Success Story: హైఫై లైఫ్ కాదనుకుని... ఐఎఫ్‌ఎస్‌కు
సమాజంలో ఉన్న వైషమ్యాలను, సామాజిక అంతరాలను తగ్గించేందుకు తన వంతు కృషి చేయాలనుకున్నాడు. దీనికి సివిల్స్ ఒకటే మార్గమనుకున్నాడు. కార్యసాధనలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) ఎంపికయ్యారు గుంటుపల్లి వరుణ్. ఈ విజయ ప్రస్థానం ఆయన మాటల్లోనే...
కుటుంబ నేపథ్యం ఇదీ...
నాన్న చిన్న వ్యాపారవేత్త, అమ్మ గహిణి. చెల్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. పదో తరగతి వరకు హైదరాబాద్‌లో చదివా. పదో తరగతి పరీక్షల్లో స్కూల్ టాపర్‌గా నిలిచా. తర్వాత ఇంటర్మీడియెట్, మద్రాస్ ఐఐటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ పట్టా తీసుకున్నా. ఐఐఎం–ఇండోర్ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం) పూర్తిచేశా. ముంబైలో ఏడాదిన్నర పాటు డెస్టిమనీ ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేశా. తర్వాత ఎడెల్‌వైస్ సెక్యూరిటీస్ సంస్థలో ఈక్విటీ రీసెర్చ్ అనలిస్టుగా మూడేళ్లు ఉద్యోగం చేశా.
ఇది కాదు కదా మన మార్గం అనుకుని...
మంచి సంస్థల్లో ఉద్యోగం, సంతప్తికరమైన సంపాదన ఉన్నా సివిల్ సర్వీసెస్ ద్వారా సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుందన్న ఉద్దేశంతో అటువైపు అడుగులు వేశా. సివిల్ సర్వీసెస్ వల్ల అణగారిన ప్రజల ఉన్నతికి కృషి చేయొచ్చని, ఉద్యోగంలోనూ మంచి సంతృప్తి లభిస్తుందని భావించి, సివిల్స్ ప్రిపరేషన్‌ను ప్రారంభించా. ఉద్యోగంలో తీరిక లేకపోవడంతో ప్రిపరేషన్ సరిగా సాగలేదు. దీంతో రెండు సార్లు విఫలమయ్యా. ఇక లాభం లేదనుకొని, 2012, సెప్టెంబర్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తిస్థాయిలో సివిల్స్ సన్నద్ధతపై దష్టిపెట్టా.
ఐఎఫ్‌ఎస్‌లో రెండోసారి విజయం
మొదట్లో ఐఎఫ్‌ఎస్‌పై దృష్టి పెట్టలేదు. 2013లో యూపీఎస్సీ పరీక్ష విధానాన్ని మార్చింది. సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలో ఒక ఆప్షనల్‌ను తగ్గించడంతో పాటు సివిల్స్‌కు, ఐఎఫ్‌ఎస్‌కు ఉమ్మడి ప్రిలిమినరీ పరీక్ష వెసులుబాటు నాకు ఎంతగానో ఉపయోగపడింది. ఒకేసారి రెండు పరీక్షలకు ప్రిపేరయ్యే అవకాశం లభించింది. ఐఎఫ్‌ఎస్‌కు చేసిన తొలి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. 29మార్కుల తేడాతో సర్వీస్ చేజారింది. రెండోసారి (2014) మ్యాథమెటిక్స్, ఫారెస్ట్రీ ఆప్షనల్ సబ్జెక్టులతో విజయం సాధించా. మ్యాథ్స్‌పై పట్టుసాధించాలంటే కనీసం ఆర్నెల్లు పడుతుంది. మొదటిసారి సరైన ప్రిపరేషన్ లేకపోవడం వల్ల మ్యాథ్స్‌లో తక్కువ మార్కులు వచ్చాయి. ఈ అనుభవంతో లోపాలను సరిచేసుకొని రెండోసారి అధిక సమయం ప్రాక్టీస్ చేశా. ఫలితంగా మ్యాథ్స్‌లో ఎక్కువ మార్కులు సాధించగలిగా. ఫారెస్ట్రీ పేపర్‌కు ఎక్కువ సమయం కేటాయించకున్నా జనరల్ స్టడీస్‌లో ఎన్విరాన్‌మెంట్ అంశాలను బాగా చదవడం ఆ ఆప్షన్‌ను సంత`ప్తికరంగా రాసేందుకు ఉపయోగపడింది.
సొంతంగానే సివిల్స్‌కు, ఐఎఫ్‌ఎస్‌కు ప్రిపరేషన్...
సొంతంగానే సివిల్స్‌కు, ఐఎఫ్‌ఎస్‌కు సిద్ధమయ్యా. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఉమ్మడి ప్రణాళికతో చదివా. జనరల్ స్టడీస్‌లోని పేపర్ల కోసం ఎన్‌సీఈఆర్‌టీ, ఇతర ప్రామాణిక పుస్తకాలు చదివా. కరెంట్ అఫైర్స్ కోసం పత్రికలు, ఇంటర్నెట్‌ను ఉపయోగించుకున్నా. సివిల్స్ మెయిన్స్ పేపర్ల కోసం రాయడం ప్రాక్టీస్ చేశా. ఇది ఐఎఫ్‌ఎస్ జనరల్ నాలెడ్జ్ పేపర్‌కు ఉపయోగపడింది. ఒకవేళ సర్వీస్ రాకపోతే తిరిగి కార్పొరేట్ ఉద్యోగంలో చేరేందుకు అవకాశం ఉండటంతో ఆందోళనకు గురికాకుండా ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టగలిగా.
ఇంటర్వ్యూలో ఫైనాన్స్‌పై ప్రశ్నలు...
ఆర్థిక సంబంధిత సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండటం వల్ల ఇంటర్వ్యూలో వాటిపై ప్రశ్నలడిగారు. స్టాక్ మార్కెట్, ఫారెస్ట్రీలపై ప్రశ్నలు వచ్చాయి. కరెంట్ అఫైర్స్ నుంచి కూడంకుళం ప్రాజెక్టు, గ్రీన్ పీస్ ఎన్జీవో, పర్యావరణ కాలుష్యంతో పాటు నేను చదివిన మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ ఐఎఫ్‌ఎస్‌కి ఎలా ఉపయోగపడుతుందని భావిస్తున్నావనే ప్రశ్న కూడా అడిగారు. ఇంటర్వ్యూ 25 నిమిషాల పాటు జరిగింది.
ప్రిలిమ్స్, మెయిన్స్‌లకు ఒకేసారి ప్రిపరేషన్
ఐఎఫ్‌ఎస్‌కి సిద్ధమవుతున్న వారు కనీసం ఏడాది సమయం కేటాయించాలి. జనరల్ నాలెడ్జ్, రెండు ఆప్షనల్ సబ్జెక్టులను సమగ్రంగా చదవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌లకు ఒకేసారి ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ పరీక్షలకు వ్యవధి చాలా తక్కువ ఉంటుంది. పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువగా ఉండటంతో సివిల్ సర్వీసెస్ కంటే ఐఎఫ్‌ఎస్ ప్రిలిమ్స్ కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రిలిమ్స్‌లో మంచి మార్కులు సాధించాలి. మెయిన్స్‌కి రెండు నెలల ముందే సిలబస్ పూర్తిచేసి, రివిజన్‌పై దృష్టిసారించాలి. వారాలు, నెలల వారీ లక్ష్యాలను నిర్దేశించుకొని, చదివితే విజయం ఖాయం.