Skip to main content

ప్రాచీన భారతదేశ చరిత్ర

అహింసా సిద్ధాంతం బౌద్ధ మతం నుంచి ఆవిర్భవించిందే. తర్వాతి కాలంలో దీన్ని గాంధీ మహాత్ముడు అనుసరించారు. బుద్ధ విగ్రహాలు గాంధార శిల్ప కళారీతిలో ఉంటాయి. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా మానవ విగ్రహాల పూజ బౌద్ధ మతంలోనే ప్రారంభమైంది. స్థానిక భాషలకు ఈ మతం బాగా ప్రోత్సాహాన్ని అందించింది.
వేదకాల నాగరికత (క్రీ.పూ. 2000-1500)
ఆర్యులు ఆసియా మైనర్, మెసపటోమియా మీదుగా పర్షియాలోకి ప్రవేశించారు. ఆ తర్వాత బాక్ట్రియా, హిందూకుష్ పర్వత శ్రేణుల మీదుగా భారతదేశంలోకి వచ్చారు. పంజాబ్ ప్రాంతంలోని సప్తసింధు లోయను మొదటి స్థావరంగా చేసుకుని స్థిరపడ్డారు.

తొలివేద కాలం (క్రీ.పూ. 1500-1)
ఈ కాలంలో ఆర్యులు సప్తసింధు ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యారు. ఈ కాలం గురించి తెలుసుకోవడానికి రుగ్వేదం ఒక్కటే ప్రధాన ఆధారంగా ఉంది.
ఆర్యులు భారతదేశంలో స్థిరపడ్డ తర్వాత రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలు రాశారు. వేదాలన్నింటిలో రుగ్వేదం ప్రాచీనమైంది. ఇందులో పది మండలాలున్నాయి. యజుర్వేదం క్రతువుల నిర్వహణకు ఆధార గ్రంథం. సామవేదం సంగీతానికి మూలం. అధర్వణ వేదం మంత్రతంత్రాలకు సంబంధించింది.
ఈ కాలంలో రాజ్యానికి రాజే అధిపతి. రాజరికం వంశపారంపర్యం. ప్రజల రక్షణ బాధ్యత రాజు చూసేవాడు. దీనికిగాను ప్రజలు రాజుకు గోవులను కానుకగా ఇచ్చేవారు. ఈ విధానాన్ని ‘బలి’ అని పిలిచేవారు. పాలనా వ్యవహారాల్లో ‘సమితి’, ‘సభ’ అనే సంస్థలు రాజుకు సాయపడేవి. సమాజంలో స్త్రీకి గౌరవప్రదమైన స్థానం ఉండేది. ‘సమితి’, ‘సభ’ సమావేశాల్లో మహిళలు సైతం పాల్గొనేవారు. వితంతు పునర్వివాహాలు జరిగేవి. సతీసహగమనం, పరదా పద్ధతి వీరికి తెలియదు. రుగ్వేదకాలంనాటి ఆర్యులకు పశుపోషణ, వ్యవసాయం ప్రధాన వృత్తులు. పశువులను.. ముఖ్యంగా ఆవులను ప్రాణప్రదంగా భావించేవారు. వీటిని వర్తకంలో మారకంగా ఉపయోగించేవారు. ఆర్యులు ప్రకృతి శక్తులను పూజించారు. ద్యుస్ (ఆకాశం), ఇంద్ర, వరుణ, వాయు, అగ్ని, సోమ తదితర పురుష దైవాలతో పాటు అతిథి, ఉషస్సు లాంటి స్త్రీ మూర్తులను కూడా ఆరాధించేవారు. ఇంద్రుడు వీరి ప్రధాన దైవం.

వేదాలు:
1) రుగ్వేదం
2) యజుర్వేదం
3) సామవేదం
4) అధర్వణ వేదం

ఉపవేదాలు:
1) ధనుర్వేదం
2) ఆయుర్వేదం
3) శిల్పవేదం
4) గాంధార వేదం

వేదాంగాలు:
1) శిక్ష
2) కల్పం
3) జ్యోతిషం
4) వ్యాకరణం
5) నిరుక్తం
6) చంధస్సు

దర్శనాలు - అందులో ప్రసిద్ధులు:
1) సంఖ్య - కపిలుడు
2) వైశేషికం - కణాదుడు
3) న్యాయం - గౌతముడు
4) యోగ - పతంజలి
5) మీమాంస - జెమిని
6) ఉత్తర మీమాంస - బాదరాయణుడు

మలివేదకాల ఆర్య నాగరికత (క్రీ.పూ.1000-600)
ఈ కాలంలో ఆర్యులు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తర బిహార్ ప్రాంతాలకు విస్తరించారు. వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా స్వీకరించిన జాతులన్నీ స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. క్రమంగా ఆధిపత్యం కోసం తెగల మధ్య యుద్ధాలు ప్రారంభమయ్యాయి. విజయం సాధించిన తెగ నాయకుడు విశాల భూభాగానికి అధినేతగా మారాడు. అతడు సామ్రాట్ తదితర బిరుదులను వహించడం ఆరంభమైంది. అశ్వమేథ, రాజసూయ, బలి కర్మకాండలు ప్రారంభమయ్యాయి. సామ్రాజ్యాల విస్తరణ పెరిగింది. రాజు దైవాంశ సంభూతుడుగా మారాడు.

