Skip to main content

వ్యవసాయం

వర్షపాతం, నేలల స్వభావం, పంట విస్తీర్ణం మొదలైన అంశాల ఆధారంగా రాష్ట్రాన్ని నాలుగు వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించారు. పాలెంలో ఉన్న దక్షిణ తెలంగాణ ప్రాంతీయ మండలం పరిధిలో అత్యధికంగా 160 మండలాలున్నాయి.
వర్షపాతం
తెలంగాణ రాష్ర్ట సగటు వార్షిక వర్షపాతం సుమారు 906 మిల్లీమీటర్లు. నైరుతి రుతుపవనాల వల్ల రాష్ర్టం 715 మి.మీ. వర్షపాతాన్ని పొందుతోంది. తెలంగాణలో వాన కురిసే విధానం ఒకే రీతిగా ఉండదు. వర్షపు నీటి పంపిణీ సైతం ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా ఉంది. దీంతో రాష్ర్టంలో వ్యవసాయం జూదంగా మారిపోయింది.
2004-05 నుంచి 2013-14 వరకు రాష్ర్ట వర్షపాతాన్ని పరిశీలిస్తే... 2004-05లో అతి తక్కువగా 614 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. 2013-14లో అత్యధికంగా 1212 మి.మీ. వర్షం కురిసింది.
2013-14లో జూన్-సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల వల్ల 852 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల సమయంలో కురిసే సాధారణ వర్షపాతం కంటే ఇది 19 శాతం అధికం. 2013-14లో ఈశాన్య రుతుపవనాల వల్ల అక్టోబర్ - డిసెంబర్ మధ్యకాలంలో నమోదైన వర్షపాతం 243 మి.మీ. ఇది సాధారణం(129 మి.మీ.) కంటే 88 శాతం అధికం.
వ్యవసాయ రంగ సామర్థ్యం
పంటలు సాగు చేసిన స్థూల విస్తీర్ణాన్ని పంటలు సాగు చేసిన నికర విస్తీర్ణంతో భాగిస్తే పంటల సాంద్రత వస్తుంది. ఇది భూ వినియోగ సామర్థ్యాన్ని తెలిపే ముఖ్య సూచిక. 2012-13లో 1.22గా ఉన్న పంటల సాంద్రత 2013 -14లో 1.27కి పెరిగింది. నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ రంగ వినియోగ సామర్థ్యం 1.67గా ఉంది. ఇది రాష్ర్టంలోనే అత్యధికం.
జిల్లాలవారీగా పంటల సాంద్రత(2013-14)

