Skip to main content

JEE: జేఈఈ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌.. ప్రారంభ తేదీ ఇదే..

దేశంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీలు), నేషనల్‌ ఇన్ స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్ ఐటీలు), ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీలు)లతో పాటు ప్రభుత్వ ఆర్థిక సాయం పొందుతున్న సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌ ప్రక్రియ అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభం కానుంది.
JEE
జేఈఈ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌.. ప్రారంభ తేదీ ఇదే..

ఈ మేరకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా–2021) ఇంతకు ముందే అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు వెలువడ్డాక అడ్మిషన్ల ప్రక్రియను జోసా ప్రారంభించనుంది. జేఈఈ మెయిన్ తుది విడత ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం చోటు చేసుకున్న నేపథ్యంలో అడ్వాన్స్ డ్ పరీక్షల ప్రక్రియ కొంత ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 11కి ముందే జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలవుతాయని భావించారు. ఈ మేరకు జేఈఈ అడ్వాన్స్ డ్కు సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని ఆ పరీక్ష నిర్వహణ సంస్థ.. ఐఐటీ ఖరగ్పూర్ ముందు నోటిఫికేషన్ ఇచ్చింది. జేఈఈ మెయిన్ ఫలితాలు ఆలస్యం కావడంతో సెప్టెంబ‌ర్‌ 13కి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వాయిదా వేసింది. మెయిన్ ఫలితాలు 14న విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చివరి తేదీని సెప్టెంబర్ 21 (నేడు) వరకు ఐఐటీ ఖరగ్పూర్ పొడిగించింది. అడ్వాన్స్ డ్కు 2.50 లక్షల మంది.. జేఈఈ మెయిన్ లో నిర్దేశిత కటాఫ్తో మెరిట్లో ఉన్న 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్ డ్కు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి అక్టోబర్ 3న పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లలో ఈ పరీక్ష జరగనుంది. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను అక్టోబర్ 5 సాయంత్రం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రాథమిక ‘కీ’ని అక్టోబర్ 10న విడుదల చేయనున్నారు. దీనిపై 10, 11 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అక్టోబర్ 15న అడ్వాన్స్ డ్ పరీక్ష తుది ఫలితాలను విడుదల చేస్తారు. 16 నుంచి అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. 23 ఐఐటీలు, 31 ఎన్ ఐటీలు, 26 ఐఐఐటీలు, 29 గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్ స్టిట్యూట్ (జీఐఎఫ్టీ)ల్లోని సీట్లను మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఆయా అభ్యర్థులకు కేటాయించనుంది.

మెయిన్ పరీక్ష స్కామ్లో 20 మంది విద్యార్థులపై వేటు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) 2021 నుంచి జేఈఈ మెయిన్ ను నాలుగు దశల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ లో నిర్వహించిన ఈ పరీక్షలకు 9,39,008 మంది దరఖాస్తు చేశారు. చివరిదైన నాలుగో సెషన్ లో 7 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. నాలుగు సెషన్లలో విద్యార్థులు దేనిలో ఎక్కువ స్కోర్ సాధిస్తే దాన్నే తుది ఫలితంగా ఎన్ టీఏ పరిగణించింది. అయితే చివరి సెషన్ లో కొందరి స్కోర్ తొలి సెషన్ స్కోర్ కంటే అమాంతం పెరిగిపోవడం అనేక అనుమానాలకు తావిచి్చంది. హరియాణాలోని సోనిపట్లో ఒక కేంద్రంలో పరీక్షలు రాసిన వారికి ఇలా అత్యధిక మార్కులు వచ్చాయి. అంతకు ముందు 38, 40కి మించి స్కోర్ రానివారు ఏకంగా 95 నుంచి 99 పాయింట్ల స్కోర్ సాధించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో సీబీఐ విచారణ చేపట్టి ఒక ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన ఆరుగురిని ఇప్పటికే అరెస్టు చేసింది. అంతేకాకుండా ఈ స్కామ్లో ఉన్న 20 మంది విద్యార్థుల ఫలితాలను విత్హెల్డ్లో ఉంచింది. దీంతోపాటు రానున్న మూడేళ్లు ఈ పరీక్షలు రాయడానికి వీల్లేకుండా వారిని డిబార్ చేసింది.
చదవండి:

JEE Main: జేఈఈ మెయిన్‌ కి 70 మంది విద్యార్థులు హాజరు కాగా, 37 మందికి ఉత్తమ స్కోర్‌

JEE Main: జేఈఈలో మెరిసిన తెలుగుతేజాలు

Published date : 22 Sep 2021 01:16PM

Photo Stories