Skip to main content

కొత్త ఉద్యోగాలు వస్తున్నాయోచ్...

సాక్షి, అమరావతి: ‘కొత్త కొలువులు వస్తున్నాయి. 2021లో దేశంలో 53 శాతం కంపెనీలు కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు సంసిద్ధమవుతున్నాయి.’

అని ‘ఇండియాస్ ట్యాలెంట్ ట్రెండ్‌‌స- 2021’ నివేదిక వెల్లడించింది. బ్రిటన్ ప్రధాన కేంద్రంగా ఉన్న ‘మైఖేల్ పేజ్’ అనే రిక్రూటింగ్ ఏజెన్సీ దీన్ని విడుదల చేసింది. 2021లో ఇతర ఆసియా-పసిఫిక్ దేశాల కంటే భారత్‌లో కొత్త ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ఆసియా-పసిఫిక్ దేశాల్లోని 42 శాతం కంపెనీలు కొత్త ఉద్యోగాలు కల్పించనున్నాయని అంచనా వేసింది. కరోనా నుంచి కోలుకుని మెల్లగా గాడిలో పడిన దేశ ఆర్థిక వ్యవస్థ జోరందుకోనుందని పేర్కొంది.

ఈ నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ..

  • టెక్నాలజీ రంగంలో ఉన్న కంపెనీల్లో ఏకంగా 74 శాతం కంపెనీలు తాము ఉద్యోగుల సంఖ్యను 14 శాతం పెంచుతామని తెలిపాయి. రిమోట్ వర్కింగ్‌కు అవకాశాలు కల్పిస్తామని ఆ కంపెనీలు చెప్పాయి.
  • డేటా సైంటిస్టులు, గ్రోత్ హ్యాకర్స్, పెర్ఫార్మెన్స్ మార్కెటర్స్, సేల్స్-బిజినెస్ డెవలపర్స్, రీసెర్చ్ డెవలపర్స్, లీగల్ కౌన్సిల్ మొదలైన ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువ ఉంటుందని పేర్కొంది.
  • కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న ఆ 53 శాతం కంపెనీల్లో 60 శాతం కంపెనీలు ఉద్యోగుల జీతాలు పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. ఇక వాటిలో 55 శాతం కంపెనీలు ఉద్యోగులకు బోనస్‌లు ఇచ్చేందుకు సిద్ధపడుతుండగా.. 43 శాతం కంపెనీలు ఒక నెల కంటే ఎక్కువ జీతం బోనస్‌గా ఇవ్వనుండటం విశేషం.
  • జీతాల పెంపుదలలో టెక్నాలజీ, ఆరోగ్య సేవల రంగం మొదటి స్థానంలో ఉంది. టెక్నాలజీ రంగంలో 15 శాతం నుంచి 25 శాతం, ఆరోగ్య సేవల రంగంలో 15 నుంచి 20 శాతం వరకు జీతాలు పెరిగే అవకాశాలున్నాయి. రిటైల్ రంగంలో 7.6 శాతం, ఈ-కామర్స్/ఇంటర్నెట్ సేవల రంగాల్లో 7.5 శాతం, తయారీ రంగంలో 5.9 శాతం, నిర్మాణ రంగంలో 5.3 శాతం జీతాలు పెరగవచ్చు.
  • ఈ కంపెనీలు తమ ఉద్యోగుల్లో మూడోవంతు మందికి పదోన్నతులు కల్పించనున్నాయి.
Published date : 17 Feb 2021 02:31PM

Photo Stories