృత్తి, ప్రగతికి దోహదం చేసే పరిశ్రమలు..
  • బలహీన వర్గాలు-సంక్షేమ పథకాలు.
  • సామాజిక రంగ సేవల అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన అంశాలు.
  • పేదరికం, ఆకలి సంబంధిత అంశాలు.
  • పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం.
  • ప్రజాస్వామ్యంలో సివిల్ సర్వీస్ పాత్ర..
  • భారత్, పొరుగు దేశాలతో సంబంధాలు., గ్లోబల్ గ్రూపులు.
  • భారత్‌పై అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల విధానాలు, రాజకీయాల ప్రభావం.
  • ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు.
2012 - 2013:
    Bavitha
  • సివిల్స్ మెయిన్స్-2012 జనరల్ స్టడీస్ పేపర్లలో 20 పదాలు, 50 పదాలు, 150 పదాలు ఇలా వివిధ పరిమాణాల సమాధానాలు రాయాల్సిన ప్రశ్నలు వచ్చాయి. దీనికి భిన్నంగా 2013 మెయిన్స్‌లో అన్నీ 200 పదాల ప్రశ్నలే ఎదురయ్యాయి. దీంతో అభ్యర్థులు ఒత్తిడికి గురయ్యారు.
  • గతంలో చాయిస్ ఉండేది. కానీ, 2013లో 25 ప్రశ్నలు ఇవ్వగా, అన్నింటికీ సమాధానాలు రాయమన్నారు.
  • మూడు గంటల సమయంలో 25 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. ఈ తరుణంలో విజయానికి సమయ పాలన కీలకంగా మారింది.
చట్టాలు- అమలు తీరుతెన్నులు:
చట్టాలను అమలు చేసే క్రమంలో రాజ్యాంగంలో నిర్దేశించిన అంశాల ఉల్లంఘనకు అవి ఎలా కారణమవుతున్నాయనే దానిపై విశ్లేషణాత్మక అధ్యయనం అవసరం. వీటికి సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఉదాహరణకు గత పరీక్షలో ‘‘ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ (ఎలక్ట్రానిక్ మెసేజ్ పంపడం) లోని అంశాల అమలు.. రాజ్యాంగంలోని అధికరణ 19 (భావ ప్రకటన స్వేచ్ఛ) ద్వారా ప్రజలకు సంక్రమించిన హక్కుల ఉల్లంఘనకు కారణమవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని చర్చించండి..’’ అనే ప్రశ్న వచ్చింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఇటీవల కాలంలో అమల్లోకి వచ్చిన వివిధ చట్టాలు, వాటి అమలు తీరును రాజ్యాంగ ప్రకరణలకు అన్వయిస్తూ అధ్యయనం చేయాలి.

న్యాయ వ్యవస్థదే పైచేయా?
నేడు చాలా సందర్భాల్లో ప్రభుత్వాల నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇవి రాజ్యాంగ అమలుకు అడ్డంకు లు సృష్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాల నిర్ణయాలు.. రాజ్యాంగ బద్ధమా.. కాదా? అనే దానిపై కోర్టుల్లో విచారణలు జరిగి, తీర్పులు వెలువడుతున్నాయి. ఈ సందర్భంలో ప్రభుత్వంలోని శాసన నిర్మాణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థదే పైచేయిగా బయటకు కనిపిస్తోంది. అభ్యర్థులు ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం, ఆర్థికాభివృద్ధి తదితరాలకు సంబంధించి తీసుకునే కొన్ని నిర్ణయాలు రాజ్యాంగం కోణంలో ఎలా వివాదాస్పదమవుతున్నాయో తెలుసుకోవాలి.

నియంత్రణ వ్యవస్థలకు ప్రాధాన్యం!
సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణల నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వాల ప్రాధాన్యం తగ్గి, నియంత్రణ వ్యవస్థల కార్యకలాపాలు కీలకమయ్యాయి. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్.. ఇలా వేర్వేరు రంగాలకు చెందిన నియంత్రణ సంస్థలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థులు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్ తదితర రంగాల్లో సమకాలీన పరిణామాలు, నియంత్రణ వ్యవస్థల పాత్రపై అవగాహన పెంపొందించుకోవాలి.

సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు:
పేదరిక నిర్మూలన, అందరికీ విద్య, ఆర్యోగం, మహిళాభివృద్ధి, శిశు మరణాల తగ్గింపు, నిరుద్యోగం తగ్గించడం తదితరాలకు సంబంధించిన సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు, వీటిని నెరవేర్చడంలో భారత్ పురోగతిపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి. లక్ష్యాల సాధనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అవి ఎంత వరకు సఫలీకృతమవుతున్నాయి? వంటి వాటిని తెలుసుకోవాలి. ప్రైవేటు రంగ సహకారం పొందడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు చేరువచేయడంలో (ముఖ్యంగా ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్) భారత్ చెప్పుకోదగ్గ పురోగతి సాధించింది. ఇదే సమయంలో ఆకలితో బాధపడే వారి సంఖ్యను తగ్గించే విషయంలో పురోగతి చాలా తక్కువగా ఉంది. గత మెయిన్స్‌లో ఆరోగ్యానికి సంబంధించిన సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను గుర్తించి, వాటి సాధనకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంతమేర సఫలమయ్యాయో చర్చించండి? అనే ప్రశ్న ఇచ్చారు.