జిల్లా

పంటల సాంద్రత

ఆదిలాబాద్

1.09

ఖమ్మం

1.16

కరీంనగర్

1.53

మహబూబ్‌నగర్

1.11

మెదక్

1.23

నల్గొండ

1.27

నిజామాబాద్

1.67

రంగారెడ్డి

1.14

వరంగల్

1.36

రాష్ట్రం

1.27


నీటి వసతి ఉన్న భూములు
రాష్ర్టంలో సాగునీటి వసతి ఉన్న భూమి 2012-13లో 25.57 లక్షల హెక్టార్లు ఉండగా 2013-14లో అది 23.74 శాతం పెరిగి 31.64 లక్షల హెక్టార్లకు చేరింది. దీనికి అనుగుణంగా నికర సాగు నీరు అందిన భూమి విస్తీర్ణం కూడా 29.03 శాతం పెరిగింది. ఇది 2012-13లో 17.74 లక్షల హెక్టార్లు ఉండగా, 2013-14లో 22.89 లక్షల హెక్టార్లకు చేరింది.
2013-14లో సాగు చేసిన భూమిలో నికరంగా 22.89 లక్షల హెక్టార్ల(46.14 శాతం) భూమికి సాగునీరు అందింది. అది 2014-15 ఖరీఫ్ నాటికి 14.87 లక్షల హెక్టార్లు(35.86 శాతం)గా ఉంది.
రాష్ర్టంలో అత్యధిక శాతం భూమి బావుల కింద సాగవుతోంది. 2009-10లో సాగు చేసిన మొత్తం భూమిలో 84.33 శాతం బావుల కింద సాగు చేసిందే. కానీ 2013-14లో ఇది 74.83 శాతానికి తగ్గింది. 2009-10 నుంచి 2013-14 మధ్యకాలంలో నికరంగా సాగునీరు అందిన భూముల్లో సగటున 76 శాతం భూములకు బావులే ఆధారం. 2012-13లో కాలువల ద్వారా నికరంగా సాగు చేసిన భూమి 5.07 శాతం మాత్రమే ఉండగా 2013-14లో ఇది 12.67 శాతానికి పెరిగింది.
నీటి వసతి సామర్థ్యం
స్థూలంగా సాగునీరు అందే విస్తీర్ణంలో నికర సాగునీరు అందిన విస్తీర్ణాన్నే నీటి వసతి సామర్థ్యంగా లెక్కిస్తారు. 2013-14లో బావుల నీటి వసతి సామర్థ్యం 1.36. బావి నీటి సేద్యం వల్ల స్థూలంగా, నికరంగా సాగు నీరు లభించిన భూ విస్తీర్ణం పెరిగింది.
విస్తీర్ణం, ఉత్పత్తి
గత దశాబ్దంలో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి ఒడుదొడుకులకు లోనయ్యాయి. కరువు, వరదలు, భారీ వర్షాల వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులే దీనికి కారణం. వర్షపాతం తగ్గిన సంవత్సరాల్లోనే నికర పంట భూమి, స్థూలంగా సాగు నీరు అందిన విస్తీర్ణం, ఆహార పంటలను సాగు చేసిన విస్తీర్ణం, ఆహార ధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉన్నాయి. 2004-05లో 24.97 లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాలను సాగు చేయగా, దిగుబడి 41.68 లక్షల టన్నులుగా ఉంది. 2013-14లో 34.56 లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాలను సాగు చేయగా ఉత్పత్తి 107.49 లక్షల టన్నులు. 2014-15 ఖరీఫ్‌లో ఆహార ధాన్యాలను 18.05 లక్షల హెక్టార్లలో సాగు చేయగా, ఉత్పత్తి 44.30 లక్షల టన్నులు.
పంటల ఉత్పాదకత
హెక్టార్ విస్తీర్ణంలో ఎన్ని కిలోల ధాన్యం పండిందనే అంశాన్నే ఉత్పాదకతగా లెక్కిస్తారు. 2009-10 నుంచి 2014-15 ఖరీఫ్ వరకు వరి ఉత్పాదకత దాదాపు నిలకడగా ఉంది. 2013-14 ఖరీఫ్‌లో పంట దిగుబడి హెక్టార్‌కు 3,227 కిలోలు కాగా, 2014-15 ఖరీఫ్‌లో అది 3,054 కిలోలకు పడిపోయింది. మొక్కజొన్న దిగుబడి 2013-14లో హెక్టార్‌కు 4,685 కిలోలు కాగా, 2014-15 ఖరీఫ్‌లో దిగుబడి హెక్టార్‌కు 2,720 కిలోలు. జొన్నపంట ఉత్పత్తిరేటు 2013-14 ఖరీఫ్‌లో హెక్టార్‌కు 1,085 కిలోలు కాగా, 2014-15 ఖరీఫ్‌లో అది హెక్టార్‌కు 1,119 కిలోలకు పెరిగింది. పప్పు ధాన్యాల విషయానికి వస్తే... 2013-14 ఖరీఫ్ సమయంలో పెసలు దిగుబడి హెక్టార్‌కు 662 కిలోలు కాగా, 2014-15 ఖరీఫ్‌లో అది 489 కిలోలు మాత్రమే. కందుల దిగుబడి 2013-14 ఖరీఫ్‌లో హెక్టార్‌కు 529 కిలోలు కాగా, 2014-15 ఖరీఫ్‌లో 441 కిలోలకు తగ్గింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 2014-15 ఖరీఫ్‌లో చాలా పంటల దిగుబడి తగ్గింది.
వేరుశనగ పంట ఉత్పాదకత 2009-10 లో 1682 కిలోలు ఉండగా, 2013-14లో 1691 కిలోలుగా ఉంది. 2014-15 ఖరీఫ్‌లో అది 1700 కిలోలుగా నమోదైంది. 2009-10లో సోయాబీన్ ఉత్పత్తి హెక్టార్‌కు 824 కిలోలుండగా, 2013-14లో 1610 కిలోలు, 2014-15 ఖరీఫ్‌లో 1070 కిలోలుగా నమోదైంది. పామాయిల్ విషయానికి వస్తే.. 2009-10లో దిగుబడి హెక్టార్‌కు 26,150 కిలోలుండగా, 2013 -14లో 12,599 కిలోలకు తగ్గింది. 2014-15 ఖరీఫ్‌లో ఇది 17,731 కిలోలుగా ఉంది.
మిరప పంట ఉత్పాదకత ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఉంది. పసుపు పంట ఉత్పాదకతలో ఆదిలాబాద్ జిల్లా అగ్రస్థానంలో ఉంది. పత్తి ఉత్పాదకత ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో అధిక స్థాయిలో ఉంది.
భవిష్యత్ వైఖరి
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం మూలాధారం. అధిక శాతం ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. తెలంగాణలో 1970ల్లో హరిత విప్లవం మొదలైంది. వ్యవసాయ రంగం 6 శాతం వృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ర్ట వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను మండలానికి ఒకటి చొప్పున నెలకొల్పారు.
రాష్ర్టం మొత్తం భౌగోళిక విస్తీర్ణం 114.84 లక్షల హెక్టార్లు కాగా, 2013-14లో పంటల విస్తీర్ణం స్థూలంగా 62.88 లక్షల హెక్టార్లు. నికరంగా 49.61 లక్షల హెక్టార్లు. స్థూలంగా 31.64 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుండగా, నికరంగా 22.89 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతోంది. రాష్ర్టంలో సగటు కమత పరిమాణం 1.12 హెక్టార్లు. మొత్తం 55.54 లక్షల కమతాలు ఉన్నాయి. వీటి విస్తీర్ణం 61.97 లక్షల హెక్టార్లు.
నేలలు
తెలంగాణలోని నేలల్లో ఎర్రరేగడి నేలలు ప్రధానమైనవి. ఇవి మొత్తం విస్తీర్ణంలో 48 శాతం ఉంటాయి. రాష్ర్టంలోని ఇతర రకాల నేలల్లో.. నల్లరేగడి నేలలు 25 శాతం ఉండగా, ఒండ్రు నేలలు 20 శాతం, రాళ్లు-గుట్టలు 7 శాతం ఉంటాయి. నిజామాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లోని భూముల్లో నత్రజని లోపం (44 శాతం కంటే తక్కువ) ఎక్కువ. ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో భాస్వరం (ఫాస్ఫరస్) లోపం (55 శాతం కంటే తక్కువ) ఎక్కువ.

