Skip to main content

ద్వీపకల్ప భారతదేశం - నైసర్గిక స్వరూపం

ద్వీపకల్ప ప్రాంతం.. భారతదేశ నైసర్గిక విభాగాల్లో అతి పెద్దది. పశ్చిమాన సహ్యాద్రి కొండలు, తూర్పున తూర్పు కనుమలు, ఉత్తరాన గంగా మైదానం, సరిహద్దులుగా ఉన్న ద్వీకల్ప ప్రాంతం.. దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. ఇది వివిధ పీఠభూములు, కొండలు, నదీలోయలతో కూడి ఉంది. ద్వీపకల్ప భారతదేశ ఉత్తర భాగాన్ని మధ్యమెట్టభూములుగా, దక్షిణ భాగాన్ని దక్కన్ పీఠభూమిగా వ్యవహరిస్తారు. మధ్య మెట్టభూముల ప్రాంతం.. మాళ్వా, బుందేల్‌ఖండ్, బాగేల్‌ఖండ్, ఛోటా నాగ్‌పూర్, మైకాల పీఠభూములు, వింధ్య, సాత్పూరా, అజంతా, బాలాఘాట్, చందేరి, క్రైమూరు, ఆరావళి మొదలైన కొండలతో కూడి ఉంది!!
దక్కన్ పీఠభూమి
మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో దక్కన్ పీఠభూమి విస్తరించి ఉంది. దక్కన్ పీఠభూమిలో బసాల్ట్ రకానికి చెందిన లావాతో ఉన్న ప్రాంతాన్ని దక్కన్ నాపలు అంటారు. పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, పశ్చిమ తెలంగాణాల్లో దక్కన్ నాపలు విస్తరించి ఉన్నాయి. బసాల్టిక్ లావా ఘనీభవించి ఏర్పడ్డ అగ్నిపర్వత శిలలు శిథిలమవడంతో దక్కన్ నాపల ప్రాంతంలో నల్లరేగడి నేలలు ఏర్పడ్డాయి.
 
ఆరావళి పర్వత శ్రేణులు
ఇవి ద్వీపకల్ప పీఠభూమికి వాయవ్య సరిహద్దులో నైరుతి-ఈశాన్య దిశలో విస్తరించాయి. ఈ శ్రేణులు గుజరాత్‌లోని పాలంపూర్ నుంచి ఢిల్లీ వరకు వ్యాపించి ఉన్నాయి. ఆరావళి పర్వతాలు పురాతన ముడుత పర్వతాల కోవకు చెందుతాయి. ఇవి ప్రీ కాంబ్రియన్ భౌమ్యయుగంలో ఏర్పడ్డాయి. ఆ కాలంలో ఇవి ప్రస్తుత హిమాలయూల కంటే విశిష్టంగా ఉండేవని నిపుణుల అంచనా. తర్వాత ఇవి శిథిలమై.. ప్రస్తుతం అవశిష్ట పర్వతాలకు ఉదాహరణగా మిగిలాయి. వింధ్య-సాత్పూరా పర్వతశ్రేణుల మధ్య ఉన్న విదరణ లోయ (Rift valley) ద్వారా నర్మదా నది ప్రవహిస్తోంది. వింధ్య-సాత్పూరా పర్వతశ్రేణులు భ్రంశ/ఖండ పర్వతాలకు మంచి ఉదాహరణలు. వింధ్య పర్వతశ్రేణులను ఆనుకొని ఉన్న మాళ్వా పీఠభూమి గిరిపద పీఠభూములకు మంచి ఉదాహరణ. మైకాల పీఠభూమిలోని అమర్ ఖంఠక్ శిఖర ప్రాంతం నుంచి నర్మదా నది ప్రవహిస్తోంది. పశ్చిమ తీరంలోని పశ్చిమ కనుమలు (సహ్యాద్రి కొండలు) మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళల్లో విస్తరించి ఉన్నాయి. కేరళలోని పాల్‌ఘాట్ కనుమను మినహాయిస్తే ఇవి దాదాపు అవిచ్ఛిన్నంగా విస్తరించి ఉన్నాయి.
 
