Skip to main content

సివిల్స్ మెయిన్స్... సమకాలీన ప్రాధాన్యత

ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ముఖ్య ఘట్టం మెయిన్స్ ముగిసింది. దేశవ్యాప్తంగా లక్షల మంది పోటీపడే ప్రిలిమ్స్ అనంతరం సుమారు 10,500 మంది మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు. ఎంపికలో అత్యంత ప్రధానమైన మెయిన్స్ పరీక్షలో చూపే ప్రతిభే అభ్యర్థి తుది విజయ అవకాశాలను నిర్దేశిస్తుంది. ప్రతిసారి విభిన్నమైన ప్రశ్నలు అడిగి అభ్యర్థులను ఆశ్చర్యపరిచే యూపీఎస్సీ.. ఈసారి కూడా భిన్నమైన సరళిలోనే ప్రశ్నలు సంధించినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమకాలీనంగా ప్రాధాన్యం సంతరించుకున్న ముఖ్య సంఘటనలతో పాటు గత కొంత కాలంగా వార్తా పత్రికల పతాక శీర్షికల్లో నిలిచిన అంశాల నుంచి ప్రశ్నలు అడగటం విశేషం. కొద్దిరోజుల క్రితం ముగిసిన సివిల్స్ మెయిన్స్ పరీక్షల తీరు తెన్నులపై నిపుణుల విశ్లేషణ పోటీ పరీక్షార్ధుల కోసం...
మెయిన్స్‌లో ఈసారి ప్రశ్నల సరళి పూర్తిగా సమకాలీన అంశాల చుట్టూ తిరిగింది. జనరల్ స్టడీస్ పేపర్-1లోని చరిత్ర సబ్జెక్టు నుంచి 50 మార్కులకు తప్ప.. మిగతా అంతా సమకాలీన అంశాల సమాహారంగా సివిల్స్ మెయిన్స్ 2018 పరీక్షలు జరిగినట్లు నిపుణులు, అభ్యర్థులు చెబుతున్నారు. ఎస్సే నుంచి ఎథిక్స్ వరకు సమకాలీన అంశాల మేళవింపుగా ప్రశ్నలు రావడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. కాబట్టి నిత్యం నిర్మాణాత్మక ధోరణితో దినపత్రికలు చదువుతూ.. తాజా పరిణామాలపై విశ్లేషణ చేసే అలవాటు ఉన్న అభ్యర్థులు ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రిలిమ్స్‌లో అధికశాతం ప్రశ్నలు స్టాటిక్ సబ్జెక్టు నుంచి వస్తే.. మెయిన్స్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా పూర్తిగా సమకాలీన ఘటనల మేళవింపుగా ఉన్నాయని అభ్యర్థులు పేర్కొంటున్నారు.

జనరల్ ఎస్సే...
ఎస్సే పేపర్‌లో.. కరెంట్ అఫైర్స్, విలువలు, తాత్వికత కోణాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. పేదరికం, సరిహద్దు సమస్యలు, టెక్నాలజీ, ఎథిక్స్‌పై ప్రముఖుల కొటేషన్లు ప్రస్తావిస్తూ అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు అభ్యర్థులకు సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతోపాటు సామాజిక, ఆర్థిక, తాత్విక అంశాలపైనా పరిజ్ఞానం ఉండాలి. దీర్ఘకాలిక కృషి, సహజజ్ఞాన తృష్ణతోనే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు సంతృప్తికరంగా రాసే వీలుంటుందని నిపుణుల అభిప్రాయం.