తెలంగాణలో వ్యవసాయ సామర్థ్యం
  • హెచ్.వై.వి. వరి, సంకర వరి, మొక్కజొన్న, పత్తి, శనగలు తదితర పంటలకు చెందిన 37.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 3.22 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పండించారు.
  • వివిధ రకాల పంటలకు అనువైన నేలలు తెలంగాణలో ఉన్నాయి. ఆహార ధాన్యాలు, నూనె గింజలు, పప్పులు, పండ్ల తోటలు, పచ్చిక, అడవులు తదితరాలకు ఈ నేలలు అనుకూలమైనవి.
  • ఆహార ధాన్యాల ఉత్పత్తి వృద్ధిరేటు జాతీయ స్థాయిలో 2.43 కాగా, తెలంగాణలో అది 3.97 శాతం(సీజీఏఆర్).
2013-14లో జిల్లాలవారీగా పంటల దిగుబడి (కిలోలు/హెక్టార్‌కు)

జిల్లా

వరి

మొక్కజొన్న

శనగలు

పత్తి(లింట్)

మిరప

పసుపు

ఆదిలాబాద్

2745

3771

1371

369

2386

6721

ఖమ్మం

2994

5500

1716

533

4179

5078

కరీంనగర్

3591

5463

1352

492

2710

6303

మహబూబ్‌నగర్

2839

4749

1842

352

3232

5078

మెదక్

3653

3720

1587

416

800

2869

నల్గొండ

3061

1675

1716

393

3196

5078

నిజామాబాద్

4004

5352

2046

338

3941

4178

రంగారెడ్డి

2284

3554

1253

399

3490

3216

వరంగల్

3141

4984

837

472

3249

4521

రాష్ట్రం

3297

4685

1716

423

3544

5078


వ్యవసాయ వాతావరణ మండలాలు

మండలం పేరు

జిల్లాలు

ప్రధాన కార్యాలయం

భౌగోళిక విస్తీర్ణం (చ.కి.మీ.)

మండలాల సంఖ్య

ప్రాంతీయ కార్యాలయాలు

ఉత్తర తెలంగాణ మండలం

కరీంగనర్, నిజామాబాద్,ఆదిలాబాద్

జగిత్యాల

35.5

145

6

కేంద్ర తెలంగాణ మండలం

వరంగల్, ఖమ్మం,మెదక్

వరంగల్

30.6

138

7

దక్షిణ తెలంగాణ మండలం

మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి

పాలెం

39.3

160

6

ఎక్కువ ఎత్తులో ఉన్న గిరిజన ప్రాంతాల మండలం

ఖమ్మం, ఆదిలాబాద్

చింతపల్లి

4.66

13

3


తెలంగాణలోని వ్యవసాయ పరిశోధన సంస్థలు
  • ICAR- CRIDA: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ - సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్
  • ICAR- IIRR (Drr): ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్
  • ICAR- IIOR: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్
  • ICAR- NAARM: నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్
  • MANAGE: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్
  • NIPHM: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్
  • NIRD: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్
  • NFDB: నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్
  • IIMR: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్

