Skip to main content

బడ్జెట్ - పూర్వాపరాలు

ప్రతి దేశానికీ ఆ దేశం కోసం రూపొందించే బడ్జెట్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది. బడ్జెట్ రూపకల్పన విధానం ఒక్కో దేశానికి ఒక్కో విధంగా ఉంటుంది. కామన్వెల్త్ దేశాల్లో రూపొందించే బడ్జెట్‌లు, మిగతా దేశాల బడ్జెట్ వ్యవస్థల్లో కొన్ని వైవిధ్యాలు ఉంటాయి. రాజ్యాంగంలోని అధికరణం-112 ప్రకారం ఒక సంవత్సర కాలానికి సంబంధించిన‘ఆర్థిక వ్యవహారాల పట్టిక’ను బడ్జెట్‌గా వ్యవహరించవచ్చు. మనదేశంలో ఏటా ఏప్రిల్ 1 నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. సమగ్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం సాధ్యం కాని సందర్భాల్లో ‘మధ్యంతర బడ్జెట్’ లేదా ‘ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్’ రూపొందిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్-2016కు సంబంధించిన తుది కసరత్తు చేస్తున్న నేపథ్యంలో దీన్ని రూపొందించే క్రమం, వివిధ భావనలు తదితర వివరాలను అందిస్తున్నాం.
బడ్జెట్‌ను ‘ఆదాయ వ్యయాలు, వనరుల కేటాయింపులు’ సూచించే పద్దుల పట్టికగా పేర్కొనవచ్చు. ఏటా దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. బ్రిటిషర్ల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం ఏటా ఫిబ్రవరి చివరి రోజు సాయంత్రం 5 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. 2001లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఈ ఆనవాయితీకి భిన్నంగా ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు. నాటి నుంచి దీన్నే కొనసాగిస్తున్నారు.

భారతదేశంలో మొదటి బడ్జెట్‌ను 1947లో ప్రధాని నెహ్రూ నేతృత్వంలో ఆర్థికమంత్రి ఆర్.కె. షణ్ముఖం చెట్టి ప్రతిపాదించారు. 1958-59లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మనదేశంలో మొరార్జీ దేశాయ్ అత్యధికంగా పది సార్లు బడ్జెట్ ప్రతిపాదించారు. మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసిన తర్వాత నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆర్థిక శాఖను కూడా నిర్వహించారు. దేశ చరిత్రలో ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్వహించిన ఒకే ఒక్క మహిళగా ఇందిరా గాంధీ గుర్తింపు పొందారు. ప్రస్తుతం అరుణ్ జైట్లీ 25వ ఆర్థికమంత్రి.
 
