Skip to main content

సైన్స్ సమాహారం.. మెరుగైన స్కోర్‌కు సోపానం!

సివిల్స్ మెయిన్స్‌లో విజయం సాధించేందుకు కీలమైనవి జనరల్ స్టడీస్ పేపర్లు.
జీఎస్ మూడో పేపర్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ నష్టం, జీవ వైవిధ్య సంరక్షణ, మేధో సంపత్తి హక్కులు, విపత్తు నిర్వహణ తదితర అంశాలున్నాయి. వీటి నుంచి2013 జీఎస్-3 ప్రశ్నపత్రంలో 25 ప్రశ్నలకు 9 ప్రశ్నలు వచ్చాయి. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ అంశాలపై పట్టు సాధించేందుకు వ్యూహాలు...

మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పటికే వివిధ అంశాలకు సంబంధించిన ప్రిపరేషన్‌ను పూర్తిచేసి ఉంటారు. గత మెయిన్స్ జనరల్ స్టడీస్-3 పేపర్‌లో కొన్ని 200 పదాల సమాధాన ప్రశ్నలు, మరికొన్ని 100 పదాల సమాధాన ప్రశ్నలు వచ్చాయి. ఈసారి కూడా ఇదే విధానంలో ప్రశ్నలు ఉండొచ్చు లేదంటే స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. కాబట్టి ఈ కోణంలోనూ ప్రిపరేషన్ తప్పనిసరి. ఏ అంశానికి సంబంధించి అయినా 20, 50, 75, 150, 250 పదాల్లో సమాధానం రాసేలా సన్నద్ధం కావాలి. ఒకే ప్రశ్నలో వివిధ విభాగాలుంటే వాటి సరళిని బట్టి పద పరిమితిని నిర్దేశించుకోవాలి.