భూ కమతాలు

రాష్ర్టంలో భూకమతాలకు సంబంధించిన సమాచారాన్ని 1970-71 నుంచి పంచవర్ష గణన ద్వారా సేకరిస్తున్నారు. ఐదేళ్లకొకసారి భూ కమతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారు.2010-11లో 9వ పంచవర్ష గణన చేశారు. 2010-11 నాటికి కమతాల సంఖ్య 55.54 లక్షలు. కమతాల కింద ఉన్న సేద్య భూమి 61.97 లక్షల హెక్టార్లు. 34.41 లక్షల ఉపాంత కమతాలు ఉన్నాయి. మొత్తం కమతాల్లో ఇది 61.96%. సేద్యం అయ్యే భూమి ఎక్కువగా చిన్న కమతాల్లో ఉంది. చిన్న కమతాల రూపంలో 18.69 లక్షల హెక్టార్లు సాగు చేస్తున్నారు. మొత్తం కమతాల్లో ఇది 30.17%. దీన్ని బట్టి రాష్ర్టంలో ఎక్కువ మంది ప్రజలు తక్కువ విస్తీర్ణం ఉన్న కమతాల్లో వ్యవసాయం చేస్తున్నారని తెలుస్తోంది.

భూమి వినియోగం-తీరుతెన్నులు:
రాష్ర్టంలో 114.84 లక్షల హెక్టార్ల భూమి ఉంది. దీన్ని 9 రకాలుగా వర్గీకరించవచ్చు.

భూమి-రకాలు

భూమి విస్తీర్ణం (లక్షల హెక్టార్లలో)

మొత్తం భూవిస్తీర్ణంలో శాతం

అడవులు

27.43

23.89%

వ్యవసాయ యోగ్యం కాని, బంజరు భూమి

09. 60

08.36%

వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూమి

08.95

07.79%

సాగుకు యోగ్యమైన వృథా భూమి

05.97

05.20%

శాశ్వత పచ్చిక బయళ్లు, ఇతర గడ్డి భూములు

01.78

01.55%

నికర సేద్య భూమిలోకి చేర్చని చెట్లు, తోటల కింద ఉన్న భూమి

01.44

00.99%

ఇతర, వ్యవసాయం చేయని భూములు (ఇతర బీడు భూములు)

07.17

06.24%

ప్రస్తుతం సాగులో లేని భూములు (తాత్కాలిక బీడు భూములు)

06.15

05.36%

నికర సాగు భూమి

49.61

43.20%


రాష్ర్టం నిర్వహణలో ఉన్న కమతాలు
రాష్ర్ట సగటు భూ కమతం 1.11 హెక్టార్లు. రాష్ర్టంలో 62 శాతం కమతాలు ఉపాంత కమతాలు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 60 శాతానికి పైగా ఉపాంత/సన్న కమతాలు ఉన్నాయి.

వర్గం

కమతాల సంఖ్య

కమతాల కిందసేద్య భూమి

లక్షల్లో

శాతంలో

లక్షల హెక్టార్లలో

శాతంలో

సన్నకారు/ఉపాంత రైతు

34.41

61.96

15.67

25.28

చిన్నకారు రైతు

13.27

23.90

18.69

30.17

దిగువ మధ్యతరగతి రైతు

6.03

10.86

15.85

25.58

మధ్యతరగతి రైతు

1.67

3.0

9.27

14.96

పెద్ద రైతు

0.16

0.28

2.49

4.01

మొత్తం

55.54

100

61.97

100


కమతాల వర్గీకరణ / రైతుల వర్గీకరణ
సాగుచేసే భూమిని ‘కమతం’ అంటారు. కమతం పరిమాణం ఆధారంగా కమతాలు/ రైతులను అయిదు రకాలుగా వర్గీకరించవచ్చు.
ఒక హెక్టార్ కంటే తక్కువ భూమి ఉన్న కమతాలను ఉపాంత కమతాలు అంటారు. ఈ కమతాలను సాగు చేసే రైతులను సన్నకారు/ఉపాంత రైతులు అంటారు. రాష్ర్టంలోని మొత్తం కమతాల్లో ఉపాంత కమతాలు 62 శాతం ఉన్నాయి. 1 నుంచి 2 హెక్టార్ల మధ్య భూమి ఉన్న కమతాలను చిన్న కమతాలు అంటారు. ఇవి 23.9 శాతంతో రెండో స్థానంలో ఉన్నాయి. ఈ కమతాలను సాగు చేసే రైతులను చిన్నకారు రైతులంటారు. మొత్తం కమతాల్లో ఉపాంత, చిన్న కమతాలు కలిసి 85.9 శాతం ఉన్నాయి. రాష్ర్టంలో ఉపాంత కమతాల శాతం నానాటికీ పెరుగుతుండగా, చిన్న కమతాల సంఖ్య స్థిరంగా ఉంది. దిగువ మధ్య, మధ్య, పెద్ద కమతాల శాతం తగ్గుతోంది. 2010-11 నాటికి తెలంగాణ రాష్ర్టంలో దిగువ మధ్య తరగతి కమతాలు 10.9 శాతం, మధ్య తరగతి కమతాలు 3.0 శాతం, పెద్ద కమతాలు 0.3 శాతం ఉన్నాయి.