పొరుగు దేశాలు-సంబంధాలు:
దక్షిణాసియా ప్రాంతంలో భారతదేశం కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ ప్రాంతంలోని మిగిలిన దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి. ఇదే సమయంలో ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు తమ సమస్యల్ని పరిష్కరించుకోలేక, వాటికి కార ణం భారత్ అంటూ ఆరోపణలు చేస్తున్నాయి. చైనా, జపాన్, వియత్నాం తదితర దేశాలతో భారత్ సం బంధాలను అధ్యయనం చేయాలి. ఇటీవల చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాల మెరుగుకు ఎంత వరకు దోహదపడగలదో విశ్లేషించండి? అనే కోణంలో ఈసారి ప్రశ్న రావొచ్చు.
  • భారత ప్రధాని నరేంద్ర మోదీ అయిదు రోజుల పాటు జపాన్‌లో పర్యటించడం.. రక్షణ రంగంలో పరస్పర సహకారానికి స్నేహ హస్తం చాచడం.. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలను ఆహ్వానించడం తదితర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు వియత్నాం రక్షణ, భద్రతా దళాల ఆధునికీకరణకు సాయం చేస్తామని భారత్ ప్రకటించింది. భారత్ నుంచి నాలుగు గస్తీ నౌకల కొనుగోలుకు వియత్నాం అంగీకరించడం వంటివి ఈ రెండు దేశాల సంబంధాల బలోపేతానికి జరుగుతున్న కసరత్తులో భాగమే. ఈ నేపథ్యంలో భారత్.. జపాన్, వియత్నాంలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకోవడం చైనాను ఇరుకున పెట్టేందుకేనా? చర్చించండి అనే కోణంలో ప్రశ్న రావొచ్చు. ఇదే విధంగా భారత్ పొరుగుదేశాలతో చైనా సంబంధాలు, వాటి ప్రభావంపైనా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
కూటములకు ప్రాధాన్యం:
గతంతో పోల్చితే ప్రపంచ బ్యాంకు, డబ్ల్యూటీవో, ఐఎంఎఫ్.. తదితర అంతర్జాతీయ సంస్థల కంటే ప్రస్తుతం ప్రాంతీయ కూటములకు ప్రాధాన్యం పెరిగింది. జీ-8, జీ-20, బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) తదితర కూటములు సమకాలీన ప్రపంచంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దేశాలు ప్రపంచ ప్రయోజనాలు కాకుండా స్వీయ ప్రయోజనాల కోణంలో ఆలోచిస్తున్నాయి. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలు పొందేందుకు అవసరమైన దేశాలతో మాత్రమే జట్టుకడుతున్నాయి. ఈ క్రమంలోనే కూటములకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉదాహరణకు బ్రిక్స్‌ను చెప్పుకోవచ్చు. ఈ కూటమి ఆరో సదస్సు 2014, జూలైలో బ్రెజిల్‌లో జరిగింది. ఇందులో 10,000 కోట్ల డాలర్ల ప్రారంభ అధీకృత మూలధనంతో బ్రిక్స్ బ్యాంక్ నెలకొల్పేందుకు నేతలు ఆమోదం తెలిపారు. అభ్యర్థులు ఈ బ్యాంకు ఏర్పాటుకు కారణాలు; ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులకు ఇది ఎంత మేరకు పోటీగా నిలుస్తుంది? పర్యవసనాలు? భారత్‌కు ప్రయోజనాలు? తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.

భారత ప్రయోజనాలే కేంద్రంగా:
దేశం, కూటమి, అంతర్జాతీయ సంస్థ.. దేని గురించి చదువుతున్నా భారత్‌ను దృష్టిలో ఉంచుకొని అధ్యయనం చేయాలి. చైనా ఒకవైపు భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నానంటూనే మరోవైపు అంతర్జాతీయ వేదికలపై భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో మన దేశానికి శాశ్వత సభ్యత్వం రాకుండా అడ్డుపుల్ల వేస్తోంది. ఆహార భద్రతకు సంబంధించి డబ్ల్యూటీవోలో భారత్ వినిపించిన వాణి వంటి అంశాలను అధ్యయనం చేయాలి.

గుర్తుంచుకోండి..
  • గత మెయిన్స్ విధానాన్నే ఈసారి కూడా కొనసాగించవచ్చని ఆశించవచ్చు. అదే జరిగితే సమయానికి ప్రాధాన్యమివ్వాలి. ఒక్కో ప్రశ్నకు దాదాపు ఏడు నిమిషాలు అందుబాటులో ఉంటుంది.
  • 200 పదాలకు మించకుండా సమాధానం రాయమన్నారేగానీ కచ్చితంగా అన్ని పదాల్లో సమాధానం ఉండాలని లేదన్నది గుర్తించాలి.
  • సూచనల్లో ‘సమాధానం పరిమాణం కంటే దాని నాణ్యత ప్రధానమని’ ఇచ్చారు. అందువల్ల ఎంత రాశామనేదాని కంటే ఎంత కచ్చితమైన విశ్లేషణను అందించామన్నదే ముఖ్యమని గుర్తించాలి.
  • ఒకట్రెండు తప్ప అన్ని ప్రశ్నలకూ సమాధానం రాసేందుకు ప్రయత్నించాలి. మెయిన్స్ ప్రిపరేషన్ లో భాగంగా రైటింగ్ ప్రాక్టీస్‌కూ ప్రాధాన్యమివ్వాలి.
Published date : 13 Nov 2014 05:11PM

Photo Stories