బడ్జెట్ రూపకల్పన
బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ముందు ఎంతో కసరత్తు జరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల సమన్వయంతో దీనికి తుదిరూపు కల్పిస్తారు. ఏటా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్ రూపకల్పన దానికి ముందు సంవత్సరం ఆగస్టు-సెప్టెంబర్‌లోనే ప్రారంభమవుతుంది. ఉదాహరణకు.. 2015-16లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలన్నింటినీ అన్ని మంత్రిత్వ శాఖలకు 2014-15లో సవరించిన అంచనాలతో, 2013-14లోని వాస్తవ వ్యయ గణాంకాల ఆధారాలను అందజేశారు. వివిధ మంత్రిత్వ శాఖలు వాటి లక్ష్యాలు, నూతన పథకాలకు సంబంధించిన అంచనాలను అంతిమ సమీక్షలతో తిరిగి ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించడంతో బడ్జెట్ స్థిరీకరణ పూర్తవుతుంది.
ఈ విధంగా బడ్జెట్‌ను జనవరి వరకు సిద్ధం చేసి ఆ సంవత్సరంలో జరిగే ఆర్థిక ఆదాయ, వ్యయ అంచనాలతోపాటు తర్వాతి సంవత్సరానికి సంబంధించిన ఆదాన, ప్రదానాల ఉజ్జాయింపు అంచనాలను రూపొందించి ఆర్థిక మంత్రి పరిశీలనకు పంపుతారు. ఆర్థికమంత్రి దీన్ని క్షుణ్నంగా పరిశీలించి వివిధ మంత్రివర్గ అంచనాల్లో వ్యత్యాసాలు, వైరుధ్యాలు లేకుండా తమ ప్రభుత్వం ఏవైనా నూతన పథకాలను ప్రవేశపెట్టే ఆవశ్యకత ఉందా, కొత్త రంగాల్లో పెట్టుబడి లేదా వ్యయాన్ని సవరించాల్సి ఉందా అనే అంశాలను పరిశీలించి.. అంతిమ సవరణలను చేర్చి ప్రధాని ఆమోదం కోసం పంపుతారు. ఆ తర్వాత ఫిబ్రవరి చివరి వరకు బడ్జెట్ మన ముందుకు వస్తుంది. అంటే ఒక సంవత్సరంలో ప్రవేశపెట్టే బడ్జెట్‌కు సంబంధించిన ప్రక్రియ అంతకుముందు సంవత్సరంలోనే ప్రారంభమై అంచెలంచెలుగా అంతిమ రూపం దాలుస్తుంది. రాజ్యాంగపరంగా చివరి దశలో రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పార్లమెంట్ ఉభయ సభల్లో కూలంకష చర్చ, అవసరమైన సవరణలతో చట్టం రూపం దాలుస్తుంది. బడ్జెట్ అనుబంధంగా ఒక రోజు తర్వాత ఫైనాన్‌‌స బిల్లును కూడా చట్టబద్ధం చేస్తారు. ఏటా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో ‘ఆర్థిక సర్వే’ ప్రవేశపెడతారు.
ఇప్పటివరకు ప్రణాళికా సంఘం వార్షిక బడ్జెట్‌కు అయిదేళ్ల కాలానికి మద్దతు సమకూర్చేది. కానీ ప్రస్తుతం ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ రావడంతో వార్షిక బడ్జెట్ మద్దతును ఆర్థిక సంఘం నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందాల్సిన ఆదాయ పంపిణీ; పన్నుల ద్వారా సమకూరే వనరుల పంపకం; రాష్ట్రాలు, కేంద్రం ఏ నిష్పత్తిలో పంచుకోవాలనే తదితర నిర్ణయాలకు సంబంధించి ఆర్థిక సంఘం ప్రముఖ పాత్ర పోషిస్తోంది.
 
వనరుల సమీకరణ
 ఏ బడ్జెట్‌లోనైనా ప్రధానంగా రెండు అంశాలు ఉంటాయి.
 1. బడ్జెట్ వ్యయం
 2. బడ్జెట్ ఆదాయం

రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగాల్లో ఎంత ఖర్చు చేయనున్నారో సూచించే పట్టికే ‘బడ్జెట్ వ్యయం’. ఏయే శాఖల ద్వారా సమకూర్చుకుంటున్నారో తెలిపే పట్టికే ‘బడ్జెట్ ఆదాయం’.
 బడ్జెట్‌లో రెవెన్యూ అకౌంట్, కేపిటల్ అకౌంట్ అని రెండు భాగాలుంటాయి. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోపాటు, పన్నేతర ఆదాయం కూడా కలిపితే వచ్చేది ‘రెవెన్యూ ఆదాయం’. ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్ల ద్వారా వచ్చే రిజిస్ట్రేషన్ ఆదాయం, ప్రభుత్వ సర్వీసులకు వసూలయ్యే సొమ్ము, వివిధ రకాల ఫీజులు, కంపెనీల లాభాలు, డివిడెండ్లు, వడ్డీలు, బాండ్లు, స్టాక్ మార్కెట్ల లావాదేవీలు తదితరాలన్నింటిలోనూ ప్రభుత్వ చట్టపర ఆదాయ వాటా ఉంటుంది. వీటన్నింటినీ కలిపి రెవెన్యూ అకౌంట్‌లో నమోదు చేస్తారు. ప్రభుత్వం ద్వారా తీసుకున్న రుణాల రికవరీ, ఇతర ఆదాయాలు, అప్పులు, భవిష్యత్ చెల్లింపులన్నింటినీ కలిపి ‘కేపిటల్ అకౌంట్’లో చేరుస్తారు. వీటన్నింటినీ సమీకృతం చేస్తే సమగ్రంగా వచ్చేది పూర్తి రెవెన్యూ అకౌంట్, కేపిటల్ అకౌంట్. వీటిలో ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం అనే రెండు భాగాలు కూడా ఉంటాయి.
 