విస్తీర్ణం
ఉపాంత, చిన్న కమతాల కింద సాగయ్యే భూ విస్తీర్ణం పెరుగుతోంది. తెలంగాణలో ఎక్కువ సేద్య విస్తీర్ణం ఉన్న భూమి వివరాలు..
1. చిన్న కమతాలు - 30.2 శాతం
2. దిగువ మధ్య కమతాలు - 25.5 శాతం
3. ఉపాంత కమతాలు - 25.3 శాతం
2005-06లో రాష్ర్టంలో 1.30 హెక్టార్లు ఉన్న సగటు కమత పరిమాణం 2010-11 నాటికి 1.11 హెక్టార్లకి పడిపోయింది. కమతాల సంఖ్య 2005- 06లో 48.28 లక్షలు ఉండగా, 2010-11లో 55.54 లక్షలకు చేరింది.
రాష్ర్టంలో సగటు కమత పరిమాణం ఎక్కువగా ఉన్న జిల్లాలు
ఆదిలాబాద్ - 1.4 హెక్టార్లు
మహబూబ్‌నగర్ - 1.23 హెక్టార్లు
రంగారెడ్డి - 1.22 హెక్టార్లు
రాష్ర్టంలో సగటు కమత పరిమాణం తక్కువగా ఉన్న జిల్లాలు
నిజామాబాద్ - 0.92 హెక్టార్లు
కరీంనగర్ - 0.96 హెక్టార్లు.
అత్యధిక కమతాలు ఉన్న జిల్లాలు..
మహబూబ్‌నగర్ (9.82 లక్షలు)
నల్గొండ (7.57 లక్షలు)
అతి తక్కువ కమతాలు ఉన్న జిల్లాలు..
రంగారెడ్డి (3.42 లక్షలు)
ఖమ్మం (4.68 లక్షలు)

ఎస్సీ కమతాలు
మహబూబ్‌నగర్ (1.29 లక్షలు), మెదక్ (1.08 లక్షలు) జిల్లాల్లో ఎస్సీ కమతాలు ఎక్కువగా ఉన్నాయి. ఖమ్మం (0.45 లక్షలు), రంగారెడ్డి (0.53 లక్షలు) జిల్లాల్లో ఎస్సీ కమతాలు తక్కువగా ఉన్నాయి.

ఎస్టీ కమతాలు
ఖమ్మం (1.56 లక్షలు), ఆదిలాబాద్ (1.11 లక్షలు) జిల్లాల్లో అత్యధిక ఎస్టీ కమతాలు ఉన్నాయి. కరీంనగర్ (0.19 లక్షలు), రంగారెడ్డి (0.29 లక్షలు) జిల్లాల్లో అతి తక్కువ ఎస్టీ కమతాలు ఉన్నాయి.

సామాజిక వర్గాల వారీగా కమతాల సంఖ్య, విస్తీర్ణం

సామాజిక వర్గం

కమతాల సంఖ్య (లక్షల్లో)

కమతాల కింద ఉన్న భూమి విస్తీర్ణం (లక్షలహెక్టార్లలో)

