Skip to main content

CLAT‌ 2022: క్లాట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పరీక్ష విధానం, అర్హతలు, కెరీర్‌ అవకాశాలు ఇలా...

CLAT 2022 application process begins
CLAT 2022 application process begins

జాతీయస్థాయి న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోరుకునే విద్యార్థుల కోసం కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌(క్లాట్‌) నోటిఫికేషన్‌ వెలువడింది. కన్సార్టియం ఆఫ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీస్‌ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. క్లాట్‌ స్కోర్‌తో దేశంలోని 22 జాతీయస్థాయి న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందవచ్చు. ఇందులో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ, ఏడాది వ్యవధి ఉండే ఎల్‌ఎల్‌ఎం కోర్సులు ఉన్నాయి. క్లాట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. న్యాయ విద్య ప్రాధాన్యత, క్లాట్‌ పరీక్ష విధానం, అర్హతలు, లాతో కెరీర్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం.. 

  • క్లాట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల
  • నాణ్యమైన న్యాయ విద్యకు కేరాఫ్‌ ఎన్‌ఎల్‌యూలు

సివిల్, క్రిమినల్‌ కేసులు, సైబర్‌ క్రైమ్, ఆన్‌లైన్‌ మోసాలు, కాపీ రైట్‌ నిబంధనల ఉల్లంఘనలు.. ఇలా నిత్యం అనేక కేసులు. ఇవే కాకుండా సాంకేతికతో ముడిపడిన కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దాంతో న్యాయ పరంగా సమస్య పరిష్కారాన్ని అందించే లా పట్టభద్రులకు డిమాండ్‌ ఏర్పడింది. జాతీయస్థాయిలో లా కోర్సులను అందించడంలో పేరుగాంచిన నేషనల్‌ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ)లో కోర్సులు పూర్తిచేసిన ప్రతిభావంతులకు ఉజ్వల అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందాలంటే.. కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌(క్లాట్‌)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. క్లాట్‌లో సాధించిన స్కోర్‌ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 22 ఎన్‌ఎల్‌యూలలో ప్రవేశాలు కల్పిస్తారు. వీటిల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ, అలాగే ఏడాది వ్యవధి కలిగిన ఎల్‌ఎల్‌ఎం కోర్సులు ఉన్నాయి.

అర్హతలు

  • ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ: ఐదేళ్ల కాలవ్యవధి ఉండే ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీలో చేరాలనుకునే అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హతలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 40శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. మార్చి/ఏప్రిల్‌ 2022లో కోర్సు చివరి సంవత్సరం పరీక్షలు రాయనున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


చ‌ద‌వండి: ‘లా’ .. యువత ఆకర్షణీయ కెరీర్

పీజీ(ఎల్‌ఎల్‌ఎం)

కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉత్తీర్ణులైన విద్యార్థులు ఏడాది కాలవ్యవధి కలిగిన ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 45శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.

క్లాట్‌ పరీక్ష విధానం

  • ఆఫ్‌లైన్‌ విధానంలో 150 ప్రశ్నలకు క్లాట్‌ పరీక్ష జరుగుతుంది. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. 
  • క్లాట్‌ యూజీలో మొత్తం ఐదు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ విభాగం నుంచి 10శాతం(13–17) , ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 20 శాతం(28–32), లీగల్‌ రీజనింగ్‌ 20 శాతం(35–39), కరెంట్‌ అఫైర్స్‌(జనరల్‌ నాలెడ్జ్‌తో కలిపి) నుంచి 25శాతం(35–39), లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 25శాతం(28–32) ప్రశ్నలు వస్తాయి. 
  • ఎన్‌ఎల్‌యూలలో సీటు రావాలంటే.. 150 మార్కులకు గాను 115 మార్కులకుపైగా స్కోర్‌ సాధించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రశ్న పత్రం క్లిష్టతపై కటాఫ్‌ ఆధారపడి ఉంటుంది. 

పీజీ (ఎల్‌ఎల్‌ఎం)

  • పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్‌ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. 
  • కాన్‌స్టిట్యూషనల్‌ లా 60 ప్రశ్నలు–60 మార్కులు, ఇతర లా సబ్జెక్టులు(కాంట్రాక్ట్, టార్ట్స్, క్రిమినల్, ఇంటర్నేషనల్‌ లా, ఎన్విరాన్‌మెంట్, లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా, ఐపీఆర్‌ తదితర) నుంచి 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు చివరి తేదీ: 31.03.2022
  • పరీక్ష తేదీ: 08.05.2022
  • వెబ్‌సైట్‌: https://consortiumofnlus.ac.in/clat-2022

ఉన్నత విద్య

బ్యాచిలర్‌ ఆఫ్‌ లా పూర్తిచేసిన వారు మాస్టర్స్‌ చేయడానికి విదేశాలకు వెళ్లవచ్చు. కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, సింగపూర్‌ యూనివర్సిటీల్లో లా కోర్సుల్లో చేరడానికి వెళ్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మన దేశంలో పీజీకి సంబంధించి చాలా యూనివర్సిటీలు ఏడాది వ్యవధిగల లా ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్స్‌ పూర్తిచేసిన తర్వాత టీచింగ్‌ ఫ్యాకల్టీగా పనిచేయవచ్చు.

అవకాశాలు

  • న్యాయ విద్య పూర్తిచేసిన వారికి ఉద్యోగావకాశాలకు కొదవ లేదు. లా కోర్సులు ఉత్తీర్ణులైన తర్వాత లీగల్‌ అడ్వైజర్, అడ్వకేట్, లీగల్‌ మేనేజర్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లాంటి ఉపాధి అవకాశాలు పొందవచ్చు. 
  • సివిల్, క్రిమినల్, వినియోగదారుల చట్టాలు, మనవ హక్కులు, పన్నులు, కంపెనీ లా, మేథో సంపత్తి చట్టాలు, రాజ్యాంగం తదితర అంశాల్లో నైపుణ్యాన్ని సంపాదిస్తే.. ఆయా రంగాల్లో వచ్చే కేసుల ద్వారా కెరీర్‌ పరంగా మంచి పేరు, ఆదాయ పరంగా లబ్ధిపొందవచ్చు. ఇక్కడ కేసులు, వాదన అనుభవం ఆధారంగా ఫీజు లభిస్తుంది.
     

చ‌ద‌వండి: LAWCET Guidance

Published date : 04 Jan 2022 05:45PM

Photo Stories