రుగ్వేదంలోని పురుష సూక్తం ఆధారంగా మలివేద కాలంలో వర్ణవ్యవస్థ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలుగా సమాజ విభజన జరిగింది. క్రమంగా వృత్తులు వంశపారంపర్యమయ్యాయి. ఈ యుగంలో స్త్రీ అంతకుముందున్న సామాజిక స్థాయిని కోల్పోయింది. సతీ సహగమన పద్ధతి మొదలైంది. వివాహ నిబంధనలు కఠినమయ్యాయి.
కొత్తగా భూములు సాగులోకి రావడంతో వ్యవసాయాభివృద్ధి అధికమైంది. వర్తకం, వాణిజ్యం, పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో పట్టణాలు ఏర్పడ్డాయి. తక్షశిల, హస్తినాపురం, కౌశాంబి, కాంపల్య, వైశాలి, శ్రావస్థి, వారణాసి మొదలైనవి నాటి ప్రసిద్ధ నగరాలు. వస్తుమార్పిడి స్థానంలో ‘నిష్క’, ‘శతమాన’, ‘కర్షాపణం’ అనే నాణేలు ప్రవేశించాయి. బంగారం, వెండి, రాగితో ఈ నాణేలను తయారు చేసేవారు. సృష్టికర్తగా ‘ప్రజాపతి’ ఈ యుగ ప్రధాన ఆరాధ్య దైవం. అగ్ని, ఇంద్రుడు లాంటి దైవాలకు ప్రాధాన్యం తగ్గి త్రిమూర్తుల (విష్ణు, బ్రహ్మ, శివుడు) ఆరాధన పెరిగింది.

రుగ్వేద సంహిత: ఇందులో 1028 శ్లోకాలున్నాయి. ఇది పురాతనమైంది. అగ్ని, ఇంద్రుడు, వరుణుడు లాంటి అనేక దేవతల స్తోత్ర పాఠాలు ఈ సంహితంలో ఉన్నాయి. ఇందులో ఇంద్రుడి గురించి ఎక్కువ శ్లోకాలు ఉన్నాయి.
సామవేద సంహిత: సోమ యజ్ఞాలు చేసేప్పుడు సంగీత బద్ధంగా శ్లోకాలను ఎలా ఆలపించాలో సామవేద సంహిత తెలుపుతుంది. భారతీయ సంగీత మూలాలు సామవేదంలో కనిపిస్తాయి.
యజుర్వేద సంహిత: ఇందులో యజ్ఞ సమయంలో అనుసరించాల్సిన నియమ నిబంధనలు, పఠించే మంత్రాల గురించి ఉన్నాయి.
అధర్వణ వేద సంహిత: రోగాలు, దుష్టశక్తులను పారదోలడానికి అవసరమైన మంత్రాలు, తంత్రాలు ఇందులో ఉన్నాయి. ఆర్యేతరుల విశ్వాసాల గురించి ఇది కొంతవరకు తెలుపుతుంది.
బ్రాహ్మణాలు: ఇవి వేదాల తర్వాత వచ్చాయి. కర్మకాండల విధానాన్ని వివరిస్తాయి. వీటిలో ప్రధానంగా యజ్ఞాలు, బలులకు సంబంధించిన విధివిధానాలు ఉన్నాయి.
అరణ్యకాలు: ఇవి తాత్విక చింతనకు చెందిన అంశాలతో కూడి ఉన్నాయి.
ఉపనిషత్తులు: ఉపనిషత్తులు తాత్విక గ్రంథాలు. వీటిలో ఆత్మ, అంతరాత్మ, ప్రకృతి రహస్యాల గురించి ఉన్నాయి. ఉపనిషత్తులు కర్మకాండలను నిరసించాయి. ఇవి సరైన జ్ఞానం, సన్మార్గానికి ప్రాముఖ్యం ఇస్తాయి.

