Skip to main content

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల రంగం

గత ఐదు దశాబ్దాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (Micro, Small and Medium Enterprises-MSME)రంగం భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత ఆశాజనక, చలనాత్మక రంగంగా ఆవిర్భవించింది. పెద్ద తరహా పరిశ్రమలతో పోలిస్తే ఈ రంగం తక్కువ మూలధన వ్యయంతో అధిక ఉపాధి అవకాశాలను కల్పిస్తూ గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామికీకరణకు దోహదపడుతోంది. జాతీయాదాయం, సంపద పంపిణీలో సమానత్వ సాధనకు కృషి చేస్తూ ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి తోడ్పడుతోంది.
పెద్ద పరిశ్రమలకు అనుబంధ యూనిట్లుగా ఉంటూ భారత ఆర్థిక వ్యవస్థ సాంఘిక-ఆర్థికాభివృద్ధికి MSME రంగం సాయపడుతోంది. ప్రస్తుతం దేశ, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత ఆర్థిక వాతావరణం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పురోగమనం దిశగా పయనిస్తోంది. కొన్నేళ్లుగా భారత్‌లో MSME రంగం వృద్ధి 10 శాతంగా ఉంది.

MSME -పెట్టుబడి పరిమితి

యూనిట్లు

తయారీ రంగ పరిశ్రమలు (ప్లాంట్, యంత్రాలపై పెట్టుబడి పరిమితి)

సేవా రంగంలోని సంస్థలు (పరికరాలపై పరిమితి)

సూక్ష్మ

రూ.25 లక్షలు

రూ.10 లక్షలు

చిన్న

రూ.5 కోట్లు

రూ.2 కోట్లు

మధ్య తరహా

రూ.10 కోట్లు

రూ.5 కోట్లు


ప్రగతి
MSME రంగం వ్యవసాయ రంగానికి వెలుపల స్వయం ఉపాధి, వేతన ఉపాధి కల్పనకు అనేక అవకాశాలను కల్పిస్తూ సమ్మిళిత, సుస్థిర సమాజ నిర్మాణానికి దోహదపడుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి MSME రంగంలో 36 మిలియన్ల యూనిట్లు ఉండగా, వాటి ద్వారా మొత్తం 80 మిలియన్ల మందికి ఉపాధి లభిస్తోంది. దీంతోపాటు ఆరు వేల ఉత్పత్తుల తయారీతో MSME రంగం.. జీడీపీలో 8 శాతం వాటాను సొంతం చేసుకుంది. మొత్తం దేశ తయారీ రంగ ఉత్పత్తిలో MSME రంగ వాటా 45 శాతం కాగా, దేశ ఎగుమతుల్లో 40 శాతం వాటాను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధిని పెంపొందించేందుకు MSME రంగం తగిన సామర్థ్యాన్ని కలిగి ఉంది. సమ్మిళిత వృద్ధి సాధనలో ఈ రంగానిది కీలక పాత్ర. 2022 చివరి నాటికి జాతీయ తయారీ రంగం వాటా జీడీపీలో 25 శాతానికి చేరుకోనుందనే అంచనా వెనక ముఖ్య భూమిక MSME రంగానిదే.

పథకాలు - చేయూత
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ చేపట్టిన అనేక పథకాలు, కార్యక్రమాలతోపాటు ఆయా యూనిట్ల అభివృద్ధికి అందించిన ప్రోత్సాహకాలు వివరాలు...
1. విత్త సంస్థలు లేదా బ్యాంకుల నుంచి తగినంత పరపతి ప్రవాహం ఉండేలా చూడటం.
2. సాంకేతిక పరిజ్ఞానం పెంపు, ఆధునికీకరణకు మద్దతు.
3. అవస్థాపనా సౌకర్యాల కల్పన.
4. ఆధునిక టెస్టింగ్ సౌకర్యాలు, నాణ్యత సర్టిఫికేషన్.
5. ఆధునిక యాజమాన్య పద్ధతులు అందుబాటులో ఉంచడం.
6. సరైన శిక్షణ ద్వారా వ్యవస్థాపకత అభివృద్ధి, నైపుణ్యతను పొంపొందించడం.
7. వస్తు అభివృద్ధికి మద్దతు, డిజైన్, ప్యాకేజింగ్.
8. స్వదేశీ, ఎగుమతి మార్కెట్ల అందుబాటుకు తగిన సహాయం.
9. సామర్థ్యం పెంపు, ఆయా యూనిట్ల సాధికారతకు క్లస్టర్ వారీగా చర్యలు.