ప్రభుత్వ సేవలు
ప్రభుత్వ సేవలను మూడు వర్గాలుగా విభజించవచ్చు. అవి..
సాధారణ సేవలు
: ప్రభుత్వం చెల్లించే వడ్డీలు. గతంలో తీసుకున్న ప్రభుత్వ అప్పుల చెల్లింపులు, రక్షణ రంగంపై వెచ్చించే ధనం, పింఛన్లు, శాంతి భద్రతల కోసం పోలీసు వ్యవస్థపై వినియోగించే ధనం, వివిధ ప్రభుత్వ శాఖల నిర్వహణ తదితరాలను సాధారణ సేవలుగా పరిగణిస్తారు.
సామాజిక సేవలు: విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం, బలహీన వర్గాల కోసం ఉద్దేశించిన వ్యయం, యువజన సర్వీసులు, వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులు, అనాథలు, ఇతరుల కోసం వినియోగించే చెల్లింపులను సామాజిక సేవల వర్గంలో చేరుస్తారు.
ఆర్థిక సేవలు: వ్యవసాయ రంగం, పరిశ్రమలు, ఖనిజ రంగం, నీటి పారుదల, ప్రాజెక్టుల నిర్మాణం, రవాణా, విద్యుచ్ఛక్తి, ఉపాధి అవకాశాల కల్పన, అనుబంధ పథకాలు లాంటి వాటిని ఆర్థిక సేవలుగా పరిగణిస్తారు.
పైన పేర్కొన్న వాటితో పాటు ఇతర విభాగాల్లోనూ ప్రభుత్వ సేవలు ఉంటాయి. ప్రభుత్వ బడ్జెట్‌ను సమగ్రంగా అధ్యయనం చేస్తే పూర్తి అవగాహనను సమకూర్చుకోవచ్చు. 
 
