Skip to main content

ఆర్థిక సంస్కరణలు

ఒక దేశం నిర్ణయించుకున్న లక్ష్యాల సాధనకు ఆ దేశ ప్రభుత్వం కాలానుగుణంగా తన ఆర్థిక విధానాల్లో మార్పులు తీసుకురావడాన్ని ఆర్థిక సంస్కరణలు అంటారు.
దేశ ఆర్థిక విధానాల్లో మార్పులు తీసుకువచ్చినప్పుడు సహజంగానే అనేక ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతాయి. అందువల్లే ప్రభుత్వం ఆర్థిక విధానాల్లో మార్పులను ఒక్కసారిగా కాకుండా అంచెలంచెలుగా ప్రవేశపెడుతుంది. ఆ మార్పుల సమాహా రాన్ని ఆర్థిక సంస్కరణలుగా పేర్కొనవచ్చు.
 • స్వాతంత్య్రానంతరం శీఘ్రగతిన ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు అప్పటి జాతీయ ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికలను అమల్లోకి తెచ్చింది.
 • ప్రణాళికా లక్ష్యాల సాధనకు వీలుగా ప్రభుత్వ రంగానికి అత్యం ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో భాగంగా రక్షణ రంగంతో పాటు దాదాపు కీలక మౌలిక పరిశ్రమలు అన్నింటినీ ప్రభుత్వ రంగానికే కేటాయించారు.
 • ప్రైవేటు రంగ నియంత్రణకు పారిశ్రామిక లెసైన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దాంతో ఈ రంగంలోని పరిశ్రమల ఆధునికీరణ, విస్తరణలకు ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేశారు.
 • దేశంలో బహుళజాతి సంస్థల స్థాపనకు సంబంధించి అనేక ఆంక్షలు విధించారు.
 • బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలను ప్రభుత్వ నియంత్రణలో ఉంచారు.
 • ఆర్థిక కార్యకలాపాలన్నీ ప్రభుత్వం కనుసన్నల్లో జరిగేందుకు వీలుగా ఆర్థిక విధానాలను అనేక నియమ నిబంధనలతో రూపొందించారు.
1991లో ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించే నాటికి గత ప్రభు త్వాలు అవలంబించిన విధానాల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థలో కొన్ని సకారా త్మక (పాజిటివ్),నకారాత్మక (నెగిటివ్) ఫలితాలు సంభవించాయి. అయితే ఆయా విధానాల కారణంగా ఎక్కువగా నకారా త్మక ఫలితాలే వచ్చాయి.
1. అంతర్జాతీయ పోటీని తట్టుకొనే విధంగా పారిశ్రామికీకరణ జరగలేదు.
2. వ్యవసాయ వృద్ధిరేటు తక్కువగా నమోదయింది.
3. దిగుమతులు పెరిగాయి, ఎగుమతులకు ప్రోత్సాహం లోపించింది.
4. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ ప్రభుత్వ రంగానికి తలకుమించిన భారంగా పరిణమించింది.
5. ప్రభుత్వరంగ సంస్థల్లో లంచగొండితనం, జాప్యం, బంధుప్రీతి వంటివి శృతిమించి, వాటి ఉత్పత్తి సామర్థ్యం లోపించింది.

1991 నాటికి దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రతరమైంది. అదే సమయంలో దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, గల్ఫ్ సంక్షోభం, సోవియట్ యూనియన్ పతనం వంటి అంశాల ప్రభావంతో దేశ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక మార్పులు సంభవించాయి.

దేశంలో ఆర్థిక సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు
1. కోశ లోటు
2. విదేశ మారక చెల్లింపుల లోటు
3. అధిక ద్రవ్యోల్బణం.

కోశలోటు: 1981-82లో కోశలోటు స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 5.1 శాతం కాగా, 1990-91 నాటికి 7.8 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో ఈ లోటును పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన దేశీయ రుణాలు జీడీపీలో 33.3 శాతం నుంచి49.7 శాతానికి పెరిగాయి. ఆయా రుణాల వడ్డీ భారం జీడీపీలో 2 నుంచి 3.8 శాతానికి పెరిగింది.

