Skip to main content

సివిల్స్ మెయిన్స్‌కు సన్నద్ధత ఇలా..

దేశంలో అత్యున్నత సర్వీసులను చేజిక్కించుకునేందుకు వీలుకల్పించే ‘సివిల్స్’ రెండో దశ అయిన మెయిన్స్ పరీక్షలు డిసెంబరు 18 నుంచి జరగనున్నాయి. అందుబాటులో ఉన్న ఈ 15 రోజుల్లో చేసే రివిజన్, పరీక్ష రాసే విధానం విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటికే కంటెంట్‌పై పట్టు సాధించటాన్ని పూర్తిచేసి ఉంటారు కాబట్టి మిగిలిన సమయంలో రివిజన్, ప్రజంటేషన్‌పై పూర్తి స్థాయిలో దృష్టిసారించాలంటున్నారు గత విజేతలు. మెయిన్స్ మెట్టును విజయవంతంగా అధిరోహించేందుకు సివిల్స్-2013 టాపర్స్ ముషారఫ్ ఫరూఖి, ఎస్.కృష్ణ ఆదిత్య, సబ్జెక్టు నిపుణులు అందిస్తున్న సూచనల సమాహారం...
  • పరీక్షకు ముందు అందుబాటులో ఉన్న ఈ కొద్ది రోజుల్లో రివిజన్ ఎలా ఉండాలి?
    జవాబు: ఇది కీలక సమయం. దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఈ సమయంలో కొత్త అంశాలను చదవకపోవడం ఉత్తమం. సబ్జెక్టుల వారీగా ముఖ్య అంశాలను ఇప్పటికే గుర్తించి ఉంటారు కాబట్టి, వాటిని ఒకటికి రెండుసార్లు చదవాలి. వాటి నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముందో గుర్తించి, తమదైన శైలిలో సమాధానాలు రాయటాన్ని ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

  • పరీక్షకు ముందు తీవ్ర ఒత్తిడి ఉంటుంది. దీన్ని ఎలా అధిగమించాలి?
    జవాబు: కొన్ని చాప్టర్లను చదవలేదన్న ఆలోచనలతో చాలా మంది ఈ సమయంలో ఒత్తిడికి గురవుతారు. చదవని అంశాలపై కంటే చదివిన, ముఖ్యమైన అంశాలపై దృష్టిసారించాలి. ఇంకా చదవని అంశాలు చాలా ఉన్నాయనే ఆలోచనలను పక్కన పెట్టాలి. పరీక్షలో బాగా ప్రజెంట్ చేయటంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలి. ఈ సమయంలో టెన్షన్ ప్రతి అభ్యర్థికీ ఉంటుందని గుర్తిస్తే కాసింత ఉపశమనం లభిస్తుంది.

  • పరీక్షలో చాలా ప్రశ్నలుంటాయి. సమయం తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని విజయవంతంగా అధిగమించాలంటే ఏం చేయాలి?
    జవాబు: దీనికోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఒక అంశంపై ప్రశ్న వస్తే ప్రారంభం ఎలా ఉండాలి? ముగింపు ఎలా ఉండాలి? అందులో ఏ అంశాలను రాయాలి? అనే విషయాలను ప్రాక్టీస్ చేయాలి. ప్రధానంగా ఇతర దేశాలతో భారత్ ఆర్థిక సంబంధాలు, పర్యావరణ సమస్యలు, ఇటీవల కాలంలో రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా రఫ్‌గా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే పరీక్షలో చాలా సమయం ఆదా అవుతుంది. లేకపోతే గందరగోళం తలెత్తుతుంది. ఇంకా ఒక పాయింట్ మిగిలి ఉంది. దాన్ని ఎక్కడ రాయాలి? ఎలా రాయాలి? ఇలా రకరకాల సందేహాలు తలెత్తి, సమయం వృథా అవుతుంది.

  • పరీక్షలో చేతి రాత ప్రాధాన్యం ఏమిటి?
    జవాబు: మెయిన్స్ పరీక్షలు డిసెంబరు 18న ప్రారంభమై, 23తో ముగుస్తాయి. ఈ స్వల్ప వ్యవధిలోనే అభ్యర్థులు 9 పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో సమాధానాలను ప్రజెంట్ చేయటంలో చేతి రాత కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే వేగంగా, స్పష్టంగా రాయటాన్ని ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే పరీక్ష మధ్యలో చేతి వేళ్లు పట్టేస్తాయి. దీనివల్ల చాలా సమయం వృథా అవుతుంది.