సామాజిక మార్పులు (క్రీ.పూ. 600-300)
ఈ కాలంలో అనేక మత ఉద్యమాలు ఆవిర్భవించాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ మార్పులు అధికంగా జరిగాయి. 16 జనపదాలు, పట్టణాలు ఏర్పడ్డాయి. దీన్ని రెండో పట్టణీకరణ కాలంగా పేర్కొంటారు. ఇనుముతో రూపొందించిన పరికరాల వాడకం వల్ల వ్యవసాయంలో అధిక వృద్ధి సాధ్యమైంది.
ఈ కాలంలో చాతుర్ వర్ణ వ్యవస్థ బలపడింది. ద్విజులుగా పేర్కొనే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు.. ద్విజులు కాని శూద్రులకు మధ్య సాంఘిక వ్యత్యాసం ఎక్కువైంది. బ్రాహ్మణాధిపత్యం వైశ్యులకు, క్షత్రియులకు నచ్చలేదు. అస్పృశ్యులను ఒక ప్రత్యేక వర్గంగా చూడటం ఈ కాలంలోనే ప్రారంభమైంది. వ్యవసాయ రంగంలోని మిగులుతో రాజులు సైన్యాన్ని నిర్మించారు. రాజులు పన్ను వసూలు చేసేవారు. న్యాయ వ్యవస్థకు పునాది పడింది. జీవహింసకు వ్యతిరేకమైన బౌద్ధ, జైన మతాలు వ్యవసాయ రంగ అభివృద్ధికి తోడ్పడ్డాయి.

బౌద్ధమతం (క్రీ.పూ. 563-483)
బౌద్ధమత స్థాపకుడు సిద్ధార్థుడు (గౌతముడు). ఈయన క్షత్రియ వంశానికి చెందినవారు. క్రీ.పూ. 563లో శాక్యరాజ్యాధిపతి శుద్ధోదనుడు, మాయాదేవికి రాజధాని ‘కపిలవస్తు’ సమీపంలోని ‘లుంబినీ వనం’లో జన్మించారు. గౌతముని భార్య పేరు ‘యశోధర’, కుమారుని పేరు ‘రాహులుడు’. కపిలవస్తు నగరంలో కనిపించిన వృద్ధుడు, వ్యాధిగ్రస్థుడు, శవం, సన్యాసి దృశ్యాలు ఆయన్ని కదల్చివేశాయి. దీంతో భవబంధాల నుంచి బయటపడ్డారు. దీన్నే ‘మహాభినిష్ర్కమణం’ అంటారు. గయ సమీపంలో బోధి వృక్షం కింద నలభై రోజుల తపస్సు తర్వాత ‘సంభోది’ని పొంది ‘బుద్ధుడై’ పరిపూర్ణ జ్ఞానంతో ఉద్దీప్తుడయ్యాడు. మొదటగా సారనాథ్‌లోని ‘మృగదావనం’లో అయిదుగురు శిష్యులకు జ్ఞానబోధ చేశాడు. ఈ ప్రబోధాన్ని ‘ధర్మచక్ర ప్రవర్తనం’ అంటారు. బుద్ధుడు తన 80వ ఏట క్రీ.పూ.483లో మహాపరి నిర్యాణం పొందారు. బుద్ధుడి శిష్యుడు ఆనందుడు.

బుద్ధుడికి సంబంధించిన అంశాలు:
తండ్రి శుద్ధోదనుడు
తల్లి మాయాదేవి
సవతి తల్లి గౌత మి
బంధువు దేవదత్త
భార్య యశోధర
కుమారుడు రాహుల్
రథ చోదకుడు చె న్నుడు
గుర్రం కంధక
గురువు అలారకలామ
బుద్ధగయలో పరిచర్యలు చేసినది సుజాత