జనరల్ స్టడీస్ పేపర్-1 :
  • భారతదేశ చరిత్ర,సంస్కృతికి సంబంధించి చాలా ప్రశ్నలు.. దినపత్రికల్లో, జర్నల్స్‌లో ప్రధాన వార్తలుగా నిలిచిన అంశాల నుంచే అడిగారు. దాల్మియా భారత్.. 17వ శతాబ్దానికి చెందిన చారిత్రక కట్టడం ఎర్రకోటను అభివృద్ధి చేసేందుకు దత్తత తీసుకోవడం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చర్చనీయాంశమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ కళలు, వారసత్వాన్ని పరిరక్షించడం ప్రాధాన్యంగా మారింది.. చర్చించండి? అనే ప్రశ్న వచ్చింది. అలాగే మహాత్మాగాంధీ 150వ జయంతి నేపథ్యంలో... ప్రస్తుత పరిస్థితుల్లో మహాత్మాగాంధీ ఆలోచనల ప్రాముఖ్యతను తెలపండి అనే ప్రశ్న ఎదురైంది.
  • శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించి ఇటీవల వార్తల్లో ఉంటూ వచ్చిన ఇండియన్ రీజినల్ నేవిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్)పై ప్రశ్న అడిగారు. ఇక సముద్రంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాల వినియోగం భారీగా పెరుగుతుండటంపై గతకొంత కాలంగా చర్చ జరుగుతోంది. ప్లాస్టిక్, వ్యర్థాల కారణంగా మెరైన్ ఎకోసిస్టమ్స్‌పై ‘డెడ్ జోన్లు’ విస్తరిస్తూ తీవ్ర పరిణామాలు ఉత్పన్నమయ్యే ఆస్కారముంది. ఈ అంశంపై కూడా ప్రశ్నలు వచ్చాయి. అలాగే దేశంలో మహిళా ఉద్య మాలు.. సామాజికంగా వెనుకబడిన మహిళల సమస్యలను పరిష్కరించలేదనే విషయాన్ని చర్చించండి అని అడిగారు. దీంతోపాటు సెక్యులరిజం, కమ్యూనలిజం, కాస్ట్ సిస్టమ్, భక్తి ఉద్యమం, పేదరికం, గ్లోబలైజేషన్, ఇండస్ట్రియల్ కారిడార్స్, బ్లూ రెవెల్యూషన్, భూగర్భజలాలు, కొత్త రాష్ట్రాల ఏర్పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిదేనా? ఆర్కిటిక్ ప్రాంతంపై భారత్‌కు ఆసక్తి తదితర అంశాలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. వరల్డ్ హిస్టరీ నుంచి ప్రశ్నలు కనిపించలేదు.

జనరల్ స్టడీస్ పేపర్-2 :
  • భారత రాజ్యాంగం, పాలిటీపేపర్‌లో.. కాగ్, ఈవీఎంలు, ఎన్నికల సంస్కరణలు, పంచాయతీరాజ్ వ్యవస్థ, పార్లమెంటరీ కమిటీలు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, పర్యావరణం, ఈ-గవర్నెన్స్, ఢిల్లీ ఎన్‌సీటీ స్టేటస్, ట్రైబ్యునల్స్, హంగర్, హ్యూమన్ రైట్స్ కమిషన్, సిటిజన్ చార్టర్, డబ్ల్యూటీవో-ట్రేడ్ వార్, తదితర అంశాలపై లోతైన అవగాహన కలిగి, సమకాలీన సమాచారం జోడించి రాసిన వారికి మంచి మార్కులు వచ్చే అవకాశముంది. ఉదాహరణకు ఈ ఏడాది జూలైలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, ఎన్నికైన ప్రభుత్వం మధ్య తలెత్తిన రాజకీయ సంఘర్షణ పరిష్కారమవుతుందా.. వివరించండి. అలాగే ఇటీవల దేశంలో ఈవీఎంల పనితీరుపై నెలకొన్న వివాదం దృష్ట్యా.. దేశంలో ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను కాపాడటంలో ఎలక్షన్ కమిషన్‌కు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? తదితర సమకాలీన అంశాలపై అభ్యర్థులకున్న అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు అడిగారు.
  • ఈ పేపర్‌లో అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యం ఎక్కువగా కనిపించింది. అంతర్జాతీయ అంశాలను సమకాలీన పరిణామాలకు జోడిస్తూ ప్రశ్నలు అడిగారు. భారత్‌తో వివిధ దేశాల సంబంధాలు, అంతర్జాతీయంగా కీలక దేశాల మధ్య ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాలపై ప్రశ్నలు వచ్చాయి. భారత్-ఇజ్రాయిల్ సంబంధాలు, సెంట్రల్ ఆసియా, భారత్-అమెరికా ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలు, అమెరికా-ఇరాన్ మధ్య న్యూక్లియర్ ఒప్పంద వివాదం వల్ల భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది.. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఎలా స్పందించాలి వంటి ప్రశ్నలు కనిపించాయి.