ఎస్సీ

7.44

5.88

ఎస్టీ

6.72

7.71

ఇతరులు

41.37

48.28

మొత్తం

55.54

61.97


సూక్ష్మసేద్యం ఆవశ్యకత
తెలంగాణలో భూగర్భ జలాలతో సేద్యం అవుతున్న నికర భూమి 14.85 లక్షల హెక్టార్లుగా ఉంది. ఇందులో నేటికీ 4.7 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి మాత్రమే సూక్ష్మనీటి సరఫరా విధానం అమల్లో ఉంది. ఇంకా 10 లక్షల హెక్టార్లలో సూక్ష్మనీటి సాగును అమలు చేయడానికి అవకాశం ఉంది.
రాష్ట్రంలో సూక్ష్మసేద్యం కోసం ప్రత్యేకంగా దృష్టి సారించిన జిల్లాలు
  1. మహబూబ్‌నగర్
  2. రంగారెడ్డి
  3. మెదక్
  4. నిజామాబాద్
  5. ఆదిలాబాద్
  6. కరీంనగర్
  7. వరంగల్
  8. ఖమ్మం
  9. నల్లగొండ
రాష్ట్ర ప్రణాళిక (100 శాతం) ద్వారా తోట నీటి కార్యక్రమం (ఓఎఫ్‌డబ్ల్యూఎం -ఎన్‌ఎంఎస్‌ఏ)/సూక్ష్మ సేద్య పథకాల అమలు సూక్ష్మ సేద్యం ద్వారా ప్రతి నీటి బొట్టును సమర్థంగా వినియోగించుకునే వెసులుబాటు ఉంది. ఇది పంటల ఉత్పాదకత, ఉత్పత్తిని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. తద్వారా రాష్ట్రానికి చెందిన సన్న, చిన్నకారు రైతుల జీవన ప్రమాణాల్లో నికరమైన మెరుగుదల సాధించడానికి వీలవుతుంది.
లక్ష్యాలు
  1. ఉత్పాదకతలో పెరుగుదల, మెరుగైన నాణ్యత సాధించడం.
  2. నీరు, ఎరువులను సమర్థంగా వినియోగించుకోవడం.
  3. విద్యుత్ శక్తి, శ్రమ శక్తి సమర్థ వినియోగం.
  4. తక్కువ నీటితో అధిక ఉత్పత్తి.
సూక్ష్మ సేద్యంలోని విభాగాలు
  1. తగినంత ఎడంతో వేసిన పంటలకు బిందు సేద్యం (ఉపరితలం పైనుంచి)
  2. దట్టంగా వేసిన పంటలకు బిందు సేద్యం (భూమి లోపలి నుంచి)
  3. చిట్టి, సూక్ష్మ తుంపర సాధనాలు.
  4. వెంట తీసుకెళ్లడానికి వీలైన, కొంత కాలం పాటు మన్నిక వచ్చే వాననీటి తుంపర సాధనాలు.
2013-14 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రధాన పంటల దిగుబడి (కిలోలు/హెక్టార్లలో)
పంట రాష్ట్ర సగటు ఉత్పాదకత అధిక ఉత్పాదకత ఉన్న జిల్లాలు
వరి 3297 నిజామాబాద్ (4004), మెదక్ (3653)
మొక్కజొన్న 4685 ఖమ్మం (5500), కరీంనగర్ (5463)
పత్తి 423 ఖమ్మం (533), కరీంనగర్ (492)
మిరప 3544 నిజామాబాద్ (3941), రంగారెడ్డి (3490)
పసుపు 5078 ఆదిలాబాద్ (6721), కరీంనగర్ (6303)
శనగలు 1716 నిజామాబాద్ (2046), మహబూబ్‌నగర్ (1842)

పాలీ హౌస్ (2014-15)
అధిక విలువ ఉన్న ఉద్యానవన పంటలను అభివృద్ధి చేయడానికి, పూల సాగు, కూరగాయ తోటల్లో నిరంతర ఉత్పత్తి, సరఫరాకు రాష్ట్రంలో 2014-15లో వేయి ఎకరాల విస్తీర్ణంలో పాలీహౌస్‌లను ప్రోత్సహించాలని నిర్ణయించారు.
అధిక విలువ కలిగిన ఉద్యానవన పంటల సేద్యంలో కీటకాల నుంచి రక్షణకు, తగినంత నీడ ఇవ్వడానికి వలలు కడతారు. వీటిని పాలీ ఎథిలీన్ కప్పిన జి.ఐ. పైపులతో నిర్మిస్తారు. వీటిని కాపాడటానికి పాలీహౌస్‌లను నిర్మిస్తారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి పంటలను కాపాడటానికి, సహజంగా పెరిగే రుతువులతో నిమిత్తం లేకుండా ఆయా పంటలను పండించడానికి ఈ నిర్మాణాలు అవసరం అవుతున్నాయి.
లక్ష్యాలు
  1. ప్రామాణిక విస్తీర్ణం, ఉత్పాదకతను పెంచడం.
  2. అధిక విలువ ఉన్న ఉద్యానవన పంటలనుపాలీహౌస్‌ల కింద అభివృద్ధి చేయడం.
  3. తెగుళ్లబారిన పడని, జన్యురీత్యా అత్యున్నతమైన అంట్లను నిరంతరంగా ఉత్పత్తి చేయడం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కల్పించవచ్చు.
ఎస్‌హెచ్‌ఎం పథకం ప్రారంభించిన నాటి నుంచి పురోగతి (2007-13)
  • రాష్ట్ర ఉద్యానవన మిషన్ (ఎస్‌హెచ్‌ఎం) పథకం కింద 130 ఎకరాల్లో పాలీహౌస్‌లను నిర్మించడానికి తెలంగాణలోని 9 జిల్లాల్లో (హైదరాబాద్ మినహా) కలిపి 346 మంది రైతులకు రూ. 24.42 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు.
  • పాలీహౌస్‌ల కింద పూల సాగుకు సంబంధించిన అవసరాల కోసం రూ. 9.91 కోట్లు, కూరగాయల సాగు అవసరాల కోసం రూ. 22.86 లక్షలు ఆర్థిక సహాయంగా ఇచ్చారు.
  • రక్షిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి లబ్ధిదారులకు మొత్తం రూ. 34.33 కోట్ల ఆర్థిక సహాయాన్ని సమకూర్చారు.

