TS Inter: ఇంటర్ ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే అవకాశం..ఎందుకంటే..?
దీనివల్ల మూల్యాంకనం, తద్వారా ఫలితాల వెల్లడి ఆలస్యం అయ్యే అవకాశం ఉందని బోర్డు వర్గాలు అంటున్నాయి. గత నెల అక్టోబర్ 25వ తేదీ నుంచి మొదలైన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నవంబర్ 3వ తేదీతో ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.12 లక్షల మంది పరీక్షలు రాశారు. మొత్తం 40 లక్షలకు పైగా పేపర్లను అధికారులు మూల్యాంకనం చేసి, మార్కులు అందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది. నెలాఖరులోగా ఫలితాలు వెల్లడిస్తామన్న ధీమా కూడా అధికారులు వ్యక్తం చేశారు. ఇందుకు అనుగుణంగానే జిల్లా కేంద్రాల్లో ఈ నెల 3 నుంచి మూల్యాంకన ప్రక్రియను పెద్ద ఎత్తున మొదలు పెట్టారు. అయితే అధికారుల మధ్య సమన్వయ లోపం, ఇతర అంశాల కారణంగా ఇంతవరకు వేగం పుంజుకోలేదు.
చీఫ్ ఎగ్జామినర్లుగా జూనియర్లా...?
మూల్యాంకనం సందర్భంగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు అధికారులు ఇంటర్ బోర్డ్ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. కానీ అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో వీటిని ఏమాత్రం పరిగణన లోనికి తీసుకోలేదని తెలిసింది. స్పాట్ వాల్యూయే షన్‌లో సీనియర్లకు కాకుండా, జూనియర్లకు ఎక్కు వగా బాధ్యతలు అప్పగించడం తొలిరోజే వివాదాస్పదమైంది. చీఫ్ ఎగ్జామినర్స్, అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా జూనియర్లను వేయడం ఏమిటని సీనియర్ అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. సమస్య తలెత్తినప్పుడు పరిష్కరించడం వారికి కష్టమవుతుందని చెబుతున్నారు. ఇది తమను అవమానించడమేనని కొందరు అంటున్నారు. తాజా పరిణామాల ప్రభావం స్పాట్‌పై పడుతుందనే సందేహాలు ఉన్నతాధికారుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
మూల్యాంకనం ఆలస్యమైతే..
మూల్యాంకనం ఆలస్యమైతే, అధ్యాపకులు ఇదే విధుల్లో ఎక్కువ కాలం కొనసాగితే బోధన దెబ్బ తింటుందని ప్రభుత్వ అధ్యాపకులు చెబుతున్నారు. దాదాపు 40 లక్షల పేపర్లు కేవలం ప్రభుత్వ అధ్యాపకులే మూల్యాంకనం చేయడం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే వీలుందని చెబుతున్నారు. అయితే ప్రైవేటు కాలేజీల అధ్యాపకులను స్పాట్ వాల్యూయేషన్‌కు పంపేందుకు యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదని, తమ విద్యార్థుల క్లాసులు దెబ్బతింటాయని చెబుతున్నారని బోర్డు అధికారులు అంటున్నారు. కాగా అధికారుల తీరును ప్రభుత్వ అధ్యాపకులు తప్పుబడుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు నష్టం కలిగినా ఫర్వాలేదని, ప్రైవేటు కాలేజీలు మాత్రం సక్రమంగా జరగాలన్నట్టుగా ఇంటర్ బోర్డ్ అధికారులు వ్యవహరించడం దారుణమని అంటున్నారు. ప్రైవేటు అధ్యాపకులను మూల్యాంకనంలో భాగస్వాములను చేయని పక్షంలో వారం రోజుల్లో పూర్తవ్వాల్సిన మూల్యాంకన ప్రక్రియ మూడు వారాలు పడుతుందని చెబుతున్నారు. మూల్యాంకనం కొనసా గుతుంటే విద్యా బోధనపై దృష్టి పెట్టలేమని అంటున్నారు. కీలక సమయంలో మొదటి, ద్వితీయ ఇంటర్ విద్యార్థులకు నష్టం కలుగుతుందని పేర్కొంటున్నారు.
‘స్పాట్’కు రాకుంటే...
స్పాట్ వాల్యుయేషన్ కోసం నియమించిన ప్రతీ సిబ్బంది సంబంధిత క్యాంపు కార్యాలయాల్లో విధిగా రిపోర్ట్ చేయాలని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆదేశాలను పాటించనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్ ఫస్టియర్ మూల్యాంకనం ఇప్పటికే మొదలైందని తెలిపారు. మొదటి విడత మూల్యాంకనంలో ప్రైవేటు కాలేజీల సిబ్బందిని తీసుకున్నా.. వారు చాలావరకు విధుల్లోకి రాలేదు. దీంతో, రెండోదశలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల వాళ్లంతా వాల్యుయేషన్‌కు రావాలని ఇంటర్ బోర్డ్ ఆదేశించింది.
పూర్తయ్యే వరకూ...
స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు సెలవులు ఇవ్వాలి. అప్పుడే మూల్యాంకనం త్వరగా పూర్తయి, ఫలితాలు సకాలంలో ఇవ్వొచ్చు. ఇంటర్ బోర్డ్‌లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా మూల్యాంకన ప్రక్రియకు అడ్డంకులు కల్పిస్తున్నారు. ఇది ప్రైవేటు కాలేజీలకు పరోక్షంగా సహకరించడమే.
– మాచర్ల రామకృష్ణగౌడ్, కన్వీనర్,తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి
రెగ్యులర్ అధ్యాపకులకు అవమానం
మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న రెగ్యులర్ అధ్యాపకులను అవమానించేలా ఇంటర్ బోర్లు వ్యవహరిస్తోంది. 60 శాతం కాంట్రాక్టు అధ్యాపకులను స్పాట్ వాల్యూయేషన్‌లో చీఫ్ ఎగ్జామినర్లుగా వేయడం, 40 శాతం రెగ్యులర్ వారిని వేయడం అవమానించడమే. దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో మూల్యాంకన ప్రక్రియకు దూరంగా ఉంటాం.
– తంగిరాల జగదీష్,రాష్ట్ర అధ్యక్షుడు, పీఆర్‌టీయూ