సైన్స్ అండ్ టెక్నాలజీ
Bavitha సైన్స్, టెక్నాలజీ విభాగంలో ముఖ్యంగా అంతరిక్ష పరిజ్ఞానం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్, నానో టెక్నాలజీ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ తదితర అంశాలుంటాయి. ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక ప్రయోగాలు నిర్వహించింది. ఇండియన్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్, మంగళ్‌యాన్ వంటి అద్భుత యాత్రలు చేపట్టింది. వీటిపై ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. వీటికి సంబంధించి నిగూఢంగా ఉన్న అంశాలపైనా ప్రశ్నలు రావొచ్చు. ముఖ్యంగా భారత అంతరిక్ష రంగానికి విశిష్ట సేవలు అందిస్తూ, ఎన్నో విదేశీ ఉపగ్రహాలు, వైవిధ్యభరిత ప్రయోగాలు నిర్వహించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ)పై అభ్యర్థులు దృష్టిసారించాలి.
  • భారత అంతరిక్ష కార్యక్రమంలో పీఎస్‌ఎల్‌వీ నిర్మాణం వెనుక ఉద్దేశం, అది చేపట్టిన వైవిధ్యభరిత ప్రయోగాలు, విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలు ద్వారా భారత అంతరిక్ష సేవల విస్తరణ, వరుస విజయవంత ప్రయోగాల జైత్రయాత్ర, బలహీనతలు తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
ముఖ్యాంశాలు
  • మంగళ్‌యాన్ ప్రయోగంలో ప్రత్యేకతలు- భారత్ సాధించిన ప్రగతి.
  • టెర్రా ఫార్మింగ్ అంటే ఏమిటి? అంగారక గ్రహ యాత్రలు భవిష్యత్తులో టెర్రా ఫార్మింగ్‌కు ఎలా ఉపయోగపడతాయి?
  • వాయేజర్ ఇంటర్ స్టెల్లార్ మిషన్- సాధించిన ప్రగతి ఏమిటి?
  • ఇండియన్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్), జీఎస్‌ఎల్‌వీ- మార్క్ 3, క్రయోజెనిక్ ఇంజిన్ ప్రాధాన్యత, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం, భారత్ డీప్ స్పేస్ నెట్‌వర్క్, క్యూరియాసిటీ రోవర్, జీఎస్‌ఎల్‌వీ బలహీనతలు.
  • టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్, అంతరిక్ష టెక్నాలజీ ద్వారా గ్రామీణాభివృద్ధి తదితర అంశాలు.
ఐటీ, కంప్యూటర్స్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్ రంగంలో డిజిటల్ ఇండియా, నేషనల్ ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టు, మెడికల్ ఇన్‌ఫర్మేటిక్స్, గ్రామీణాభివృద్ధిలో ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, నెట్ న్యూట్రాలటీ- ప్రయోజనాలు, బిగ్ డేటా, ఓపెన్ గవర్నమెంట్ డేటా తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
  • నానో టెక్నాలజీ రంగంలో అనేక అనువర్తనాలున్నాయి. వీటిని తెలుసుకోవాలి. గతేడాది నిర్మాణరంగానికి సంబంధించి కాంపొజైట్స్‌పై ప్రశ్న అడిగారు. పర్యావరణ కాలుష్యం నిర్మూలనలో, వైద్య రంగంలో నానో టెక్నాలజీ ప్రయోజనాలపై దృష్టిసారించాలి. అదే విధంగా నానో టెక్నాలజీ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో అనువర్తనాలపై ప్రశ్న వచ్చేందుకు అవకాశముంది.
  • రోబోటిక్స్ రంగంలో కేవలం రోబోటిక్స్ సూత్రాలు, వాటి రకాలు, ఉపయోగాలు మాత్రమే కాకుండా రోబోటిక్ కాళ్లు, చేతులు తయారీ ప్రక్రియపై అవగాహన పెంపొందించుకోవాలి. రోబోటిక్స్‌ను బయోనిక్స్‌కు అనుసంధానిస్తూ అధ్యయనం చేయాలి. బయోనిక్స్ అంటే ఏమిటి? దాని అనువర్తనాలు ఎలా ఉంటాయి? వైద్య రంగంలో వాటి ప్రాధాన్యం ఏమిటి? తదితర అంశాలను చదవాలి.
బయోటెక్నాలజీ
బయోటెక్నాలజీ రంగం నుంచి ఈసారి ప్రశ్నలు వచ్చేందుకు చాలా అవకాశాలున్నాయి. ముఖ్యంగా జన్యుమార్పిడి పంటల సాగు, క్షేత్ర పరీక్షలపై దేశంలో గందరగోళ పరిస్థితులపై ప్రశ్నలు అడగొచ్చు. జన్యు మార్పిడి పంటల సాగుపై వ్యతిరేకత ఎందుకు? దాని వల్ల లాభాలు, నష్టాలు ఏమిటి? మరీ ముఖ్యంగా బీటీ ట్రాన్స్‌జెనిక్స్‌పై అభ్యంతరాలు ఏమిటి? జీఎం లేబ్‌లింగ్ అంటే ఏమిటి? అది భారత్‌లో ఎలా అమలవుతోంది? తదితర అంశాలపై అభ్యర్థులు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవడం అవసరం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సుప్రీంకోర్టు టెక్నికల్ ఎక్స్‌పెర్ట్ కమిటీ బీటీ పంటల క్షేత్ర పరీక్షలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇలాంటి అంశాలపై అభ్యర్థి అభిప్రాయాలను తెలుసుకునేలా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
