Skip to main content

కార్మిక చట్టాలు

పారిశ్రామిక విప్లవానంతరం పెట్టుబడిదారులు అధిక లాభాలను గడించేందుకు కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లించి, ఎక్కువ గంటలు పని చేయించుకునేవారు. దీంతోపాటు పనిచేసే ప్రదేశాల్లో కనీస సౌకర్యాలను సైతం కల్పించకుండా శ్రమ దోపిడీకి పాల్పడ్డారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేక కార్మిక ఉద్యమాలు ఎగిసిపడ్డాయి. వీటి ఫలితంగా ప్రపంచ దేశాలన్నీ వివిధ కార్మిక చట్టాలను ప్రవేశపెట్టాయి.
  • కార్మిక చట్టాలు.. కార్మికుల చట్టబద్ధహక్కులను సంరక్షిస్తూ, న్యాయబద్ధంగా వారికి అందాల్సిన ప్రయోజనాలనుఅందేలా చేస్తాయి.
  • పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సంఘాల గుర్తింపు, కార్మిక-యాజమాన్య సంబంధాలకు ఈ చట్టాలు దోహదపడతాయి.
  • పనిచేసే ప్రదేశంలో ఆరోగ్యకరమైన పరిస్థితులను కల్పించడం, ఉద్యోగ భద్రత, ఉద్యోగితా ప్రమాణాలను పెంపొందించడం, సాధారణ సెలవులు, ఆకస్మిక సెలవులు, పనిగంటలు, కనీస వేతనాలు, అక్రమ తొలగింపులు, వేతనాల కోత వంటి అంశాల్లో కార్మిక చట్టాలు అవసరమవుతాయి.
1919లో ఏర్పాటైన అంతర్జాతీయ కార్మిక సంఘం (ILO) 187 దేశాలకు చెందినపభుత్వాధికారులు, పరిశ్రమల యాజమాన్యాలు, కార్మిక సంఘాల ప్రతినిధులతో త్రైపాక్షిక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో కార్మికుల స్థితిగతులను మెరుగుపరచడం, కార్మికులు-యాజమాన్యాల మధ్య సంబంధాలను నెలకొల్పడంపై చర్చించారు.

బ్రిటిష్ పరిపాలన కాలంలో ఇంగ్లండ్ పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూర్చేలా 1883లో ఫ్యాక్టరీ యాక్ట్‌ను ప్రవేశపెట్టారు. తర్వాత 1929లో ట్రేడ్ డిస్ప్యూట్స్ యాక్ట్‌ను తీసుకొచ్చారు. అయితే ఆ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో 1947, ఏప్రిల్ 1న ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్‌ను తీసుకొచ్చారు.

స్వాతంత్య్రానంతరం దేశంలో ప్రణాళికాబద్ధ ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయ సాధనతోపాటు పారిశ్రామిక శాంతిని నెలకొల్పడం, కార్మిక సంక్షేమాలను కూడా ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకున్నారు. ఆ లక్ష్యాలకు అనుగుణంగానే కార్మిక విధానాలను రూపొందిస్తున్నారు.