బడ్జెట్ - సాంకేతిక పదాలు
బడ్జెట్ విశ్లేషణలో మనం తరచూ కొన్ని సాంకేతిక పదాలను వింటుంటాం. అవి.. బడ్జెట్ లోటు, విత్త లోటు, ఆదాయ లోటు మొదలైనవి.
ఒక బడ్జెట్‌లో సమగ్ర గణాంకాలు చేర్చాక ఆదాయ వ్యయాల వ్యత్యాసాన్ని బడ్జెట్ లోటుగా చెప్పవచ్చు. అంటే సమకూరే వనరులు తక్కువగా ఉండి.. చేయబోయే ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ‘బడ్జెట్ లోటు’గా వ్యవహరిస్తారు. ఇటీవల ప్రాచుర్యం పొందిన పదం ‘విత్త లోటు’ (ఫిస్కల్ డెఫిసిటీ).
ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో చేయబోయే సంపూర్ణ వ్యయం, సమీకరించుకునే వనరులు, ఇతరత్రా ఆదాయం, భవిష్యత్ కోసం ప్రతిపాదించిన అప్పులు పరిమాణం కంటే ఎక్కువగా ఉండి ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం వచ్చినప్పుడు దాన్ని విత్త లోటుగా పరిగణిస్తాం. దీనికి భిన్నంగా ఆదాయ లోటు (రెవెన్యూ డెఫిసిట్) కూడా ఉంది.
చాలా మంది ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ మధ్య తేడాను స్పష్టంగా చెప్పలేరు. రెండింట్లోనూ ఆదాయ, వ్యయాల సూచీ కలవడమే దీనికి కారణం. ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా చెల్లించాల్సిన జీతాలు, రక్షణ రంగ ఖర్చులు ఇవన్నీ ఫిస్కల్ డెఫిసిట్‌కు కారణమవుతాయి. సంక్షేమ కార్యక్రమాల ఖర్చు కూడా దీనికి కారణమవుతోందని కొంత మంది వాదన. దీనికి సరిపడే ఆదాయం ఇతరత్రా సమకూర్చుకోలేనప్పుడు ఏర్పడే లోటునే ఫిస్కల్ డెఫిసిట్‌గా చెప్పవచ్చు.
అసలు ఫిస్కల్ డెఫిసిట్ ఎందుకు ఏర్పడుతుంది? ఒక దేశంలో ప్రభుత్వ పరంగా వ్యయం పెరిగి, ఆ దేశ పౌరుల కోసం ఫ్యాక్టరీలు, విద్యుచ్ఛక్తి, రవాణా సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞాన సృజన, నీటి పారుదల సౌకర్యాల కోసం పెట్టే ఖర్చు అంతా ఫిస్కల్ డెఫిసిట్‌కు కారణమయ్యే అవకాశం ఉంది. చాలాకాలం కిందటే జాన్ మేనార్డ్ కీన్స్ అనే ఆర్థికవేత్త ఇది తప్పుడు అవగాహన అని చెప్పారు. ఒకసారి ఈ సౌకర్యాలన్నీ రాగలిగితే ఆదాయ వనరులు, ఉపాధి అవకాశాలు పెరిగి దీర్ఘకాలిక సంపద, నిరంతర ఆదాయం వస్తుంది. కాబట్టి ఫిస్కల్ డెఫిసిట్ అనేది కేవలం తాత్కాలిక సమస్య అని, దీనికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కీన్స్ అభిప్రాయానికి భిన్నంగా కొంతమంది ఆర్థికవేత్తలు విత్త లోటు వల్ల భారీ నష్టాలున్నాయనీ.. అది ఆర్థిక సంక్షోభానికి కూడా దారితీయొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
 రెవెన్యూ లోటు ఆదాయ అంచనాలకు తక్కువగా.. ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు జరిగే పరిణామం. ఒక కోణంలో చూస్తే ప్రభుత్వ నిధులు తరిగిపోతూ, ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర రంగాల పొదుపులను వాడుకుంటూ వినిమయ వ్యయాన్ని ఆదుకునే ప్రక్రియను రెవెన్యూ లోటుగా నిర్వచించవచ్చు. ప్రభుత్వ కోశ విధానంలో రెవెన్యూ లోటును పూడ్చుకోవడం ద్వారా జాతీయ పొదుపు రేటును పెంచుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. రెవెన్యూ లోటును పూడ్చుకోగలిగితే విత్త లోటును కూడా సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే ఇది కొంచెం కష్టమైన పని. ప్రభుత్వం తన ఆస్తులను అమ్ముకోవడం (పబ్లిక్ డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా విత్త లోటును పూడ్చుకునే ప్రయత్నం చేస్తోంది. గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదాయ వనరులు, ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవడం లాంటి దీర్ఘకాలిక లేదా శాశ్వత పరిష్కారం కోసం కాకుండా.. ఆస్తులు అమ్ముకోవడం, విదేశీ అప్పులు తెచ్చుకోవడం లాంటి సులభ పరిష్కారాల వైపు మొగ్గు చూపడం కూడా ప్రస్తుత ప్రపంచీకరణ భావజాలంలో భాగమే.
 
