Skip to main content

సివిల్స్ మెయిన్స్-2018 విజయానికి వ్యూహాలు...

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు జూలై 14న వెలువడ్డాయి. జూన్ 3న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి దాదాపు 10500 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 600 మందికి అర్హత లభించినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 28 నుంచి మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. అంటే.. సుమారు రెండు నెలల సమయం అందుబాటులో ఉంది. అత్యుత్తమ ప్రతిభావంతులతో పోటీపడి విజేతలుగా నిలవాలంటే అభ్యర్థులు ఈ సమయంలో ప్రిపరేషన్‌ను పరుగులు పెట్టించాల్సి ఉంటుంది. లక్ష్య సాధనలో కీలకం కానున్న ఈ రెండు నెలల సమయంలో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు...

దేశంలోని ప్రతిష్టాత్మక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి 24 సర్వీసుల్లోకి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఏదైనా డిగ్రీ అర్హతగా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ... ఇలా మూడంచెల సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో మెయిన్స్ కీలక దశ. ఇందులో సాధించే మార్కులే విజయాన్ని నిర్ణయిస్తాయి. పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉండే ఈ పరీక్షలో విజయానికి అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది. అభ్యర్థికి ఉన్న సామాజిక స్పృహ, సమకాలీన అంశాలపై పట్టు, నైతిక విలువలు, సబ్జెక్టు నైపుణ్యాలను పరీక్షించేలా ప్రధాన పరీక్ష ఉంటుంది.

7 పేపర్లు.. 1750 మార్కులు
మెయిన్స్‌లో రెండు విభాగాల్లో మొత్తం తొమ్మిది పేపర్లతో పరీక్ష నిర్వహిస్తారు. మొదటి సెక్షన్‌లో రెండు లాంగ్వేజ్ పేపర్లు ఉంటాయి. ఇవి కేవలం అర్హత పేపర్లు. రెండో విభాగంలో మొత్తం ఏడు పేపర్లు ఉంటాయి. ఇంటర్వ్యూ జాబితా రూపకల్పనకు ఇందులో పొందే మార్కులే ఆధారం. జనరల్ ఎస్సే, నాలుగు జనరల్ స్టడీస్ (జీఎస్) పేపర్లు, ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లు రెండు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 250 మార్కులు చొప్పున మొత్తం 1750 మార్కులకు జరిగే మెయిన్స్ పరీక్షలు నిర్ణయాత్మకం. ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. అంటే.. మొత్తం 2025 మార్కుల్లో టాప్ స్కోర్ సాధిస్తేనే... ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసుల్లోకి ప్రవేశం లభిస్తుంది.