మేక్ ఇన్ ఇండియా-MSME
దేశ వ్యాప్తంగా వ్యవస్థాపకతను పెంపొందించే ప్రక్రియలో MSME రంగాన్ని‘గ్రోత్ ఇంజన్’గా గుర్తించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యూనిట్లు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా ఉత్పత్తి నాణ్యతను మెరుగుపర్చుకోవచ్చు. MSME రంగం మూలధన పెట్టుబడిని ఆకర్షించే విధంగా తీర్చిదిద్దడానికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా మంత్రి త్వ శాఖ తగిన చర్యలు చేపట్టింది. మరోవైపు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా ఈ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో పోటీ తత్వాన్ని పెంచుకునే అవకాశం కలిగింది. ప్రభుత్వం MSME రంగానికి సంబంధించిన జాతీయ విధానాన్ని ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రకటించే అవకాశం ఉంది. 2013-14లో Coir Exports ద్వారా రూ.1400 కోట్లు లభిస్తే, 2015-16లో రూ.1900 కోట్లకు పెరిగింది. బ్యాంకులు శాఖల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి ఖాయిలాపడిన MSME యూనిట్ల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటాయని ఇటీవల MSME శాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రా ప్రకటించారు. రికవరీ కాని బ్యాంకు రుణాల్లో MSME వాటా 45 శాతం. 2016-17లో 55,200 ఎంటర్‌ప్రైజెస్ ఏర్పాటు ద్వారా 4,41,600 మంది యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలు తమకవసరమైన ఉత్పత్తుల సేకరణలో.. 20 శాతం మేర MSME నుంచే కొనుగోలు చేయాలనే నిబంధనకు అనుగుణంగా 2015-16లో 42 ప్రభుత్వ రంగ సంస్థలు రూ.18,141.07 కోట్ల విలువైన ఉత్పత్తులను MSME నుంచి సేకరించాయి.