పశ్చిమ కనుమలు
కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అన్నామలై, పళని, ఏలకుల కొండల రూపంలో పశ్చిమ కనుమలు వ్యాపించి ఉన్నాయి. పాల్‌ఘాట్ కనుమ వద్ద నీలగిరి కొండలు, పశ్చిమ-తూర్పు కనుమలను అనుసంధానిస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఇవి శంఖు ఆకార శిఖరాలను పోలి ఉంటాయి. ఇవి పశ్చిమాన అరేబియూ సముద్రం వైపు నిట్రవాలుగా ఉంటాయి. దక్కన్ పీఠభూమి వైపు మెట్లలా తిన్నని వాలులను కలిగి ఉంటాయి. వీటిని ‘ట్రిపియన్ నైసర్గిక స్వరూపం’గా అభివర్ణిస్తారు.
 
తూర్పు కనుమలు
మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో ఉన్న సన్నని థాల్‌ఘాట్, భోర్‌ఘాట్ కనుమల ద్వారా ముంబై-పుణే, ముంబై-ఇండోర్ రైలు, రహదారి మార్గాలు నిర్మించారు. పశ్చిమ కనుమలతో పోలిస్తే తూర్పు కనుమల సగటు ఎత్తు తక్కువ. తూర్పు కనుమలు కూర్చొని ఉన్న ఏనుగుల ఆకారంలో కనిపిస్తాయి. విస్తారమైన వికోషీకరణం వల్ల వీటి శిఖర భాగాలు బోర్లించిన మూకుళ్ల మాదిరిగా ఉంటాయి. తూర్పు కనుమలు మహానది-కృష్ణానది డెల్టాల మధ్య మాత్రమే అవిచ్ఛిన్న పర్వత శ్రేణిగా వ్యాపించాయి. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా-గోదావరి డెల్టా ప్రాంతంలో సుమారు 150 కిలోమీటర్ల మేర దాదాపు అదృశ్యమవుతాయి. కృష్ణానది డెల్టాకు దక్షిణంగా నల్లమలై, ఎర్రమలై, వెలికొండ పర్వతాలుగా తూర్పు కనుమలు విస్తరించాయి.
నీలగిరి కొండలకు దక్షిణంగా దక్షిణ తమిళనాడులోని షెవరాయి, జాప్‌వో కొండలను తూర్పు కనుమల విస్తరణలుగా పరిగణిస్తారు. మేఘాలయలోని షిల్లాంగ్ పీఠభూమి ఒకప్పుడు ద్వీపకల్ప భారతదేశంలో భాగంగా ఉండేది. గారో- రాజ్‌మహల్ కొండల మధ్య భూఅవనతం జరగడంతో ఈ భాగం ద్వీపకల్ప భారత ప్రాంతం నుంచి విడిపోయి ఈశాన్య భారతదేశం వైపు వెళ్లింది. అందువల్ల షిల్లాంగ్ పీఠభూమిని ద్వీపకల్ప భారతదేశ అవుట్‌పోస్ట్ అంటారు. ద్వీపకల్ప భారతదేశ పీఠభూములుప్రపంచంలోనే అతి ప్రాచీనమైన శిలలు కలిగి ఉన్నాయి. ఆర్కియన్ (ప్రీ కాంబ్రియన్) భౌమ్య యుగానికి చెందిన శిలలు వీటి పునాదులు. వీటి వయసు దాదాపు 2500  మిలియన్ ఏళ్లకు పైనే. ద్వీపకల్ప పీఠభూముల శిలలు అతి కఠినమైన రూపాంతర, అగ్నిశిలల తరగతికి చెందినవి. ద్వీపకల్ప పీఠభూమి పటలం ఏ రకమైన భౌమ్య చలనాలకు గురికాకుండా సుస్థిరంగా ఉండటంతో ఇక్కడ భూకంప ప్రక్రియ జరగడం అరుదు.
Published date : 16 Dec 2015 03:20PM

Photo Stories