కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో రిటైర్డ్ మెడికల్ ప్రొఫెసర్లకు బోధనావకాశం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీల్లో వైద్య విద్యార్థులకు బోధించేందుకు నిష్ణాతులైన రిటైర్డ్ ప్రొఫెసర్ల నుంచి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానించింది.
ఆసక్తి కలిగిన 70 ఏళ్లలోపు వారు వచ్చే నెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి జనవరి 28 (మంగళవారం)నఓ ప్రకటనలో కోరారు. వారానికి 2 క్లాసులు, మొత్తం 4 గంటలు బోధించాల్సి ఉంటుంది. వారికి ఎటువంటి గౌరవ వేతనం ఇవ్వబోమని ఆయన తెలిపారు. మెడికల్, డెంటల్ కాలేజీల్లో వైద్య విద్య నాణ్యతను, ప్రమాణాలను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. బోధనా వైద్యుల కొరత తీర్చడం కోసం ఈ నిర్ణయం తీసుకోలేదని, నిష్ణాతులైన రిటైర్డ్ ప్రొఫెసర్లను తీసుకోవడమే తమ లక్ష్యమన్నారు. వివిధ స్పెషాలిటీల్లో ప్రావీణ్యం సంపాదించిన వారికి ప్రాధాన్యమిస్తామన్నారు. ఎంతమందిని తీసుకోవాలన్న నిర్ణయం తీసుకోలేదని, వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. వరంగల్‌లోని తమ విశ్వవిద్యాలయానికి అవసరమైన డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Published date : 29 Jan 2020 04:50PM