Skip to main content

సివిల్స్ మెయిన్-2019 ఎగ్జామ్ డే టిప్స్...

సివిల్ సర్వీసెస్ మెయిన్ 2019 పరీక్షలు సెప్టెంబర్ 20న మొదలుకానున్నాయి. పరీక్షకు ఇంకా అయిదు రోజుల సమయం మాత్రమే అందుబాటులో ఉంది. ఇన్నాళ్లుగా అహర్నిశలు కష్టపడిన అభ్యర్థులు మరో అయిదు రోజులపాటు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని చెబుతున్నారు కర్నాటి వరుణ్ రెడ్డి. 2018 సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఏడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకు సాధించిన వరుణ్ రెడ్డి అందిస్తున్న సివిల్స్ మెయిన్ ఎగ్జామ్ డే టిప్స్... ఆయన మాటల్లోనే!!
సెప్టెంబర్ 20 నుంచి సివిల్స్ మెయిన్ పరీక్షలు ప్రారంభం కాబోతున్న తరుణంలో అభ్యర్థుల్లో ఆందోళన ఉంటుంది. నేను మెయిన్ పరీక్షలు రాసే సందర్భంలో రకరకాల భావోద్వేగాలు, అనేక ఆలోచనలు నన్ను వెంటాడాయి. పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు?, నేను వాటికి సమర్థంగా సమాధానాలు రాయగలనా? వంటి ఎన్నో ప్రశ్నలు మదిలో మెలిగాయి. ఇలాంటి ప్రశ్నలు అభ్యర్థులకు ఎదురవడం సహజం. పరీక్ష సమీపిస్తున్న కొద్దీ నిద్రలేని రాత్రులు కూడా ఉంటాయి. అయితే అభ్యర్థులు తమను తాము ప్రశ్నించుకోవాలి. అతిగా ఆలోచించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అని అభ్యర్థులు తమను తాము ప్రశ్నించుకుంటూ ఒత్తిడిని జయించాలి. అయిదుసార్లు సివిల్స్ మెయిన్ రాసిన అనుభవంతో నాకు అర్థమైంది ఏమిటంటే... పరీక్షకు ముందు వారం రోజులుపాటు ఏం చేయాలి?, పరీక్షలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే అంశంపై కసరత్తు చేసిన అభ్యర్థులే మెయిన్ పరీక్షలో ప్రతిభ చూపారు.

ఎస్సే - మేధోమధనం!
జనరల్ స్టడీస్‌కు సన్నద్ధమైతే చాలు, ఎస్సే పేపర్‌కు ప్రత్యేకంగా సిద్ధం అవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటారు. కానీ, ఎస్సే ప్రిపరేషన్, జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ పూర్తిగా భిన్నం. ఎస్సే సన్నద్ధత వైవిధ్యంగా ప్రతి అంశాన్ని సామాజిక, రాజకీయ, ఆర్థిక, పర్యావరణ, సాంస్కృతిక, న్యాయ, చారిత్రాక, అంతర్జాతీయ కోణాలను ప్రస్థావిస్తూ సాగాలి. ఎస్సేకు సమాధానాలు రాసేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో ఆలోచిస్తూ.. పొందికగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అభ్యర్థులు కనీసం 40 నిమిషాల నుంచి గంట వరకు సమాధానాల నిర్మాణంపై మేధోమధనం చేయాలి. ఎస్సేలో పరిచయం, బాడీ, ముగింపుపై ముందే ఒక అవగాహనకు రావాలి. ఒక ముఖ్యమైన ఎస్సే టాపిక్‌ను తీసుకొని.. సమాధానం మొదలు పెట్టే ముందు ప్రణాళికబద్ధంగా వ్యవహరించడం ఎలాగో ప్రాక్టీస్ చేయాలి. ఏ విధంగా రాయాలి, ఏయే అంశాలను ఉటంకించాలో ముందుగానే ఆలోచనలను ఆర్గనైజ్ చేసుకోవాలి. ఒక అంశం మీద సబ్జెక్టుపరంగా సమృద్ధిగా పరిజ్ఞానం ఉన్నా.. దాన్ని ఒక క్రమానుగతంగా వివరించే నేర్పు చాలా అవసరం. స్థూలంగా చెప్పాలంటే.. చెల్లాచెదురుగా ఉండే ఆలోచనలను అర్థమయ్యేరీతిలో రాయాలి. పరీక్ష హాల్‌లో దీనికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ముందే సాధన చేయడం లాభిస్తుంది.