2014-16 కాలంలో తీసుకున్న చర్యలు
  • ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం కింది 1,12,883 ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.2,333 కోట్లను మార్జిన్ మనీగా ఉపయోగించి 8,71,000 మందికి ఉపాధి కల్పించారు.
  • పరపతి ఆధారిత మూలధన సబ్సిడీ పథకం కింద 10,388 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు సబ్సిడీగా రూ.653 కోట్లు విడుదల చేశారు.
  • MSME పథకానికి సంబంధించి క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ కింద 2015-16లో 4,48,588 ప్రతిపాదనలకు రూ.17,795.92 కోట్ల క్రెడిట్ గ్యారంటీ ఇచ్చారు.
  • నవకల్పనలను ప్రోత్సహించడం, గ్రామీణ పరిశ్రమలు, వ్యవస్థాపకత పెంపు పథకం (ఏఎస్‌పీఐఆర్‌ఈ) కింద సిడ్బీ (Small Industries Development Bank of India) ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏర్పాటు చేసి రూ.60 కోట్లు విడుదల చేశారు.
  • ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్‌కు మార్కెటింగ్ అభివృద్ధి సహాయ పథకం కింద రూ.300 కోట్లు మంజూరు చేశారు. తద్వారా 2015-16లో ఖాదీ ఉత్పత్తి విలువ రూ.1100 కోట్లకు చేరుకోవడంతోపాటు 15 లక్షల మందికి పైగా ఉపాధి లభించింది.
  • 2015-16లో గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి విలువ రూ.35,000 కోట్ల కంటే ఎక్కువగా ఉండి, ఈ విభాగంలో 150 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచానా.
  • ఏటా Coir Boardకు రూ.35 కోట్ల ఆర్థిక సహాయం లభిస్తోంది. ఏటా Coir ఉత్పత్తి 5 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ విభాగంలో 7 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది.
  • క్రెడిట్ రేటింగ్ పథకం కింద 2014-16లో 36,396 యూనిట్లకు ఆయా సంస్థల ప్రగతి ఆధారంగా రేటింగ్ ఇచ్చారు.
  • 2014-15, 2015-16ల్లో జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్ ప్రతి ఏటా 9 లక్షల మెట్రిక్ టన్నుల ముడి సరుకులను సరఫరా చేయడం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు తగిన మద్దతునిచ్చింది.
  • సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల జాతీయ సంస్థ (National Institute for Micro, Small and medium Enterprises - NIMSME) 2590 వ్యవస్థాపకత, నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా 76,415 మంది యువకులకు శిక్షణ నిచ్చింది. ఈ కాలంలో 86 జాబ్‌మేళాలు నిర్వహించారు. మొత్తంగా 21,436 మందికి వేతన ఉపాధి, 10,562 మందికి స్వయం ఉపాధికి ఆర్థిక సాయం లభించింది.
  • జిల్లా పరిశ్రమల కేంద్రాల అధికారులకు NIMSME induction కార్యక్రమాలను రూపొందించి అమలు చేసింది. కేరళ, బిహార్, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
MSME రంగం- 2016-17 కేంద్ర బడ్జెట్
  • 2015-16లో కేంద్ర బడ్జెట్‌లో MSME మంత్రిత్వ శాఖకు రూ.2,612.51 కోట్లను మంజూరు చేయగా ఈ మొత్తం 2016-17లో రూ.3000 కోట్లకు (14.83 శాతం పెరుగుదల) చేరుకుంది.
  • ఉపాధి కోసం ఎదురుచూడకుండా వారే ఉపాధి అందించే విధంగా SC, ST వర్గాలను తీర్చిదిద్దే క్రమంలో వారిలో వ్యవస్థాపకత పెంపునకు ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. SC, ST మహిళల కోసం Standup India పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీని కోసం రూ.500 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు.
  • శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద 300 rurban క్లస్టర్లను అభివృద్ధి చేస్తారు. రైతులకు మార్కెట్ అందుబాటు, అవస్థాపన సౌకర్యాలను అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాలు వృద్ధి కేంద్రాలుగా రూపుదిద్దుకోవడానికి క్లస్టర్లు ఉపయోగపడతాయి.