జనరల్ ఎస్సే..
  • అభ్యర్థులు ఎక్కువగా నిర్లక్ష్యం చేసే పేపర్ ఇది. జనరల్ స్టడీస్‌కు బాగా చదివితే.. జనరల్ ఎస్సేలో మంచి మార్కులు పొందొచ్చనే అభిప్రాయముంది. అయితే ఇది కొంతవరకు మాత్రమే వాస్తవమని, అభ్యర్థులు జనరల్ ఎస్సేకు ప్రత్యేకంగా ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మొదటిసారి మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులు అతి విశ్వాసంతో ఎస్సే పేపర్‌ను తేలిగ్గా తీసుకుంటారు. జీఎస్ పేపర్‌లో కంటెంట్‌కు ప్రాధాన్యత ఉంటుంది. ఎస్సే పేపర్‌లో వేర్వేరు అంశాలపై సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇందులో కంటెంట్‌తోపాటు ఆలోచనలను ఒక క్రమపద్ధతిలో, చక్కటి భాషతో ఎలాంటి గ్రామర్, స్పెల్లింగ్ తప్పులు లేకుండా రాయగలిగితేనే మంచి మార్కులు సాధించేందుకు వీలుంటుంది.
  • ఎస్సే ప్రిపరేషన్ క్రమంలో నాన్ ఫిక్షన్ పుస్తకాలు చదవడం వల్ల అభ్యర్థి ఆలోచన విధానంలో పరిపక్వత వస్తుందని 2017 సివిల్స్ ఫస్ట్ ర్యాంకర్ అనుదీప్ దురిశెట్టి చెబుతున్నారు. పుస్తకాలు చదవడం వల్ల విషయ పరిజ్ఞానం, సంవాదన నైపుణ్యం, వాక్చాతుర్యంతోపాటు ప్రత్యేక సమాచారం లభిస్తుందన్నారు. ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఎస్సే రాయాల్సి వచ్చినప్పుడు.. యువల్ హరారి పుస్తకం హోమో డీస్‌లో పేర్కొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవత్వానికి ముప్పనే విషయాన్ని ఉటంకించవచ్చు. అలాగే వై నేషన్స్ ఫెయిల్ అనే పుస్తకంలో ఆవిష్కరణల ప్రాధాన్యత, రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛ వంటి అంశాలు దేశ ప్రగతికి ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయాన్ని ఉదాహరణలతో వివరించారు. ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల అభ్యర్థుల ఆలోచనా పరిధి విస్తృతమవుతుందని అనుదీప్ పేర్కొన్నారు.
  • ఎస్సే పేపర్‌లో రాణించడానికి యోజన, ఈపీడబ్ల్యూ (ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ), ఎకనామిక్ సర్వే వంటి వాటిలో వివిధ సమస్యలకు సంబంధించి నిర్దిష్టమైన కథనాలు ఉపయోగపడతాయి.
  • జనరల్ ఎస్సే రాసేటప్పుడు సరళమైన, స్పష్టమైన భాష ఉపయోగించాలి. Constitutionalism, Sanskritization వంటి సంక్లిష్ట పదాలు ఉపయోగించే క్రమంలో మొదట వాటి నిర్వచనాలు రాస్తే.. మనం చెప్పదలుచుకున్నది సులువుగా అర్థమవుతుంది. వాక్యాలను చిన్నగా, సూటిగా, స్పష్టంగా రాయడం అలవాటు చేసుకోవాలి.
  • ఎస్సేలో అవసరం మేరకు పదప్రయోగం, ప్రేజెస్ ఉపయోగిస్తే ప్రభావ వంతంగా ఉంటుంది. నాన్ ఫిక్షన్ పుస్తకాలు, ఇంగ్లిష్/తెలుగు పేపర్లు చదవడం వల్ల పదాలను ఎక్కడ, ఎలా ఉపయోగించాలనే విషయం తెలుస్తుంది. వొకాబ్యులరీని పెంచుకోవడమనేది ఓ నిరంతర ప్రక్రియ.
  • ఎస్సే రాసేటప్పుడు కూడా సబ్ హెడ్డింగ్స్‌ను వినూత్నంగా పెట్టడం లాభిస్తుంది. ఉదాహరణకు న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఎస్సే రాయాల్సి వచ్చినప్పుడు Benefits of Nuclear Energy కి బదులుగా Nuclear Energy: Promise or Peril?, అలాగే సోషల్ మీడియా గురించి Advantages and Disadvantages of Social Media బదులుగా Social Media: A Double Edged Sword లాంటి పద ప్రయోగాలు చేస్తే మంచి మార్కులు పొందడానికి వీలుంటుంది.
  • ఎస్సేను అన్ని కోణాల్లో విశ్లేషించాలి. సానుకూల, ప్రతికూల అంశాలు రాస్తూ.. సమతూకం పాటిస్తూ.. ఆశావాద దృక్పథంతో ఎస్సే ముగించాలి.
  • ప్రధానంగా అభ్యర్థులు చేసే పొరపాటు.. ఒకే ప్రశ్నకు ఎక్కువ సమయం కేటాయించడం. దీనివల్ల అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు సమయం లభించదు. కాబట్టి అడిగిన ప్రశ్నలన్నింటికి సమానంగా సమయం కేటాయించే విధంగా ప్లాన్ చేసుకోవాలి.