మన ఊరు - మన కూరగాయలు కార్యక్రమం
హైదరాబాద్ నగరానికి కూరగాయలు సరఫరా చేసే ప్రధాన పొరుగు జిల్లాలు.. మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి. వీటికి కూరగాయల విపణి అనుసంధానాన్ని కల్పించడానికి, కూరగాయల విలువ శ్రేణిని పటిష్టం చేయడానికి ‘వెజిటబుల్ ఇనిషియేటివ్‌‌స ఫర్ అర్బన్ క్లస్టర్‌‌స’ (వీఐయూసీ) పథకాన్ని ప్రారంభించారు. ‘మన ఊరు - మన కూరగాయలు’ పథకాన్ని మెదక్ జిల్లాలో ప్రారంభించారు.

వ్యవసాయ అనుబంధ రంగాలు
పశుసంపద: రాష్ట్రంలో దాదాపు 29 లక్షల కుటుంబాలు పశుసంపదపై ఆధారపడి జీవిస్తున్నాయి. పశుసంపదలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 10వ స్థానంలో ఉంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో పశుసంపద రూ. 17,824 కోట్ల (స్థిర ధరల్లో) ఆదాయాన్ని సమకూర్చింది. ప్రాథమిక రంగంలో ఇది 27.34 శాతం వాటాను కలిగి ఉంది.
మత్స్య పరిశ్రమ: తెలంగాణలో అతివేగంగా విస్తరిస్తున్న రంగాల్లో మత్స్య పరిశ్రమ కూడా ఒకటి. రాష్ట్రంలో చేపల పెంపకం అంతగా అభివృద్ధి చెందనప్పటికీ రిజర్వాయర్లు, చెరువుల్లో చేపలు పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో 70 రిజర్వాయర్ల కింద విస్తరించి ఉన్న జలావరణాల్లో 3,290 చెరువుల్లో చేపల పెంపకం చేపట్టారు.
  • తెలంగాణలో రిజర్వాయర్ల కింద విస్తరించి ఉన్న జలావరణంలో చేపల ఉత్పాదకత 30 కిలోలు/హెక్టారుగా ఉండగా, చెరువుల సగటు ఉత్పాదకత 300-400 కిలోలు/ హెక్టారుగా ఉంది.
  • రాష్ట్రంలో దాదాపు 19.04 లక్షల మంది చేపలు పట్టేవారు ఉన్నారు. వీరిలో 65 శాతం మంది వరంగల్, మహబూబ్‌నగర్ నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో ఉన్నారు.
  • చేపల పెంపకం ఖమ్మం జిల్లాలో అత్యధికంగా కేంద్రీకృతమై ఉంది. రొయ్యల పెంపకం కొద్ది మోతాదులో మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉంది.
  • 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో చేపలు, రొయ్యల ఉత్పత్తి లక్ష్యం 2.92 లక్షల టన్నులు కాగా, డిసెంబర్ 2014 నాటికి 1.69 లక్షల టన్నులు ఉత్పత్తి చేశారు.
  • 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం చేపలు, రొయ్యల ఉత్పత్తి లక్ష్యం 3.21 లక్షల టన్నులు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంవత్సరాల్లో చేపలు, రొయ్యల ఉత్పత్తి (లక్షల టన్నుల్లో)
సం. చేపలు రొయ్యలు మొత్తం ఉత్పత్తి
2007-08 1.170 0.028 1.193
2008-09 1.490 0.022 1.515
2009-10 1.340 0.020 1.360
2010-11 1.335 0.022 1.357
2011-12 1.967 0.038 2.005
2012-13 2.146 0.050 2.196
2013-14 2.430 0.066 2.496
పట్టు పరిశ్రమ: తెలంగాణలో గద్వాల్, నారాయణ్ పేట్, కొత్తకోట, పోచంపల్లి లాంటి పట్టు వస్త్రాల తయారీ కేంద్రాలు ఉన్నాయి. అందువల్ల రాష్ట్రంలో ముడిపట్టు ఉత్పత్తి కూడా చెప్పుకోదగిన స్థాయిలోనే ఉంది. తెలంగాణలో 2012-13, 2013-14 సంవత్సరాలకు సంబంధించి ముడిపట్టు ఉత్పత్తి, ఉత్పాదకతలు కింది విధంగా ఉన్నాయి.
పట్టు ఉత్పత్తి (లక్షల టన్నుల్లో) ఉత్పాదకత (100 డీఎఫ్‌ఎల్‌లకు) (కిలోల్లో)
సం. సి.బి. రకం బి.వి.హెచ్. రకం
201213 263.09 111.51 60.10
201314 264.07 199.50 64.00
గమనిక: డీఎఫ్‌ఎల్ = డిసీస్ ఫ్రీ లేయింగ్.