  • 2016 ఏప్రిల్ నుంచి 2019 మార్చి మధ్య ఏర్పాటయ్యే స్టార్టప్‌ల లాభాల్లో 5 సంవత్సరాల కాలానికి సంబంధించి 3 సంవత్సరాలపాటు పన్ను నుంచి మినహాయిస్తారు.
  • పారిశ్రామిక అసోసియేషన్ల భాగస్వామ్యంతో జాతీయ షెడ్యూల్డ్ కూలాలు, తెగల హబ్‌ను ఏర్పాటు చేస్తారు.
  • రానున్న మూడేళ్ల కాలంలో ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద కోటి మంది యువతలో నైపుణ్యాలు పెంపొందిస్తారు.
  • 1500 బహుళ నైపుణ్య శిక్షణ సంస్థలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తారు. దీనికోసం 2016-17లో రూ.1,700 కోట్లను కేటాయించారు.
  • ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులను 2200 కళాశాలలు, 300 పాఠశాలలు, 500 ప్రభుత్వ, 50 వృత్తి శిక్షణ కేంద్రాల్లో నిర్వహించడం ద్వారా వ్యవస్థాపక విద్య, శిక్షణను అందిస్తారు.
  • 2016-17 బడ్జెట్‌లో ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద పరపతి లక్ష్యాన్ని రూ.1,80,000 కోట్లుగా ప్రతిపాదించారు.
  • ఎంప్లాయీస్ పెన్షన్ పథకం కింద నూతనంగా ఉపాధి పొందిన వారు చెల్లించాల్సిన 8.33 వాటాను ప్రభుత్వం ఇస్తుంది.
MSME రంగ సమస్యలు
  • భారతదేశంలో MSME రంగం అధిక సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ ఈ రంగంలోని అధిక యూనిట్లు కింది సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అవి..
  • అసమర్థ యాజమాన్యం.
  • ముడి సరకుల సప్లయ్‌లో అవరోధాలు.
  • యంత్రాలు, పరికరాలు తగినంతగా అందుబాటులో లేకపోవడం.
  • పరపతి సౌకర్యాలు తగినంతగా లేకపోవడం.
  • సంఘటిత మార్కెటింగ్ సౌకర్యాల లేమి.
  • పెద్దతరహా యూనిట్లు, దిగుమతి వస్తువుల నుంచి పోటీ.
  • డిజైన్లు సంప్రదాయకంగా, పాత పద్ధతిలో ఉండటం.
  • 47 నుంచి 58 శాతం వరకు అవస్థాపిత సామర్థ్యాన్ని ఆయా యూనిట్లు పూర్తిగా ఉపయోగించుకోకపోవడం.
  • యూనిట్లు ఏర్పాటు చేసిన ప్రాంతాలు ఉత్పత్తికి అనుకూలంగా లేకపోవడం.
  • ఈక్విటీ మూలధనానికి అందుబాటు పరిమితంగా ఉండటం.
  • తయారీ రంగం, సేవలు, మార్కెంటింగ్‌లో నైపుణ్యం గల శ్రామిక శక్తి కొరత.
  • బహుళ శ్రామిక చట్టాలు, కష్టతర విధానాలు.
  • అంతర్జాతీయ మార్కెట్ అందుబాటులో లేకపోవడం
  • ఖాయిలా పడుతున్న యూనిట్లు అధికంగా ఉండటం.
MSME రంగ అభివృద్ధికి చర్యలు
స్వల్ప కాలిక చర్యలు
  • ప్రస్తుతం వ్యాపార పరంగా ఎదురవుతున్న సవాళ్లను, అవకాశాలను దృష్టిలో ఉంచుకుని MSME యూనిట్ల నిర్వచనంలో మార్పులు తీసుకురావడం
  • కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని అమలు చేయడం.
  • చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడం.
  • సంస్థాగత పరపతి అందుబాటును మెరుగుపరచడం.
  • ఆయా యూనిట్లకు సలహా సేవలను అందించడం.
మధ్య కాలిక చర్యలు
  • తయారీ రంగంలో MSME యూనిట్ల వృద్ధిని పెంపొందించడంపై ఏర్పాటయిన ‘ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ’ సిఫార్సులను అమలు చేయడం.
  • MSME క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాన్ని మెరుగుపర్చడం
  • MSME రంగంలో ఎగుమతులను పెంపొందించడానికి ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ సిఫార్సులను అమలు చేయడం.
దీర్ఘకాలిక చర్యలు
  • MSME రంగానికి సంబంధించి శ్రామిక చట్టాలను సరళతరం చేయడం.
  • MSME రంగ అభివృద్ధికి అవస్థాపన సౌకర్యాలను పెంపొందించడం. దీర్ఘకాలంలో‘ఎగ్జిట్ విధానాన్ని’ రూపొందించడం
  • వెంచర్ కాపిటల్ ఫండ్‌ను MSME రంగానికి అందుబాటులోకి తేవడం.
Published date : 02 Aug 2016 12:12PM

Photo Stories