జీఎస్‌కు సమకాలీనం తోడు..
  • మెయిన్స్‌లో జనరల్ స్టడీస్‌లో నాలుగు పేపర్లు ఉన్నాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కుల చొప్పున 1000 మార్కులు ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్ 1లో భారత సంస్కృతి, వారసత్వం, చరిత్ర, ప్రపంచ భౌగోళిక వ్యవస్థ, సమాజం... జనరల్ స్టడీస్ పేపర్ 2లో గవర్నెన్స్, రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు.. జనరల్ స్టడీస్ పేపర్ 3లో టెక్నాలజీ, ఎకనమిక్ డెవలప్‌మెంట్, బయోడైవర్సిటీ, పర్యావరణం, భద్రత, విపత్తు నిర్వహణ అంశాలు ఉంటాయి. జనరల్ స్టడీస్ నాలుగో పేపర్‌లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్ సంబంధిత అంశాలు ఉంటాయి.
  • సివిల్స్ మెయిన్స్‌కు హాజరుకానున్న అభ్యర్థులు ఇప్పటికే చాలావరకు ప్రిపరేషన్ పూర్తిచేసుంటారు. ఈ సమయంలో కొత్తగా వేరే మెటీరియల్ జోలికి వెళ్లకుండా.. గతంలో చదివిన అంశాలనే మళ్లీ మళ్లీ చదవాలి. పాలిటీ, ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్, ఇంటర్నేషనల్ అఫైర్స్‌కు సంబంధించిన కీలక అంశాలను సమకాలీన అంశాలతో అనుసంధానిస్తూ చదవాలి. జనరల్ స్టడీస్ పేపర్1 మినహా అన్ని పేపర్లల్లోనూ కరెంట్ అఫైర్స్‌దే ముఖ్య పాత్ర. జనరల్ స్టడీస్‌కు సంబంధించిన ప్రశ్నలకు కరెంట్ ఈవెంట్స్‌ను జోడిస్తూ సమాధానాలు రాస్తే సంపూర్ణంగా ఉంటుంది. ఉదాహరణకు ఎన్‌జీఓ (నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్)లపై ప్రశ్న అడిగినప్పుడు.. వాటి చరిత్ర గురించి చెప్పడం కంటే.. ఫారెన్ ఫండింగ్, విదేశీ యాత్రలపై ఆంక్షల గురించి రాయడం లాభిస్తుంది. అభిప్రాయాలు వ్యక్తంచేసే క్రమంలో ఇచ్చే గణాంకాలు, సమాచారానికి బలమైన కారణాలు రాయడం తప్పనిసరి.

రైటింగ్ ప్రాక్టీస్ కీలకం !
ప్రముఖ అమెరికా నవలా రచయిత స్టెఫెన్ కింగ్.. రాయడం గురించి ఇలా అంటాడు.. I write to find out what I think'. మనం రాసింది చూసి.. మన ఆలోచనలను, వాటికి కట్టుబడి ఉండే విధానాన్ని, సంవాదనలను ఎలా బలోపేతం చేసుకుంటాం.. తదితర అంశాలను పాఠకులు అంచనా వేయగలరని ఆయన అంటారు. అందుకే పోటీపరీక్షల్లో అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి రాత పరీక్షలు నిర్వహిస్తారు. సివిల్ సర్వీసెస్ కూడా ఈ కోవకు చెందిందే. కొంతమంది అభ్యర్థులకు సబ్జెక్టు పరిజ్ఞానం ఎక్కువగా ఉన్నా.. పరీక్షలో ఏం రాశారనే దానిపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. నిర్దేశిత పదపరిమితి పాటిస్తూ సమాధానాలు రాసేలా సిద్ధమవ్వాలి. అందుకు అభ్యర్థుల ముందున్న బ్రహ్మాస్త్రం.. రైటింగ్ ప్రాక్టీస్. రోజులో ఎక్కువ సమయం రైటింగ్ ప్రాక్టీస్‌కు కేటాయించాలి. పరీక్షలకు సమయం తక్కువ ఉన్న దృష్ట్యా.. ఒకటి, రెండు ప్రశ్నలకు కాకుండా.. సాధ్యమైనన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడం ప్రాక్టీస్ చేయాలి. ప్రతివారం పూర్తిస్థాయి పరీక్షలకు హాజరవుతూ.. సమాధానాలను నిపుణులతో మూల్యాంకనం చేయించాలి. వాటి ఫలితాలను సమీక్షించుకుంటూ పొరపాట్లు సరిదిద్దుకోవాలి.
  • నిరంతరం రైటింగ్ ప్రాక్టీస్ వల్ల ఎంత ఒత్తిడిలోనైనా పరీక్ష రాసే సన్నద్ధత లభిస్తుంది.
  • పరీక్షకు సమయం తక్కువగా ఉండటం వల్ల నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకొని.. అన్ని సబ్జెక్టులకు సమప్రాధాన్యమిస్తూ ప్రిపరేషన్ కొనసాగించాలి.
  • ఆలోచనలను సరళంగా, స్పష్టంగా రాయాలి.
  • సమకాలీన అంశాలపై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలి. అరకొర సమాచారంతో రాసే సమాధానంలో స్పష్టత ఉండదు.
  • కరెంట్ అఫైర్స్ విషయంలో ప్రత్యేక దృష్టి అవసరం. వాటిని జనరల్ స్టడీస్‌తో ముడిపెడుతూ చదవితే ప్రిపరేషన్ సులువు అవుతుంది.
  • క్లుప్తంగా చెప్పాలంటే.. సమాధానాలు రాసేటప్పుడు నిర్వచనం, తాజా పరిణామాలు, ఫ్యాక్ట్స్, ఫిగర్స్, ఫ్లోచార్ట్, డయాగ్రం, మ్యాపింగ్, ఇంటర్ లింకింగ్, ముగింపు (పరిష్కారం... భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు ఎలా రాబట్టొచ్చో తెలిపేలా ఉండాలి) మొదలైనవి రాస్తే.. సమాధానం సంపూర్ణంగా ఉంటుంది.
  • నాలుగో పేపర్ ఎథిక్స్.. స్కోరింగ్‌కు వీలున్న పేపర్ ఇది. మిగతా జీఎస్, ఆప్షనల్ పేపర్లలాగా.. ఈ పేపర్‌కు ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉండదు. అయితే నిర్లక్ష్యం చేయకుండా చదవాలి. కాన్సెప్టులపై స్పష్టతతో, థియరీస్‌తో సమాధానాలు రాయాలి. ఇవి కూడా ప్రాక్టికల్, ఎథికల్‌గా ఉండాలనేది నిపుణుల మాట.

