Skip to main content

Artificial Intelligence: టెక్‌ ఉద్యోగులకే కాదు.. వీరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు!

Artificial Intelligence Can Replace Auditors And Accountants

ఆర్థిక వ్యవహారాల్లో ఆడిటర్లు, అకౌంటెంట్ల పాత్ర చాలా కీలకం. అయితే వీరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ముప్పు పొంచి ఉంది. ఆడిటర్లు, అకౌంటెంట్లు చేస్తున్న పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయగలదని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్ అన్నారు.

సీఏ ఎస్. హరిహరన్ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో సోమనాథన్‌ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థపై ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ నిర్దిష్ట ప్రభావాన్ని కలిగి ఉందన్నారు. వ్యాపార ప్రక్రియలో ఆటోమేషన్‌ను కృత్రిమ మేధస్సు మరింత శక్తివంతంగా చేస్తుందన్నారు. ఆడిటర్లు, అకౌంటెంట్లు చేస్తున్న పనిని కొంచెం ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ భర్తీ చేయగలదని ఆయన అన్నారు.

ఇక భారత ఆర్థిక వ్యవస్థలో క్రెడిట్ లెండింగ్ విస్తరణను తాను ఊహించగలనని సోమనాథన్‌​ పేర్కొన్నారు. ‘భారతదేశంలో ప్రైవేట్ రంగానికి జీడీపీలో సుమారు 55 శాతం క్రెడిట్ ఉండగా, చైనాలో ఇది 180 శాతానికి పైగా ఉంది. అయితే ఇది ఆరోగ్యకరమని లేదా వాంఛనీయమని చెప్పను. ఇది జీడీపీలో 100-120 శాతానికి పెరగాలి. ఇది పెట్టుబడి వృద్ధిని వేగవంతం చేస్తుంది’ అన్నారు.

ఇప్పటి వరకూ ప్రారంభంకాని ప్రాజెక్ట్‌లు కూడా తగినంత క్రెడిట్ లభిస్తే ప్రారంభమవుతాయన్నారు. అయితే ఎన్‌పీఏలు లేకుండా క్రెడిట్ పరిమాణాన్ని విస్తరించడం సవాలు అన్నారు. ఈ క్రెడిట్ విస్తరణ అకౌంటెంట్లకు డిమాండ్‌ పెరగుతుందని అభిప్రాయపడ్డారు. 

భవిష్యత్తులో భారత్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య నిరంతరం పెరుగుతుందని,  6 నుంచి 7 శాతం వార్షిక విస్తరణను చూడగలమని సోమనాథన్‌ వివరించారు. ఫలితంగా నిపుణులైన అకౌంటెంట్లకు డిమాండ్‌ పెరుగుతుందన్నారు.

Published date : 25 Sep 2023 07:11PM

Photo Stories