టసార్ సిల్క్ సాగు: తెలంగాణలో 8,200 ఎకరాల అటవీ విస్తీర్ణంలో టసార్ పట్టు పురుగులు తినే టి. అర్జున, టి. టొమెంటోసా చెట్లు ఉన్నాయి. ఇవి టసార్ పట్టు పురుగుల సాగుకు మంచి అవకాశం కల్పిస్తున్నాయి.
  • ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలోని గిరిజనులకు టసార్ పట్టు పురుగుల పెంపకం ప్రధాన జీవనాధారంగా ఉంది.

వ్యవసాయ పరపతి

గ్రామీణ రంగాన్ని పీడిస్తున్న ఒక ప్రధాన సమస్య రుణగ్రస్థత. ఇది దశాబ్దాలుగా రైతులను వేధిస్తోంది. వ్యవసాయ అవసరాలకే కాకుండా గృహ సంబంధ అవసరాల కోసం కూడా గ్రామీణ ప్రజలు అప్పు చేస్తున్నారు. ఆదాయం చాలక, అప్పులు తీరక వడ్డీల భారం పెరిగి కుంగిపోతున్న గ్రామీణుల సంఖ్య ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. గడిచిన రెండు దశాబ్దాల్లో ఈ సమస్య వల్ల వందల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

గ్రామీణ రుణగ్రస్థతకు కారణాలు
  1. పేదరికం
  2. వారసత్వంగా వచ్చిన అప్పులు
  3. సాంఘిక, మతపరమైన కట్టుబాట్లు, ఆచారాల (పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు లాంటివి) కోసం చేసే వ్యయం.
  4. వ్యాజ్యాలు
  5. వ్యవసాయ రంగంలో వెనుకబాటుతనం.
  6. భూమి కౌలు పరిమాణం అధికంగా ఉండటం.
  7. వడ్డీ వ్యాపారులపై అధికంగా ఆధారపడటం/ సంస్థాగత పరపతి సౌకర్యాల కొరత.
  8. అనారోగ్యం, దురలవాట్లు.
రుణగ్రస్థత కారణాలను మూడు విధాలుగా వర్గీకరించవచ్చు.
  1. ఉత్పాదక అవసరాలు (వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తి, కార్యకలాపాలు).
  2. కుటుంబ అవసరాలు.
  3. ఇతర కారణాలు
కాల ప్రాతిపదికపై వ్యవసాయ పరపతిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..
  1. స్వల్పకాలిక పరపతి: విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, పశుగ్రాసం, కూలీలకు వేతనాలు మొదలైన అవసరాల కోసం పొందే పరపతి. దీన్ని 12-15 నెలల వ్యవధిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
  2. మధ్యకాలిక పరపతి: భూమిని మెరుగుపరచడం, బావుల తవ్వకం, పశువులు, వ్యవసాయ పనిముట్ల కొనుగోళ్లు మొదలైన అవసరాల కోసం సమకూర్చుకునే పరపతి. దీన్ని 15 నెలల నుంచి 5 ఏళ్ల కాల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుంది.
  3. దీర్ఘకాలిక పరపతి: శాశ్వతంగా భూమిని అభివృద్ధి చేయడం కోసం, అదనపు భూమి, ట్రాక్టర్లు, మోటారు ఇంజన్లు తదితరాల కొనుగోలుకు ఎక్కువ మొత్తంలో పరపతి అవసరం అవుతుంది. దీన్ని తక్కువ కాలంలో చెల్లించడానికి సాధ్యపడదు. ఈ రకం పరపతిని 15-20 ఏళ్ల కాలంలో తీర్చాల్సి ఉంటుంది.
వేరుశనగ, సోయాబీన్, పామాయిల్ పంటల ఉత్పాదకత (కిలోలు/హెక్టార్లలో)
పంట 2009-10 2010-11 2011-12 2012-13 2013-14 2014-15 (ఖరీఫ్)
వేరుశనగ 1682 1793 1529 1789 1691 1700
సోయాబీన్ 824 1704 1616 1818 1610 1070
పామాయిల్ 26150 15471 15610 18824 12599 17731


మాదిరి ప్రశ్నలు
Published date : 25 Sep 2015 05:35PM

Photo Stories