ఆర్య సత్యాలు
 1) ప్రపంచం దుఃఖమయం.
 2) దుఃఖాలకు కోర్కెలే కారణం.
 3) కోర్కెలను నిరోధిస్తే దుఃఖం అంతమవుతుంది.
 4) దుఃఖాన్ని అంతమొందించడానికి మార్గం ఉంది.
 అజ్ఞానమే దుఃఖానికి కారణమని పేర్కొని, దీన్ని తొలగించడానికి ‘అష్టాంగమార్గం’ రూపొందించాడు. అవి.. సరైన వాక్కు, క్రియ, జీవనం, శ్రమ, ఆలోచన, ధ్యానం, నిశ్చయం, దృష్టి. పునర్జన్మ రహితమైన మోక్షమే నిర్యాణం అని చెప్పారు. బౌద్ధమతం హేతుబద్ధమైంది. బుద్ధుడు ఆత్మ, భగవంతుడి ఉనికిని గుర్తించలేదు. వైదిక కర్మకాండలను, వేదాలను నిరసించారు.
 మొదటి ‘బౌద్ధ సంగీతి’ రాజగృహంలో అజాత శత్రువు పాలనా కాలంలో జరిగింది. దీని అధ్యక్షుడు మహాకాశ్యప. ఈ సంగీతిలో ‘వినయ’, ‘సుత్త’ అనే పీఠికల (నియమావళి గ్రంథాలు)ను సంకలనం చేశారు. రెండో సంగీతి ‘వైశాలి’లో జరిగింది. ఈ సంగీతిలో బౌద్ధసంఘం ‘థెరవాదులు’, ‘మహాసాంఘికులు’ అనే రెండు వర్గాలుగా చీలిపోయింది. మూడో సంగీతి అశోకుడి కాలంలో పాటలీపుత్రంలో జరిగింది. ఈ సంగీతిలో అభిదమ్మ పీటకాన్ని రచించారు. నాలుగో సంగీతి కనిష్కుడి పాలనా కాలంలో వసుమిత్రుడి అధ్యక్షతన జరిగింది. సాంచి, బార్హూత్, అమరావతి ఈ కాలంనాటి శిల్పకళకు ప్రతీకలైన స్తూపాలు. చైత్య గృహాల నిర్మాణానికి అజంతా, ఎల్లోరా ఉదాహరణలు. బుద్ధుని సందేశాన్ని భిక్షకులు విదేశీయులకు అందించారు. బౌద్ధ మతం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. చైనా, జపాన్, శ్రీలంక, బర్మా మొదలైన తూర్పు, ఆగ్నేయాసియా దేశాల్లో బౌద్ధ మతం విస్తరించింది. కాశ్మీర్‌లో జరిగిన నాలుగో బౌద్ధ సంగీతిలో బౌద్ధమతం మహాయాన, హీనాయాన శాఖలుగా చీలిపోయింది.

 మహాయానం: ఈ శాఖకు చెందినవారు బుద్ధ విగ్రహాలను ఆరాధించేవారు. బుద్ధుడు, బోధిసత్వుల ద్వారా మానవులు మోక్షం పొందొచ్చని  భావించారు. ఈ శాఖ ఇండియా, చైనా, జపాన్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. నాగార్జునుడు మాధ్యమిక చింతనను ప్రవేశపెట్టాడు. ప్రపంచమంతా మిథ్య, భ్రమ అని నాగార్జునుడి వాదన.
 హీనాయానం: బర్మా, థాయిలాండ్, కాంబోడియాలో ఈ శాఖ బాగా వ్యాపించింది. బుద్ధుడి ప్రవచనాలను మాత్రమే తీసుకుని ధ్యానం ద్వారా మోక్షం పొందొచ్చని వీరు భావించారు. విగ్రహారాధనకు వీరు వ్యతిరేకం. పాళీ భాషలో సుత్త, వినయ, అభిదమ్మగా పేర్కొనే త్రిపీఠకాలను వీరు రచించారు. క్రీ.శ 8వ శతాబ్దంలో వజ్రాయానం అనే కొత్త శాఖ వెలిసింది.
 స్తూపాలు: బుద్ధుడు లేదా ఇతర ప్రముఖ సన్యాసుల అవశేషాలను నిక్షిప్తం చేసి నిర్మించారు. వీటినే స్తూపాలు అంటారు.
 చైత్యం: ఇందులో ప్రధానంగా ప్రార్థనాలయం ఉంటుంది.

 ప్రధాన బౌద్ధ గుహాలయాలు, చైత్యాలయాలు:
 1) కార్లే 
 2) నాసిక్
 3) భాజ
 4) బార్హుత్
 5) సాంచి
 6) అమరావతి
 7) నాగార్జున కొండ
 8) భట్టిప్రోలు
 విహారం: బౌద్ధ సన్యాసులు నివసించే ప్రాంతమైన అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ ఆసియాలో అతిపెద్ద బౌద్ధ విహార కేంద్రం.

 మహా జనపదాలు - పట్టణాలు
 1
) మగధ- పాటలీపుత్రం
 2) కాశీ-వారణాసి
 3) అంగ - చంపా
 4) చేది - భుక్తిమతి
 5) కోసల-అయోధ్య
 6) కురు-ఇంద్రప్రస్థం
 7) వత్స-కౌశాంబి
 8) పాంచాల-అవిచ్ఛత్రము
 9) మత్స్య-విరాటనగరం
 10) అస్మక-పూతన్
 11) సూరసేన -మధుర
 12) అవంతి-ఉజ్జయిని
 13) కాంభోజ-రాజపురం
 14) గాంధార-తక్షశిల
 15) వజ్జి-విదేహ
 16) మల్ల-కుశి
Published date : 14 Sep 2015 04:03PM

Photo Stories