JEE Main 2024: జేఈఈ మెయిన్స్‌కు సర్వం సిద్ధం.. ఈ మార్కులతో జాగ్రత్త
ఫిబ్రవరి 1వ తేదీ వరకూ ఈ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. జేఈఈ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అన్ని ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించింది. మొదటి మూడు రోజులు ఆర్కిటెక్చర్ (పేపర్–1) ఉంటుంది. ఈ పరీక్ష రాసే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉంచినట్టు ఎన్‌టీఏ తెలిపింది. జేఈఈ ఇంజనీరింగ్ విభాగానికి జనవరి 27 నుంచి పరీక్ష ఉంటుంది. ఈ విద్యార్థుల అడ్మిట్ కార్డులు 25 లోగా ఆన్‌లైన్‌లో ఉంచే అవకాశముంది.
రెండు విభాగాలకు కలిపి దేశవ్యాప్తంగా ఈ ఏడాది 12 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2.4 లక్షల మంది పరీక్ష రాస్తారని సమాచారం. జేఈఈ మెయిన్స్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని, భద్రత కల్పిస్తామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. మొదటి షిప్టు ఉదయం 9 నుంచి, రెండో షిప్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉంటుంది. ప్రతీ సెషన్ మూడు గంటల వ్యవధితో ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించబోమని ఎన్‌టీఏ ప్రకటించింది. ఈసారి భద్రత వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఫేషి యల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | వీడియోస్
11 కేంద్రాల్లో మెయిన్స్
తెలంగాణలో 11 కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వ హించనున్నట్టు ఎన్‌టీఏ తెలిపింది. హైదరాబా ద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబా ద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌తోపాటు ఏపీలోని 30 కేంద్రాల్లో పరీక్షలు ఉన్నట్టు అధికారులు వివరించారు.
పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్ సహా మొత్తం 10 భాషల్లో నిర్వహిస్తారు. రెండో దశ పరీక్షలు ఏప్రిల్ లో చేపడతారు. ఈసారి పరీక్ష కోసం సిలబస్ తగ్గించారు. కోవిడ్ సమయంలో కేంద్ర విద్యా సంస్థల్లో టెన్త్ రాసినవారు ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ కు హాజరవుతున్నారు. ఆ సమయంలో వీళ్లకు సిలబస్ కుదించారు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని 25% సిలబస్‌ను మెయిన్స్ నుంచి తొలగించారు. గణితంలో సుదీర్ఘ ప్రశ్నలను తొలగించారు. ఈ కారణంగా మెయిన్స్ రాసే వారి సంఖ్య పెరగుతోంది.
నెగెటివ్ మార్కులతో జాగ్రత్త
జేఈఈ మెయిన్స్‌లో నెగెటివ్ మార్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నా రు. సమాధానం కచ్చితంగా రాస్తే 4 మార్కులు ఉంటాయి. తప్పుగా టిక్ పెడితే మైనస్–1 అవుతుంది. కాబట్టి తెలియని ప్రశ్నలకు ఊహించి రాసేకన్నా, వదిలేయడమే మంచిదని గణిత శాస్త్ర నిపుణులు ఎంఎన్ రావు తెలిపారు. కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నల కోసం ముందే సమయం వృథా చేయకూడదని, వాటి గురించి ఆఖరులో ఆలోచించాలని ఆయన సూచించారు.
అనవసర ప్రశ్నలకు తలబాదుకుంటూ కూర్చుంటే ఆ ప్రభావం తెలిసిన ప్రశ్నలపై పడే అవకాశం ఉంటుందని భౌతిక శాస్త్ర నిపుణుడు విక్రమ్ సింగ్ చెప్పారు. ముందుగానే జేఈఈ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన పత్రాలన్నీ (సెల్ఫ్ డిక్లరేషన్, అండర్ టేకింగ్ ఫాం) దగ్గర ఉంచుకోవాలని ఎన్‌టీఏ సూచించింది. వాటర్ బాటిల్స్, హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు, బాల్ పాయింట్ పెన్నులను అనుమతిస్తామని తెలిపింది.