కార్మిక విధానాలు కింది లక్ష్యాలను కలిగి ఉంటాయి.
  • ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు కొత్త ఉద్యోగావకాశాల కల్పనకు దోహదం చేసేలా కార్మిక విధానాలను రూపొందించడం.
  • కార్మికులకు సాంఘిక భద్రత కార్డులను అందించడం. అసంఘటిత రంగంలోని కార్మికులకు సాంఘిక భద్రత పథకాలను ప్రవేశపెట్టడం.
  • కార్మికులు-యాజమాన్యాలకు మధ్య చక్కని సంబంధాలను ఏర్పరచడం. .
  • పారిశ్రామిక సంబంధాల కమిటీలను ఏర్పాటు చేయడం.
  • కాలానుగుణంగా కార్మిక చట్టాలు, పారిశ్రామిక విధానాల్లో సంస్కరణలను ప్రవేశపెట్టడం.
  • లేబర్ డిపార్‌‌టమెంట్ సమర్థమంతంగా పనిచేయడం.
  • ఎక్కువ మంది కార్మికులను కనీస వేతనాల పరిధిలోకి తీసుకురావడం.
  • బాల కార్మికుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం.
  • కార్మికులకు ఆధునిక వైద్య సదుపాయాలను కల్పించడం.
  • స్థానభ్రంశానికి గురైన కార్మికులకు పునరావాస సౌకర్యాలను కల్పించడం.
  • పారిశ్రామిక శిక్షణతోపాటు ఆయా కోర్సులకు సంబంధించిన అంశాల్లో కాలానుగుణంగా మార్పులు తీసుకురావడం.
  • కార్మిక శాఖ, పారిశ్రామిక విభాగాలు, కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా సంయుక్త సెల్‌ను ఏర్పాటు చేయడం.
  • మన దేశంలో అధిక శాతం (92%) కార్మికులు అసంఘటిత రంగంలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. వారంతా ఎలాంటి సాంఘిక భద్రత లేకుండా ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.
  • కార్మికుల మార్కెట్‌ను నియమబద్ధం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్మిక చట్టాలను రూపొందించింది.
  • కనీస వేతనాలు, పరిహారం, వివాదాలు, సామాజిక భద్రత, కర్మాగారాల్లో పనిచేసే పరిస్థితులు తదితర అంశాలపై ప్రభుత్వాలు కార్మిక చట్టాలను తీసు కొచ్చాయి.
  • రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోనూ కార్మిక విధానాలకు సంబంధించిన అంశాలను పొందుపర్చారు.
  • ప్రాథమిక హక్కుల్లో 16, 19(1)సి, 23, 24 ఆర్టికల్స్ కార్మికులకు సంబంధించినవే.
  • ఆర్టికల్ 16 ప్రకారం ఉద్యోగిత, నియామకాల్లో సమాన అవకాశాలు కల్పించాలి.
  • 19(1)సి ప్రకారం అసోసియేషన్, యూనియన్‌లను ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది.
  • ఆర్టికల్ 23 ప్రకారం కార్మికులను బలవంతంగా రవాణా చేయడం నిషిద్ధం.
  • ఆర్టికల్ 24 ప్రకారం బాలలను పనిలో పెట్టుకోవడం నేరం.
ఆదేశిక సూత్రాల్లోని 41, 42, 43, 43ఎ ఆర్టికల్స్ కార్మికులకు సంబంధించిన అంశాలను పేర్కొంటున్నాయి. అవి..

ఆర్టికల్ 41 ప్రకారం ‘పనిచేసే హక్కు’
  • ఆర్టికల్ 42 ప్రకారం మానవీయమైన పనిచేసే పరిస్థితులు, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలను కల్పించడం.
  • ఆర్టికల్ 43 ప్రకారం పని భద్రత, జీవించడానికి తగిన వేతనం, సరైన జీవన ప్రమాణాలను కల్పించడం.
  • ఆర్టికల్ 43(ఎ) ప్రకారం పారిశ్రామిక యాజమాన్యంలో శ్రామికులు భాగస్వాములు కావడం.
రాజ్యాంగంలో ‘కార్మికులకు’ సంబంధించిన అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చారు. అందువల్ల కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రెండూ కార్మిక చట్టాలను చేసి, వాటిని అమలు చేయొచ్చు. ఆయా ప్రభుత్వాలు చేసిన చట్టాలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..

కేంద్రం చేసిన చట్టాలు: వీటిని అమలు చేసే బాధ్యత కేంద్రానిదే.
కేంద్రం చేసిన చట్టాలు: ఈ కేటగిరీకి చెందిన చట్టాలను కేంద్రం చేసినప్పటికీ వాటిని అమలుచేసే బాధ్యత రెండు (కేంద్ర, రాష్ట్ర) ప్రభుత్వాలపై ఉంటుంది.
కేంద్రం చేసిన చట్టాలు: ఈ కేటగిరీకి చెందిన చట్టాలను అమలుచేసే బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుంది.
రాష్ట్రాలు చేసే చట్టాలు: వీటి అమలు బాధ్యత ఆయా రాష్ట్రాలదే. ఈ చట్టాలుకేవలం సంబంధిత రాష్ట్రాలకే పరిమితం.