  • మూలకణాల చికిత్సను నియంత్రించే ఐసీఎంఆర్-డీబీటీ మార్గదర్శకాలు, రీప్రోగ్రామింగ్, కార్డ్ బ్యాంకింగ్, మూలకణాల అనువర్తనాలను అధ్యయనం చేయాలి.
  • ఆర్‌ఎన్‌ఏ, ఇంటర్‌ఫెరాన్స్, జన్యు థెరఫీ, మానవ జీన్ పేటెంటింగ్, జీవ ఎరువులు, జీవ క్రిమిసంహారకాలు, ఆర్గానిక్ వ్యవసాయం, బయోరెమిడియేషన్, ఇతర ఇంధనాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలి.
పర్యావరణం
మెయిన్స్‌లో మరో ముఖ్యమైన అంశం పర్యావరణ నష్టం. తాజాగా దేశంలో స్వచ్ఛ భారత్‌పై బాగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై ప్రశ్న రావొచ్చు. ముఖ్యంగా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో లోపాలు, మీ సూచనలు? అనే కోణంలో అధ్యయనం చేయాలి. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణలో సమస్యలు, లాభాలను తెలుసుకోవాలి. పట్టణీకరణలో ఘన వ్యర్థ నిర్వహణ పాత్రపై అవగాహన పెంపొందించుకోవాలి.
  • బయో మెడికల్ వ్యర్థాలు, రీసైక్లింగ్ పద్ధతులు, భారత్‌లో ఘన వ్యర్థ నిర్వహణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వంటి వాటిని చదవాలి.
  • వాతావరణ మార్పుల ప్రభావం ముఖ్యంగా సముద్ర ఆమ్లీకరణ వల్ల వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థలకు వాటిల్లే నష్టాలను గురించి తెలుసుకోవాలి. శీతోష్ణస్థితి మార్పు ప్రభావాలను ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధత, వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్‌ఏపీసీసీ), అందులో భాగంగా అమలవుతున్న ఎనిమిది జాతీయ మిషన్లు, లక్ష్యాలు, ప్రగతి తదితరాల గురించి తెలుసుకోవాలి.
  • కాంతి కాలుష్యం, భారలోహ కాలుష్యం, గంగానది ప్రక్షాళన, అటవీ నిర్మూలనను అరికట్టడం ద్వారా ఉద్గారాలను తగ్గించే కార్యక్రమం (ఆర్‌ఈడీడీ)పై అవగాహన పెంపొందించుకోవాలి.
  • జీవ వైవిధ్య పరిరక్షణ అంశంలో జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్న ముప్పు, సంరక్షణ చర్యలపై దృష్టిసారించాలి. పులి, ఖడ్గమృగం, ఏనుగు, గంగానది డాల్ఫిన్ వంటి వాటి పరిరక్షణ సమస్యల్ని తెలుసుకోవాలి. పశ్చిమ కనుమల పరిరక్షణకు గాడ్గిల్, కస్తూరిరంగన్ కమిటీల సిఫార్సులు, వాటి మధ్య భేదాలను తెలుసుకోవడం మంచిది.
  • భారత్‌లో అభివృద్ధి చర్యల ద్వారా జీవ వైవిధ్యం ఎలా దెబ్బతింటోంది? సుస్థిరాభివృద్ధి విధానాలను ఎలా అమలు చేయాలి? అటవీ హక్కుల అమల్లో సమస్యలపై దృష్టి సారించాలి. అదనంగా నగొయ ప్రొటోకాల్ సమాచారాన్ని తెలుసుకోవాలి.
మేధో సంపత్తి
మేధో సంపత్తి హక్కుల అంశంలో భారత్, అమెరికాల మధ్య నెలకొన్న వివాదం, యూఎస్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్ (యూఎస్‌టీఆర్) స్పెషల్ 301 కేటగిరీ, భారత్‌లో ఐపీఆర్ విధానం ఎలా ఉండాలి? అమెరికా వంటి దేశాలు భారత మేధోసంపత్తి రంగాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? తదితర అంశాలపై దృష్టిసారించాలి.
  • అమెరికా ఇటీవల భారత్ విషయంలో అమలు చేయాలని నిర్ణయించిన out of cycle review విధానం గురించి తెలుసుకోవాలి. దీంతోపాటు మేధోసంపత్తి రకాలు, సంబంధిత చట్టాలు, జియోగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) ద్వారా ఏ విధంగా సంప్రదాయ ఉత్పత్తులకు సంరక్షణ కల్పించవచ్చు అనే అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
Published date : 22 Nov 2014 11:02AM

Photo Stories