జనరల్ స్టడీస్ పేపర్-3 :
ఎకనామిక్స్ ప్రశ్నలు సులువుగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), ఇది రైతులను తక్కువ ఆదాయ వలయం నుంచి ఎలా రక్షిస్తుంది; అలానే, 2018-2019 కేంద్ర బడ్జెట్‌లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్(ఎల్‌సీజీటీ), డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ)లకు సంబంధించి చేసిన ముఖ్యమైన మార్పులపై వ్యాఖ్యానించండి. సెండాయ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్(డీఆర్‌ఆర్)-(2015- 2030), న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్, బయో టెక్నాలజీ, నేషనల్ హార్టికల్చర్ మిషన్(ఎన్‌హెచ్ ఎం), ప్రొటెక్షనిజం అండ్ కరెన్సీ మ్యానిప్యులేష న్, నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ మధ్య పోలికలు, లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం, చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ), భారత్ అభ్యంతరాలు, న్యూక్లియర్ ఎనర్జీ కార్యక్రమం, డేటాసెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, క్రాపింగ్ ప్యాట్రన్, ఆర్గానిక్ రాష్ట్రంగా సిక్కిం-ప్రయోజనాలు, రామ్‌సెర్ కాన్సెప్ట్-సైట్స్, సూపర్ మార్కెట్ల పాత్ర తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చాయి.

జనరల్ స్టడీస్ పేపర్-4 :
గవర్నెన్స్‌కు సంబంధించి పబ్లిక్ ఇంటరెస్ట్, కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మోరల్ డైలమాస్ వంటి వాటిని రాయడానికి ఆలోచనల్లో స్పష్టత, పరిణితి ఎంతో అవసరం. ఈ పేపర్‌లో ఇంకా కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ ఎథిక్స్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆగ్రహం-అసహనంపై గాంధీ కొటేషన్, సత్యం-అసత్యంపై తిరుక్కరల్ కొటేషన్, అలాగే అబ్రహం లింకన్, వారన్ బఫెట్ కొటేషన్లను ప్రస్తావిస్తూ ప్రశ్నలు అడగటం జరిగింది.

పర్సనాలిటీ టెస్ట్:
మెయిన్స్ అనంతరం జరిగే పర్సనాలిటీ టెస్టుకు ఇప్పటినుంచే సన్నద్ధమవ్వాలి. ముఖ్యంగా దరఖాస్తు సమయంలో డీఏఎఫ్‌లో పేర్కొన్న బయోడేటా సమాచారంపై ఎటువంటి ప్రశ్న అడిగినా.. సమాధానం ఇచ్చేలా సిద్ధమవ్వాలి. ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. సబ్ క్వశ్చన్స్ ఉంటాయనే విషయాన్ని గుర్తించాలి.

ఇంటర్వ్యూకు ఇప్పటి నుంచే..
మెయిన్స్ పరీక్షల ఫలితాలు డిసెంబర్ చివర్లో వెలువడే అవకాశ ముంది. కాబట్టి తుది ఎంపికలో ఎంతో కీలకమైన ఇంటర్వ్యూకు ఇప్పటి నుంచే సన్నద్ధమవ్వాలి. అభ్యర్థులు బయోడేటా సమాచారంపై పూర్తిస్థాయి కసరత్తు చేయాలి. మరోవైపు దేశంలో ఎన్నో ముఖ్యమైన ఘటనలు జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలతో పాటు బడ్జెట్, ఎకనామిక్ సర్వే, పార్లమెంటరీ చట్టాలు, ఆర్డినెన్సులు వంటి వాటిపైనా దృష్టిపెట్టాలి. కరెన్సీ వార్, మల్టీ లేటరిజం, ట్రంప్ విధానాలు వంటి అంతర్జాతీయ అంశాలపై దృష్టిసారించాలి. కాన్సెప్టులపై స్పష్టత అవసరం. ఆలోచనలు, అభిప్రాయాలు బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలా చూసుకోవాలి.
- శ్రీరంగం శ్రీరామ్, శ్రీరామ్స్ ఐఏఎస్.
Published date : 23 Oct 2018 06:11PM

Photo Stories