జీఎస్ పేపర్లు :
జనరల్ స్టడీస్ పేపర్ల సన్నద్ధతకు సంబంధించి ఇప్పటికే రివిజన్ పూర్తిచేసి ఉంటారు. ఇక కొత్త మెటీరియల్ జోలికి వెళ్లవద్దు. చదివిన అంశాలనే మరోసారి పునశ్చరణ చేసుకోవాలి. జనరల్ స్టడీస్ పేపర్ 2, 3లో కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. జీఎస్ పేపర్‌ల్లో సాధ్యమైనన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసే విధంగా ప్రాక్టీస్ చేయాలి. సమాధానాలు రాసేటప్పుడు ఏ అంశాలను రాయాలి, వేటికి మంచి మార్కులు పొందే అవకాశం ఉంది తదితర విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి.

జీఎస్‌లో మంచి స్కోరుకు...
  • సమయ నిర్వహణ: పరీక్షలో విజయానికి మూల సూత్రం సమయ నిర్వహణ. నిర్దేశిత సమయంలో పరీక్ష పేపర్‌లోని 20 ప్రశ్నలకు సమాధానాలు రాసేలా సమయ నిర్వహణ పాటించాలి. అన్ని ప్రశ్నలకు సమానంగా సమయం కేటాయించాలి. పూర్తిగా తెలియని ప్రశ్నలు తప్పించి.. మిగతా అన్నింటికి సమాధానాలు రాయాలి. ప్రతి 15 మార్కుల ప్రశ్నకు 11 నిమిషాలు కేటాయించేలా కచ్చితమైన ప్రణాళిక అనుసరించాలి. 10 మార్కుల ప్రశ్నలకు 7 నిమిషాల సమయం మాత్రమే గరిష్టంగా కేటాయించాలి. దీనివల్ల చివర్లో ఆదరాబాదరాగా రాసే పరిస్థితి తలెత్తదు.
  • మంచి స్కోరు చేయడానికి అన్ని ప్రశ్నలకు సమానమైన సమయం కేటాయిస్తూ సగటు కంటే ఎక్కువ(ఏబౌవ్ యావరేజ్) నాణ్యతతో సమాధానాలు రాయడం తప్పనిసరి అనే విషయాన్ని గుర్తించుకోవాలి.
  • అడిగిన ప్రశ్నకు సూటిగా సుత్తిగా లేకుండా సమాధానాలు రాయాలి. అనవసరంగా ఎక్కువగా రాయడం వల్ల ప్రయోజనం ఉండదు.
  • సమాధానాలు రాసే క్రమంలో అద్భుతమైన ఉపోద్ఘాతాలు రాయడానికి ప్రయత్నించకండి. ఇంట్రడక్షన్‌లో జీఎస్ పేపర్-3కు ఫ్యాక్ట్స్; జీఎస్ పేపర్ 2కు కరెంట్ అఫైర్స్ ఉటంకించడం; జీఎస్ పేపర్ 1కు నిర్వచనాలు రాయడం; జీఎస్ పేపర్ 4కు నిర్వచనాలు, కోట్స్ రాయడం మేలు.
  • సమాధానంలో ముఖ్యమైన బాడీ రాయడానికి మెలకువలు పాటించడం మేలు. ప్రశ్నను బట్టి క్రమానుగతంగా లాజికల్‌గా సమాధానాలు రాయడం లేదా సబ్‌పార్టులుగా విభజించి సమాధానాలు రాయడం ద్వారా మంచి మార్కులు పొందవచ్చు. సమాధానాల నిర్మాణం ఆర్గనైజ్డ్‌గా ఉంటే ఎగ్జామినర్‌కు చదవడం సులువు అవుతుంది.
  • మెయిన్ పరీక్షల్లో సమాధానాల ముగింపునకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రభుత్వ లక్ష్యాలైన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్,సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ మొదలైన బృహత్తర లక్ష్యాలకు సంబంధించి భవిష్యత్తు లక్ష్యాలను సాధించేలా ముగింపు ఇవ్వాలి.
  • సమాధానాలను సమర్థించుకోవడానికి, చక్కటి స్కోరు పొందేందుకు ఫ్యాక్ట్స్ చాలా ముఖ్యం. అయితే ఫ్యాక్ట్స్‌కు సంబంధించిన అధికారిక నివేదికల సోర్సును కూడా తెలపాలి.
  • చిత్రరూపంలో సమాధానాలు రాయడం కూడా లాభిస్తుంది. అవసరమైన చోట డయాగ్రమ్స్ వేయడం వల్ల అర్థవంతంగా, సులువుగా సమాధానాన్ని ప్రజెంట్ చేయవచ్చు. ఉదాహరణకు జాగ్రఫీ, అంతర్గత భద్రత విషయంలో దేశపటంలో వివిధ ప్రాంతాలను వర్ణించడానికి డయాగ్రమ్ వేయవచ్చు.

