AIBE-2021: ఇలా సిద్ధమవ్వాలి!!
ఆలిండియా బార్ ఎగ్జామినేషన్(ఏఐబీఈ)–2021కు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది జాతీయ స్థాయిలో ఏడాదికి రెండు సార్లు నిర్వహించే పరీక్ష. ఏఐబీఈ రాసేందుకు లా గ్రాడ్యుయేట్లు అర్హులు. అక్టోబర్ 31న ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. ఏఐబీఈతో ప్రయోజనాలు, అర్హతలు, పరీక్షా విధానంపై కథనం..
ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ) అనేది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష. దీనిద్వారా న్యాయ విద్య అభ్యసించిన అభ్యర్థుల్లో.. లా ప్రాక్టీస్‌కు అవసరమైన సబ్జెక్టులపై ఉన్న ప్రాథమిక అవగాహనను, విశ్లేషణాత్మక సామర్థ్యాలను అంచనా వేస్తారు. 2010 నుంచి కోర్టుల్లో ప్రాక్టీస్ చేయాలంటే.. ఏఐబీఈ తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాలనే నిబంధన ఉంది. 2009 లేదా అంతకుముందు న్యాయవిద్య పూర్తి చేసిన లా గ్రాడ్యుయేట్లకు ఈ నిబంధన వర్తించదు.
చదవండి: టీఎస్ లాసెట్–2021 నోటిఫికేషన్ విడుదల.. వివరాలు తెలుసుకోండిలా..
ప్రాక్టీస్‌కు అర్హత
ఏఐబీఈ పరీక్షలో జనరల్/ఓబీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు కనీసం 40 శాతం, ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందినవారు కనీసం 35శాతం మార్కులు పొందితే ఉత్తీర్ణులైనట్లుగా ప్రకటిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్‌ను ప్రధానం చేస్తుంది. ఏఐబీఈలో ఉత్తీర్ణులు కాకుండా.. తాత్కాలిక న్యాయవాదులుగా స్టేట్ బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నా.. ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉండదు.
పరీక్షకు ఎవరు అర్హులు
ఏఐబీఈకి దరఖాస్తు చేసుకునేందుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కాలేజీ నుంచి మూడు/ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ పూర్తి చేయాలి. వారి సొంత రాష్ట్రాల్లోని స్టేట్ బార్ కౌన్సిళలో న్యాయవాదులుగా నమోదు చేసుకొని ఉండాలి. ఈ పరీక్ష రాసేందుకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
‘ఓపెన్ బుక్’ విధానం రద్దు
ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్(ఏఐబీఈ)లో ఈ ఏడాది కొన్ని కీలక మార్పులు చేశారు. గతంలో ఈ పరీక్ష రాసేందుకు పరీక్ష కేంద్రంలోకి పుస్తకాలు/స్టడీ మెటీరియల్ (ఓపెన్ బుక్ విధానం)ను అనుమతించేవారు. కాని ఈ ఏడాది నుంచి నోట్స్ గాని, పుస్తకాలుగాని తీసుకెళ్లేందుకు అవకాశం లేదు. పరీక్షా కేంద్రంలోకి బేర్ చట్టాలను తీసుకెళ్లేందుకు మాత్రం అనుమతించారు. ఆఫ్‌లైన్ విధానంలో జరిగే ఏఐబీఈ పరీక్షను 11 భాషల్లో రాసుకోవచ్చు. మల్టిపుల్ చాయిస్‌లో విధానంలో 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయించారు. నెగిటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం మూడున్నర గంటలు.
ఇలా సిద్ధమవ్వాలి
- ఏఐబీఈ–2021 పరీక్ష అక్టోబర్ 31 నిర్వహించనున్నారు. కాబట్టి పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని సమర్థంగా వినియోగించుకోవాలి. పరీక్ష విధానంపై అవగాహన పెంచుకోవాలి.
- ముఖ్యంగా ఈసారి బేర్ యాక్ట్స్ బుక్స్ తప్ప ఇతర పుస్తకాలను, నోట్స్‌ను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని గుర్తించాలి. కాబట్టి అభ్యర్థి పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడిగినా సొంతంగా సమాధానం గుర్తించేలా ప్రిపరేషన్ సాగించాలి. ఇప్పుడు ఈ పరీక్షలో నెగ్గాలంటే.. చట్టాలపై అవగాహనతో పాటు జ్ఞాపకశక్తి కూడా చాలా అవసరం.
- ప్రశ్నలు అధికారిక సిలబస్ నుంచి మాత్రమే వస్తాయి. కాబట్టి పరీక్ష కోసం ఉద్దేశించిన ఏఐబీఈ సిలబస్‌పై పట్టు సాధించాలని నిపుణులు సూచిస్తున్నారు. చాప్టర్ వైజ్‌గా సిలబస్‌ను విభజించి.. ప్రతి విభాగానికి కొంత సమయం కేటాయించాలి. క్లిష్టంగా ఉండే టాపిక్స్‌కు అదనంగా సమయం కేటాయించి చదవాలి. అభ్యర్థులు ఏఐబీఈ నమూనా ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం మంచిది. దీనివల్ల వాస్తవ పరీక్షను ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు గడువు ఈ నెల 25వ తేదీతో ముగిసింది.
దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేది: 28.09.2021
అడ్మిట్ కార్డ్‌ల విడుదల: 11.10.2021
పరీక్ష తేది: 31.10.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://allindiabarexamination.com