Inter Practicals : ఈ సారి ఇంటర్ ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్..?
ఇప్పటి వరకూ ప్రాక్టికల్స్ పరీక్షలను విద్యార్థులు చదివే కాలేజీల్లోనే నిర్వహిస్తున్నారు. దీన్ని నివారించి ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఉన్నతస్థాయిలో కసరత్తు చేస్తోంది. జంబ్లింగ్ విధానంలో కాలేజీలోని విద్యార్థులను వేర్వేరు పరీక్ష కేంద్రాలకు పంపుతారు. దీన్ని ప్రైవేటు కాలేజీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ జంబ్లింగ్ విధానాన్నే అనుసరిస్తుండగా, తెలంగాణలో మాత్రం ప్రతీ ఏటా ఈ విధానం తెస్తామని చెప్పి వాయిదా వేస్తున్నారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ |ఏపీ ఇంటర్
అసలు జంబ్లింగ్ ఎందుకంటే..?
ఇంజనీరింగ్ వంటి సాంకేతిక విద్యకు ఇంటర్ కీలకమైంది. ఇంటర్‌లో మాదిరి బట్టీ పట్టి చదివే విధానం కాకుండా.. ఇంజనీరింగ్‌లో స్వతహాగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. కానీ ప్రైవేటు కాలేజీల్లో చాలావరకూ ప్రాక్టికల్స్ మీద ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. పుస్తకాల్లోని పాఠాలను బట్టీ పట్టించి మార్కులు సాధించేలా బోధన సాగుతోందని నిపుణులు అంటున్నారు. ద్వితీయ ఇంటర్ విద్యార్థులకు భౌతిక, రసాయన శాస్త్రాల్లో ఒక్కో సబ్జెక్టు లో 20, వృక్ష, జంతు శాస్త్రల సబ్జెక్టుల్లో 12 చొప్పున ప్రాక్టికల్స్ చేయించాలి. వీటి రికార్డులను విద్యార్థులు సమరి్పంచాలి. కానీ ప్రైవేటు కాలేజీల్లో ఎక్కడా ప్రయోగశాలలు, ప్రయోగ పరికరాలు కన్పించడం లేదని ఇంటర్ బోర్డ్ పరిశీలనలో వెల్లడైంది. కేవలం పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లను ప్రలోభ పెట్టి మార్కులు వేయించుకోవడం ఆనవాయితీగా మారుతోందన్న విమర్శలున్నాయి. ఈ కారణంగానే ప్రైవేటు కాలేజీల్లో ఎక్కువ మందికి ప్రతీ సబ్జెక్టు ప్రాక్టికల్స్‌లో 30కి 30 మార్కులు పడుతున్నాయనే ఆరోపణలున్నాయి.
ప్రాక్టికల్ మార్కుల పేరుతో..
జంబ్లింగ్ తేకుండా ప్రైవేటు కాలేజీలు ఇంటర్ బోర్డ్ కమిషనర్ నవీన్ మిత్తల్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ఆయన ఒప్పుకోని పక్షంలో రాజకీయంగా చక్రం తిప్పాలనే ఆలోచనలో ఉన్నాయి. జంబ్లింగ్ రాకుండా ఇంతకాలం కాలేజీలు పెద్దఎత్తున అధికారులకు ముడుపులు ఇచ్చాయనే విమర్శలున్నాయి. ఇప్పుడీ విధానాన్ని మిత్తల్ అనుమతించే అవకాశం లేదనే ఆందోళనలో కాలేజీ యాజమాన్యాలు ఇతర మార్గాలను ఎంచుకుంటున్నాయి. ప్రాక్టికల్ మార్కుల పేరుతో కాలేజీలు పెద్దఎత్తున విద్యార్థుల నుంచి అనధికారికంగా వసూలు చేస్తున్నాయి. ప్రాక్టికల్స్‌లో మార్కులు రాకపోతే ప్రవేశాలు కష్టమనే భావనతో జంబ్లింగ్‌ను నివారించేందుకు ప్రైవేటు కళాశాలలు ఏకమవుతున్నట్టు తెలిసింది.