 పెట్టుబడి ఖాతా కొరత
 దీన్ని కింది విధంగా నిర్వచించవచ్చు.
 పెట్టుబడి ఖాతా కొరత = పెట్టుబడి వ్యయం - పెట్టుబడి ఆదాయం.
 విత్త లోటును నిర్వచించడానికి ప్రభుత్వ సమగ్ర రుణ అవసరాలను అన్ని కోణాల్లో పరిశీలించాలి. ప్రభుత్వం తీసుకునే అప్పులు, నగదు నిల్వల వినిమయం కొలమానాన్ని స్థూల విత్త లోటుగా నిర్వచించవచ్చు.
 స్థూల విత్త లోటు (గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్) = సమగ్ర వ్యయం - (ఆదాయ బిల్లులు + రుణేతర పెట్టుబడి బిల్లులు).
 దీని ఆధారంగా ప్రభుత్వ రుణ చెల్లింపుల భారం విత్త లోటు వల్ల అధికమవుతోందని గ్రహించవచ్చు. ప్రస్తుతం ఆర్థిక శాఖ అంచనాల ప్రకారం 2016 సంవత్సరానికి విత్త లోటును 3.9 శాతానికి తగ్గించుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించవని, తక్షణమే 4.1 నుంచి 4.5 శాతానికి పెరిగే అవకాశాలున్నాయని అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అంచనా.
 
 పన్నులు - రకాలు
బడ్జెట్ లోటు లేదా విత్త లోటు లేదా రెవెన్యూ లోటును పూడ్చుకోవడానికి ఆదాయ వనరుల సమీకరణలో సింహ భాగంగా పన్నులు ఉంటాయి. ఇవి రెండు రకాలు. అవి..
ప్రత్యక్ష పన్నులు: వ్యక్తిగత ఆదాయాలు, ఉద్యోగస్థుల జీతాలు, వ్యాపారస్థుల లాభాలు, ఆదాయాలు, డివిడెండ్లు, వ్యక్తులు గడించే వడ్డీలు, స్టాక్ మార్కెట్లలో గడించే ఆదాయాలపై విధించే ఆదాయ పన్నులనే ‘ప్రత్యక్ష పన్నులు’గా పేర్కొనవచ్చు. మదుపరుల పెట్టుబడులు, వాటి ద్వారా ఆర్జించే ఆదాయం కూడా ఈ కోవలోకే వస్తుంది.
పరోక్ష పన్నులు: సొంత అవసరాల కోసం కొనుగోలు చేసే వస్తువులు, సేవలు మొదలైన వాటిపై చెల్లించే అమ్మకం పన్నులన్నింటినీ ‘పరోక్ష పన్నులు’గా పరిగణించాలి.
పరోక్ష పన్నులు మూడు రకాలు. వీటిని అభ్యుదయ, అనుపాత, తిరోగమన పన్నులుగా వ్యవహరిస్తారు. మనదేశం పురోగమన లేదా అభ్యుదయ (ప్రోగ్రెస్సివ్) పన్నుల విధానాన్ని అనుసరిస్తోంది. దీని ప్రకారం ఆదాయానికి అనుగుణంగా పన్నుల శాతం పెంచడం ద్వారా ధనిక వర్గాల నుంచి ఎక్కువ పన్ను వసూళ్లు చేస్తారు. సంక్షేమ రాజ్య సూత్రాల్లో పురోగమన పన్ను విధానం ఒకటి.
అనుపాత పన్ను విధానంలో ఆదాయ స్థాయి దామాషాలోనే పన్ను స్థాయిని కూడా నిర్ధారిస్తారు. తిరోగమన పన్ను విధానంలో తక్కువ ఆదాయ వర్గాలపై ఎక్కువ పన్ను, ఎక్కువ ఆదాయం గడించే ధనిక వర్గాలపై తక్కువ పన్ను విధిస్తారు. కొన్ని  దేశాల్లో ఈ విధానం ఆచరణలో ఉంది. కొంత మంది ఆర్థికవేత్తల ప్రకారం.. పురోగమన పన్ను విధానమే ప్రయోజనకరం.
Published date : 03 Feb 2016 12:47PM

Photo Stories