Skip to main content

టీఎస్ టెన్‌‌త పరీక్ష నిర్వహణ విధుల్లో టీచర్లు నిర్లక్ష్యం వహిస్తే... ఇంక్రిమెంట్ల నిలిపివేత.. సర్వీస్ నుంచి డిస్మిస్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష విధులను నిర్వర్తించే ఉపాధ్యాయులపై ‘మాస్ కాపీయింగ్’ కత్తి వేలాడుతోంది.
పరీక్ష విధుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించినా ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఉంది. గతేడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుంటే పట్టించుకోనందుకు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఏడుగురు టీచర్లకు మూడేసి ఇంక్రిమెంట్లు నిలిపేయడం, ఒక ఉపాధ్యాయురాలిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడంతో రాష్ట్రం లోని ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. వచ్చే మార్చిలో మళ్లీ పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ విధులంటేనే టీచర్లు వణికిపోయే పరిస్థితి వచ్చింది. పదో తరగతి ఇన్విజిలేషన్ స్కూల్ అసిస్టెంట్లకు కాకుండా సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ టీచర్లకు వేస్తారు. వారు పరీక్ష విధుల సందర్భంగా మాస్ కాపీయింగ్ విద్యార్థుల విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా ఇబ్బందుల్లో పడే పరిస్థితి నెలకొంది.

నిబంధనలు తెలియవు..
పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడే విద్యార్థులను నిరోధించేందుకు మాల్‌ప్రాక్టీస్‌ను ప్రోత్సహించే టీచర్లకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌‌స యాక్ట్ 1997, ప్రివెన్షన్ ఆఫ్ మాల్‌ప్రాక్టీసెస్ యాక్ట్ 25/1997 ప్రకారం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. అయితే ఈ నిబంధనలు సెకండరీ గ్రేడ్ టీచర్లకు తెలియవు. అనేక మంది ప్రభుత్వ టీచర్లకు విద్యా శాఖకు సంబంధించిన ఉత్తర్వుల గురించే తెలియదు. మాల్‌ప్రాక్టీస్ నిరోధక చట్టాలపైనా అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని టీచర్ల సంఘాల నేతలు చెబుతున్నారు.
Published date : 30 Jan 2020 05:04PM

Photo Stories