  • ఈ సమయంలో కూడా న్యూస్ పేపర్లను బాగా చదవాలా?
    జవాబు: ఇప్పటికే ప్రశ్నపత్రాల రూపకల్పన పూర్తవుతుంది కాబట్టి న్యూస్ పేపర్లను క్షుణ్నంగా చదవాల్సిన అవసరం లేదు. అలాగని చదవటం ఆపేయకూడదు. ముఖ్యమైన అంశాలను చదివితే సరిపోతుంది. దీనివల్ల ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు అప్‌డేట్ సమాచారం ఇచ్చి, ఎగ్జామినర్‌ను ఆకట్టుకోవచ్చు.

  • పరీక్ష సమయంలో ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
    జవాబు: ఎంత బాగా చదివినప్పటికీ, పరీక్షలు జరిగే సమయంలో అనారోగ్యానికి గురైతే అంతా వృథా అవుతుంది. అందువల్ల ఆరోగ్యంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటివి రాకుండా ఉండేందుకు వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. పాలలో పసుపు కలిిపి (turmeric milk) తాగటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాచి, వడపోసిన నీరు తాగాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. శాకాహారం తీసుకోవటం మంచిది. తగిన విశ్రాంతి తీసుకోవాలి. శారీరక వ్యాయామానికి రోజూ అరగంట కేటాయించాలి.

  • స్కోరింగ్‌కు కీలకమైన జనరల్ ఎస్సే పేపర్లో అధిక మార్కులు సాధించాలంటే ఏం చేయాలి?
    జవాబు: గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఎస్సేలు ౌఞ్ఛ ్ఛఛ్ఛీఛీగా ఉంటున్నట్లు అర్థమవుతోంది. ఈ పేపర్లో అధిక స్కోర్ సాధించాలంటే ముందే కొన్ని ప్రామాణిక అంశాలపై రెడీమేడ్ ఎస్సేలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవి బాగా ఉపయోగపడతాయి. ఎస్సే రాసేటప్పుడు ముఖ్యమైన అంశాలను అండర్‌లైన్ చేస్తే బాగుంటుంది. సబ్‌హెడ్డింగ్స్ పెట్టాలి. అవసరం మేరకు చిన్న చిన్న బొమ్మలు, గ్రాఫ్‌లు ఉపయోగించాలి. ఇచ్చిన అంశం చిన్నదే అనిపించినప్పటికీ (Ex: With greater power comes greater responsibility) విస్తృతంగా ఆలోచించి, ఎస్సే రాయాలి. పరిమితులు విధించుకొని రాసే ఎస్సే ప్రభావవంతమైన ఎస్సే అనిపించుకోదు. ఏ అంశం ఇచ్చినా, నిర్దిష్ట అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలగాలి.

  • జీఎస్ పేపర్-4 (ఎథిక్స్, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్)లో ఎక్కువ మార్కులు సాధించాలంటే ఏం చేయాలి?
    జవాబు: ఎథిక్స్ పేపర్లో రెండు (ఫిలాసఫికల్, కేస్‌స్టడీ) భాగాలుంటాయి. కేస్‌స్టడీ విభాగంలో ఒక కలెక్టర్/ఎస్పీ లేదంటే మరో అధికారి రోజువారీ విధుల్లో ఎదురయ్యే అయోమయ (dilemmas) పరిస్థితులకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. వీటికి పాలనా దక్షత, నిజాయితీని ప్రతిబింబించేలా సమాధానాలు రాయాలి. శక్తి, సంపద, ధర్మ (డ్యూటీ), నిజాయితీ తదితర ఫిలాసఫీ అంశాలకు సంబంధించిన సమాధానాల్లో మంచి కొటేషన్స్ రాయాలి. కేస్‌స్టడీలకు సంబంధించి స్వీయ వివేచన ఆధారంగా, నిర్మాణాత్మకంగా, ప్రాక్టికల్‌గా సాధ్యమయ్యేలా సమాధానాలు ఇవ్వాలి.

  • ప్రశ్నలకు సమాధానాలను పాయింట్ల రూపంలో రాయాలా? లేదంటే పారాగ్రాఫ్‌ల రూపంలో రాయాలా?
    జవాబు: ఇచ్చిన ప్రశ్నను బట్టి సమాధానాన్ని పాయింట్ల రూపంలో రాయాలా? పారాగ్రాఫ్ రూపంలో రాయాలా అనేది నిర్ణయించుకోవాలి. కొన్ని ప్రశ్నలకు పాయింట్ల రూపంలో సమాధానం రాయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మరికొన్నింటికి రెండు విధానాలనూ జోడిస్తూ రాసినప్పుడే మేలు జరుగుతుంది. ఉదాహరణకు భూసేకరణ బిల్లు-ప్రతిపాదిత సవరణలకు సంబంధించిన సమాధానాన్ని పాయింట్ల రూపంలో రాస్తే బాగుంటుంది.