పేరాగ్రాఫ్ వర్సెస్ పాయింట్ ఫార్మట్ :
  • అభ్యర్థులు తమకు అలవాటైన శైలిని అనుసరించవచ్చు. అయితే పరీక్షకు సమయం సమీపిస్తున్న తరుణంలో శైలిని మార్చుకోవడానికి ప్రయత్నించవద్దు. పేరాగ్రాఫ్ విధానంలో రాస్తున్న వారితోపాటు పాయింట్ ఫార్మట్‌లో రాస్తున్న అభ్యర్థులకూ టాప్ ర్యాంకులు వస్తున్నాయి.
  • భిన్న కోణాల్లో సమాధానాలు రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. ప్రతి సబ్ పార్ట్‌ను సంపూర్ణంగా రాయడం ద్వారా మంచిస్కోరు సాధించేందుకు అవకాశం ఉంటుంది.

ఆప్షనల్ పేపర్లు :
మెయిన్ పరీక్షలో జీఎస్ పేపర్ల తర్వాత ఆప్షనల్ పేపర్లకు కనీసం అయిదు రోజుల సమయం లభిస్తుంది. నేను జీఎస్ పేపర్లు ముగిసిన వెంటనే ఆప్షనల్ పేపర్లకు సన్నద్ధత మొదలు పెట్టాను. 2 రోజుల్లో ఆప్షనల్ సిలబస్ మొత్తం రివిజన్ చేశాను. తర్వాత రోజున్నర పాటు అప్పటి వరకు రాసిన టెస్ట్ సిరీస్ పేపర్లను చదివాను. అలానే కొత్తగా కొన్ని టెస్ట్ సిరీస్‌లను రాశాను. ఆసక్తికర పాయింట్లు రాయడం, కేస్ స్టడీస్, ఫ్యాక్ట్స్, డయాగ్రమ్స్ ఆధారంగా టెస్ట్ సిరీస్‌లను రాశా. చివరి రోజున్నర ఆప్షనల్ సిలబస్‌ను, టెస్ట్ సిరీస్‌లను మరోసారి క్విక్ రివిజన్ చేశాను.

ప్రశాంతంగా ఉండండి..
ప్రశాంతంగా, నిశ్చలంగా, రిలాక్స్‌గా ఉంటూ.. సమయానికి నిద్రపోయే వారికే విజయావకాశాలు ఎక్కువ. రివిజన్, రైటింగ్ ప్రాక్టీస్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ వంటి ప్రాథమిక సూత్రాలపై దృష్టిపెడుతూ మానసికంగా దృఢంగా ఉండాలి. యూపీఎస్సీ ప్రశ్నల రూపకల్పనలో అభ్యర్థులను ఆశ్చర్యానికి గురి చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఊహించని ప్రశ్నలను కూడా ఆత్మవిశ్వాసంతో, సామర్థ్యం మేరకు ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి.

అర మార్కే తేడా..
విజేతలకు. పరాజితులకు మధ్య అరమార్కే తేడా ఉంటుంది. మొత్తం నాలుగు జీఎస్ పేపర్లలో 80 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సమాధానంలోనూ అర మార్కు ఎక్కువ స్కోర్ చేసినా మొత్తంగా 40 మార్కులు పెరుగుతాయి. ఈ 40 మార్కుల వ్యత్యాసం పరీక్ష ఫలితాలనే తారుమారు చేస్తుంది. కాబట్టి మీరు ప్రతి ప్రశ్నలో అరమార్కు, ఒక మార్కు ఎక్కువగా సాధించడంపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. మీ కాంపిటీటర్‌కు, మీకు అర మార్కు, ఒక మార్కు తేడానే ఉంటుంది. కాబట్టి సమయాన్ని సమర్థవంతంగా అన్ని ప్రశ్నలకు సమ ప్రాధాన్యం ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి సింగిల్ మార్కు కూడా సర్వీస్‌ను, కేడర్‌ను నిర్ణయిస్తుంది. కాబట్టి ఏ ఒక్క పేపర్‌ను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ ఒక పేపర్‌లో అనుకున్న స్థాయిలో రాణించ లేకపోయినా.. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. తర్వాత పేపర్‌లో ఇతరుల కంటే మెరుగైన మార్కులు పొందే వీలుంది. కాబట్టి ఏ స్థాయిలోనూ నిరుత్సాహపడకూడదు. సహనంతో ప్రశాంతంగా ఉంటూ.. బెస్ట్‌గా రాయడానికి ప్రయత్నించండి!

భగవద్గీతలో చెప్పినట్లు ‘నిష్కామ కర్మ’ను అనుసరిస్తూ.. ఫలితం గురించి ఆలోచించకుండా.. మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి!!
Published date : 16 Sep 2019 04:03PM

Photo Stories