ఆప్షనల్‌ను లోతుగా...
 ఆప్షనల్‌లో రెండు పేపర్లకు లోతైన ప్రిపరేషన్ అవసరం. ఇప్పటికే సిద్ధం చేసుకున్న సొంత మెటీరియల్‌ను పునశ్చరణ చేయాలి. ఇందులో ఏ ఒక్క చాప్టర్‌ను విస్మరించకూడదు. ప్రతిచాప్టర్ నుంచి ప్రశ్నలు వస్తాయి.  ఆప్షనల్ సబ్జెక్టు ఏదైనప్పటికీ పీజీ స్థాయి ప్రిపరేషన్ ఉండాలి. సోషియాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ వంటి సబ్జెక్టులు ఎంచుకున్న అభ్యర్థులు జీఎస్, ఆప్షనల్ కలిపి ప్రిపేర్ అవ్వొచ్చు. కాఠిన్యత స్థాయిలో మాత్రం ప్రశ్నలు భిన్నంగా ఉంటాయి. ఆప్షనల్ సబ్జెక్టును బట్టి.. తాజాగా సంబంధిత రంగాల్లో జరిగిన మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. వీటిపైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
 
రైటింగ్ ప్రాక్టీస్‌తోనే విజయం :
సివిల్స్ మెయిన్స్‌లో రైటింగ్‌కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ప్రిపరేషన్ మొదలుపెట్టిన నాటి నుంచే డిస్క్రిప్టివ్ అప్రోచ్ ఉన్నవారికి మెయిన్స్ పెద్దగా కష్టమనిపించదు. అభ్యర్థులు చాలావరకు ఎస్సేను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దాంతో ఈ పేపర్‌లో చాలా తక్కువ స్కోరుకు పరిమితమవుతున్నారు. కాబట్టి జనరల్ ఎస్సేపై శ్రద్ధ పెట్టాలి. పరీక్ష రాసే క్రమంలో.. అనలిటికల్ అప్రోచ్‌తో, రాసే సమాధానాలకు బలమైన కారణాలు ప్రస్తావిస్తూ.. విశ్లేషిస్తూ రాయాలి. సమకాలీన అంశాలను  ఉదహరించడం వల్ల ఎక్కువ స్కోరు చేయవచ్చు.
  - దురిశెట్టి అనుదీప్, సివిల్స్ మొదటి ర్యాంకర్, 2017.
   
ఎథిక్స్ పేపర్.. స్కోరింగ్
మెయిన్‌లో ఎక్కువ స్కోరు సాధించడానికి ఎథిక్స్, ఎస్సే, ఆప్షనల్ పేపర్లు ముఖ్యం. ఇప్పటికే ఆ పేపర్లను చదివి ఉంటే నెలలోపు పునశ్చరణ చేయాలి. ఎథిక్స్‌లో థియరీ విభాగంలో ఎక్కువ స్కోరు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా కేస్ స్టడీస్‌తో కూడిన జవాబులు రాయడం మేలు. ఇక జనరల్ స్టడీస్‌లో సమకాలీన అంశాలను జోడించుకుంటూ సన్నద్ధత కొనసాగించాలి. ఎస్సేలో ముఖ్యమైన అంశాలను గుర్తించి మోడల్ సమాధానాలు రాయడం, ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. కనీసం రెండు నమునా పేపర్లను నిర్ణీత సమయం కేటాయించుకొని రాయడం ఉపకరిస్తుంది.  
  - వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ.
Published date : 17 Jul 2018 06:24PM

Photo Stories