  • ప్రశ్నల్లో అనలైజ్, క్రిటికల్లీ అనలైజ్, ఎన్యుమరేట్, ఎక్స్‌ప్లెయిన్, కామెంట్ వంటి పదాలు కనిపిస్తాయి. వీటిని ప్రాధాన్యం ఏమిటి?
    జవాబు: ఒక ప్రశ్నకు సమాధానం రాసేముందు ఎగ్జామినర్ అభ్యర్థి నుంచి ఎలాంటి సమాధానాన్ని ఆశిస్తున్నారో ఈ పదాల ద్వారా తెలుస్తుంది. అనలైజ్ అంటే ఒక అంశాన్ని లోతుగా పరిశీలిస్తూ, విశ్లేషణాత్మకంగా రాయాలి. క్రిటికల్లీ అనలైజ్ అంటే విమర్శనాత్మ పరిశీలనతో సమాధానం రాయాలి. ఎన్యుమరేట్ అంటే సంబంధిత అంశంపై ఉన్న సమాచారాన్ని యథాతథంగా చెప్పాలి. కామెంట్ అంటే ముఖ్యాంశాలతో పాటు అభ్యర్థి నిర్దేశ అంశంపై తన అభిప్రాయాలను వెల్లడించాలి.

  • పాలిటీ, గవర్నెన్స్‌కు సంబంధించి ముఖ్యంగా దృష్టిసారించాల్సిన అంశాలేవి?
    జవాబు: నేడు చాలా సందర్భాల్లో ప్రభుత్వాల నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ఇవి రాజ్యాంగ అమలుకు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజా సంక్షేమం, ఆర్థికాభివృద్ధి తదితరాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొనే కొన్ని నిర్ణయాలు రాజ్యాంగం కోణంలో ఎలా వివాదాస్పదమవుతున్నాయో అనే కోణంలో ప్రశ్నలు రావొచ్చు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమైనది.

  • ఎకానమీకి సంబంధించి ఏ అంశాల నుంచి ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది?
    జవాబు:
    ఎకానమీకి సంబంధించి ప్రధానంగా పారిశ్రామిక సంస్కరణలు, పన్నుల సంస్కరణలు, మూలధన మార్కెట్లో సంస్కరణల అమలు ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావంపై ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల నేపథ్యంలో వివిధ దేశాలతో భారత్ ఆర్థిక సంబంధాల ముఖచిత్రంపై ప్రశ్నలు రావొచ్చు. మేకిన్ ఇండియా, ఎఫ్‌డీఐ పరిమితులు వంటి అంశాలు ముఖ్యమైనవి.

గుర్తుంచుకోండి..
  • అభ్యర్థుల్లోని విషయ పరిజ్ఞానం, తార్కిక విశ్లేషణ సామర్థ్యం, భావ వ్యక్తీకరణ నైపుణ్యం, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం- స్థూలంగా సివిల్స్ మెయిన్స్ ప్రధానోద్దేశం ఇదే. అందుకే పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి ఈ నాలుగు లక్షణాలను పెంపొందించుకుని ఆత్మవిశ్వాసంతో పరీక్ష హాల్లో అడుగుపెట్టాలి. ఇవన్నీ ఉంటే విజయానికి చేరువైనట్లే.
  • సంబంధిత ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు పరీక్ష రోజు వరకు ఆ అంశం/రంగంపై ప్రస్తుతం ఏయే మార్పులు, పరిణామాలు జరిగాయో తెలుసుకోవాలి. వాటిని అప్లికేషన్ ఓరియెంటెడ్ మెథడ్‌లో సమాధానాలకు వర్తింపచేయాలి.
  • సమాధానం సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా రాయాలి. అభ్యర్థులు అందరి దగ్గర ఒకే విధమైన సమాచారం ఉంటుంది. ఎవరైతే సృజనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా, మిగిలినవారికంటే భిన్నంగా రాయగలరో వారే పోటీలో ముందంజలో ఉంటారు.

