ఉద్యోగ ఖాళీల లెక్క తేల్చి నియామకాలు చేపట్టాలి...
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల లెక్క తేల్చాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.
వివిధ విభాగాల్లో ఉద్యోగ ఖాళీలపై స్పష్టత వచ్చిన తర్వాతే భర్తీ ప్రక్రియ సాధ్యమవుతుందని సూచించింది. జనవరి 1వ తేదీన ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్యను బహిర్గతం చేసిన తర్వాతే నియామకాలు చేపట్టాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ చేశారని, ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 2.5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీ జరగకపోవడంతో ప్రభుత్వ కార్యక్రమాల అమలు, పౌరసేవల కల్పనలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.రాష్ట్రంలో డిగ్రీ, ఆపై ఉన్నత విద్యను చదివిన అభ్యర్థులు 16 లక్షల మందికిపైగా ఉన్నారని, వీరందరినీ దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ ఖాళీలు, భర్తీపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎంను కృష్ణయ్య కోరారు.
Published date : 02 Jan 2021 04:44PM