అమలు బాధ్యత కేంద్రానికే ఉన్న చట్టాలు
  • ది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948
  • ది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్‌లేనియస్ ప్రొవిజన్‌‌స యాక్ట్ 1952
  • ది డాక్ వర్కర్స్‌ (సేఫ్టీ, హెల్త్ అండ్ వెల్‌ఫేర్) యాక్ట్ 1986
  • ది మైన్‌‌స యాక్ట్, 1952
  • ది ఐరన్ ఓర్ మైన్స్, మాంగనీస్ ఓర్ అండ్ క్రోమ్ ఓర్ మైన్స్ లేబర్ వెల్ఫేర్ యాక్ట్ 1976.
  • ది మైకా మైన్స్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1946
  • ది బీడీ వర్కర్స్‌ వెల్ఫేర్ సెస్ యాక్ట్ 1976
  • ది లైమ్‌స్టోన్ అండ్ డొలోమైట్ మైన్‌‌స లేబర్ వెల్‌ఫేర్ ఫండ్ యాక్ట్ 1972
  • ది సినీ వర్కర్స్‌ వెల్ఫేర్‌సెస్ యాక్ట్ 1981
  • ది బీడీ వర్కర్స్‌ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1981
  • ది సినీ వర్కర్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1981
అమలు బాధ్యత కేంద్రం, రాష్ట్రాలపై ఉన్న చట్టాలు
  • ది చైల్డ్ లేబర్ (ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 1986
  • ది బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్‌ యాక్ట్ 1996
  • ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976.
  • ది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947
  • ది లేబర్ లాస్ యాక్ట్ 1988
  • ది మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961
  • ది పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965
  • ది పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972
  • ది పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936
  • ది అప్రెంటీసెస్ యాక్ట్ 1961
  • అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్‌ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ 2008
  • వర్కింగ్ జర్నలిస్ట్ (ఫిక్సేషన్ ఆఫ్ రేట్స్ ఆఫ్ వేజెస్) యాక్ట్ 1958
  • మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 1958
  • సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976
  • డేంజరస్ మెషిన్‌‌స (రెగ్యులేషన్) యాక్ట్ 1983
  • ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ (రెగ్యులేషన్) యాక్ట్ 2005.
అమలు బాధ్యత రాష్ట్రాలకే ఉన్న చట్టాలు
  • ది ఎంప్లాయర్స్‌ లయబిలిటీ యాక్ట్ 1938
  • ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948
  • ది మోటర్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్‌ యాక్ట్ 1961
  • ది పర్సనల్ ఇంజూరీస్ (కాంపెన్సేషన్ ఇన్సూరెన్స్) యాక్ట్ 1963
  • ది పర్సనల్ ఇంజూరీస్ (ఎమర్జెన్సీ ప్రొవిజన్‌‌స) యాక్ట్ 1962
  • ది ప్లాంటేషన్ లేబర్ యాక్ట్ 1951
  • ది ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926
  • ది వీక్లీ హాలిడేస్ యాక్ట్ 1942
  • బాండెడ్ లేబర్ సిస్టమ్ (అబాలిషస్) యాక్ట్ 1976
పైన పేర్కొన్న కార్మిక చట్టాలను వాటి స్వభావాన్ని, పరిధిని బట్టి కింది విధంగా వర్గీకరించవచ్చు..
  • పారిశ్రామిక సంబంధాలకు సంబంధించిన చట్టాలు
  • వేతనాలకు సంబంధించిన చట్టాలు
  • పని గంటలు, పనిచేసే పరిస్థితులకు సంబంధించిన చట్టాలు
  • సమానత్వం, స్త్రీ సాధికారతకు సంబంధించిన చట్టాలు
  • సమాజంలో అణచివేతకు గురైన, ప్రయోజనాలకు దూరంగా ఉన్న వర్గాలకు సంబంధించిన చట్టాలు
  • సామాజిక భద్రతకు సంబంధించిన చట్టాలు
Published date : 29 Dec 2016 02:13PM

Photo Stories