టాపర్స్ టిప్స్
రైటింగ్ ప్రాక్టీస్‌పై దృష్టిసారించాలి
ఇప్పుడు దృష్టంతా ప్రశ్నలకు సమాధానాలను ఎలా ప్రజెంట్ చేయాలనే దానిపైనే పెట్టాలి. రైటింగ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. సబ్జెక్టుల వారీగా ముఖ్య అంశాలను ఇప్పటికే గుర్తించి ఉంటారు కాబట్టి, వాటిని వీలైనన్ని సార్లు చదవాలి. వాటి నుంచి ఏ కోణంలో ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముందో గుర్తించాలి. వాటికి తమదైన శైలిలో సమాధానాలు రాయటాన్ని ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక అంశంపై ప్రశ్న వస్తే ప్రారంభం ఎలా ఉండాలి? ముగింపు ఎలా ఉండాలి? అందులో ఏ అంశాలను రాయాలి? అనే విషయాలను మెదడులో నిక్షిప్తం చేసుకోవాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఎస్సేలు open endedగా ఉంటున్నట్లు అర్థమవుతోంది. ఈ పేపర్లో అధిక స్కోర్ సాధించాలంటే ముందే కొన్ని ప్రామాణిక అంశాలపై ఎస్సేలను సిద్ధంగా ఉంచుకొని, అధ్యయనం చేయాలి. ఇవి బాగా ఉపయోగపడతాయి. పరిమితులు విధించుకొని రాసే ఎస్సే ప్రభావవంతమైన ఎస్సే అనిపించుకోదు. ఏ అంశం ఇచ్చినా, నిర్దిష్ట అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలగాలి. ఎథిక్స్ పేపర్లో ఫిలాసఫికల్, కేస్‌స్టడీలకు సంబంధించిన ప్రశ్నలకు అభ్యర్థులు పాలనా దక్షత, నిజాయితీని ప్రతిబింబించేలా సమాధానాలు రాయాలి. చివరి 5 నిమిషాల్లో ఒకట్రెండు ప్రశ్నలు మిగిలిపోతే, వదిలేయకుండా వాటికి సంబంధించిన కీలక పదాలతో చిన్న వాక్యాలను రాయాలి. ఇలా చేయటం వల్ల పోటీలో ముందుంటాం.
బెస్ట్ ఆఫ్ లక్
- ముషారఫ్ ఫరూఖి, అసిస్టెంట్ కలెక్టర్, ఖమ్మం.

ఆత్మవిశ్వాసంతో అడుగేయండి!
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని ఆన్సర్ ప్రజెంటేషన్ ప్రాక్టీస్‌కు కేటాయించాలి. రోజుకు కనీసం 5-10 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఈ సమాధానాలు రాయటాన్ని గంటలోపు పూర్తిచేయాలి. ప్రముఖ శిక్షణ కేంద్రాలు అందుబాటులో ఉంచిన మోడల్ ప్రశ్నల్లో క్లిష్టమైన వాటిని ఎంపిక చేసుకొని, వాటికి సమాధానాలు రాయాలి. తర్వాత గంట సమయాన్ని స్వీయ మూల్యాంకనానికి (self evaluation) కేటాయించాలి. తటస్థ దృక్కోణం (neutral perspective)తో మూల్యాంకనం చేసుకోవాలి. చాలా మంది సమాధానాల్లో కేవలం స్టేట్‌మెంట్లను మాత్రమే రాస్తారు. అలా కాకుండా వాటికి బలం చేకూర్చే ఫ్యాక్ట్స్‌ను, సమకాలీన అంశాలను జోడించాలి. ఎకానమీ ప్రశ్నలకు రాసే సమాధానాల్లో కరెంట్ ఫ్యాక్ట్స్‌ను రాయటం మరచిపోకూడదు. సమాధానాల్లో ఒకట్రెండు స్టేట్‌మెంట్లు, ఒకట్రెండు ఫ్యాక్ట్స్, సరైన బాడీ స్ట్రక్చర్ ఉండేలా చూసుకోవాలి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు ప్రయత్నించాలి. ఇంత వరకు కష్టపడి చదివారు. అదే ఆత్మవిశ్వాసంతో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా పరీక్షకు హాజరైతే విజయం మీ సొంతమవుతుంది. పేపర్ ఎంత క్లిష్టంగా వస్తే అంత మంచిది. దాన్ని సవాలుగా తీసుకొని, శక్తిమేరకు సమాధానాలు రాయాలి.
ఆల్ ది బెస్ట్
- ఎస్.కృష్ణ ఆదిత్య, అసిస్టెంట్ కలెక్టర్, మెదక్.
Published date : 04 Dec 2015 12:09PM

Photo Stories