విదేశీ మారక చెల్లింపులు: 1981-82లో కరెంట్ ఖాతా లోటు 2.1 బిలియన్ డాలర్లు. ఇది జీడీపీలో 1.35 శాతం. అయితే 1990-91 నాటికి కరెంట్ ఖాతా లోటు 9.7 బిలియన్ డాలర్లకు పెరిగి, జీడీపీలో 3.69 శాతానికి చేరింది. ఇదే కాలంలో విదేశీ రుణం జీడీపీలో 12 శాతం నుంచి 23 శాతానికి పెరిగింది.

ద్రవ్యోల్బణ రేటు: 1980లో సాలీనా సగటున 6.7 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణ రేటు 1990-91 నాటికి 10.3 శాతానికి పెరిగింది.
దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు నాటి భారత ప్రధాని పి.వి.నరసింహారావు 1991, జూన్ 24న అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించి, దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

ఆర్థిక సంస్కరణల లక్ష్యాలు
1. ఆర్థికాభివృద్ధి రేటును పెంచడం.
2. పారిశ్రామిక రంగంలో పోటీతత్వాన్ని పెంచడం.
3. కోశ లోటును తగ్గించడం.
4. పేదరికం, ఆదాయ అసమానతలను తగ్గించడం.
5. ప్రభుత్వ రంగ సామర్థ్యాన్ని పెంచడం.
6. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించడం.
7. విదేశీ చెల్లింపుల లోటును తగ్గించడం.
8. ప్రాంతీయ అసమానతలను తగ్గించడం.
9. ఉపాధి అవకాశాలను పెంచి తద్వారా సంపూర్ణోద్యోగితను సాధించడం.

ఆర్థిక సంస్కరణలను మూడు రూపాల్లో అమలుచేశారు. అవి.. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ.

సరళీకరణ
 • ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం.
 • వస్తు సేవల తరలింపుపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం.
 • ఉత్పత్తిదారులే తమ వస్తువులకు ధరలను నిర్ణయించుకోవడం.
 • వస్తువులను అమ్మే ప్రాంతాలపై ఉన్న ఆంక్షలను తొలగించడం.
 • పన్ను రేట్లను తగ్గించడం.
ప్రైవేటీకరణ
 • ఆర్థిక కార్యకాలపాల్లో ప్రభుత్వ రంగ పాత్రను తగ్గించి, ప్రైవేటు రంగ పాత్రను పెంచడం.
 • ప్రభుత్వ రంగ పెట్టుబడులను ఉపసంహరించడం.
 • ప్రైవేటు రంగంలో నూతన పరిశ్రమలను ఏర్పాటు చేయడం.
 • ప్రైవేటు రంగ పరిశ్రమల ఆధునీకరణ, విస్తరణలపై విధించిన ఆంక్షలను తొలగించడం.
 • ప్రైవేటు రంగ పరిశ్రమలు లాభోద్దేశంతో పనిచేస్తాయి. దాంతో అవి తమ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయడంతో పాటు సక్రమ నిర్ణయాలు తీసుకుంటాయని ఆశించడం.
ప్రపంచీకరణ
 • అంతర్జాతీయంగా వస్తువులు, సేవలు, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానాలపై ఉన్న ఆంక్షలను తొలగించడం.
 • సమాచార, సాంకేతిక విప్లవం ద్వారా ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్‌గా మార్చడం.
 • ప్రంపంచంలో ఏ ప్రాంతంలోని ఏ వస్తువు నైనా వినియోగదారులు అందరికీ అందేలా చూడడం.
 • ఆర్థికాభివృద్ధి ఫలితాలను ప్రపంచంలోని అన్ని దేశాలకు లభించేటట్లు చేయడం.
వ్యవస్థీకృత సంస్కరణలు
మన దేశంలో ఆర్థిక సంస్కరణలను వ్యవస్థీ కృత సంస్కరణల్లో భాగంగా నాలుగు రకాలుగా అమలుచేశారు. అవి..
1) వ్యాపార, మూలధన ప్రవాహ సంస్కరణలు.
2) పారిశ్రామిక నియంత్రణలను తొలగించడం.
3) పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ రంగ సంస్థల్లో సంస్కరణలు
4) ద్రవ్య రంగంలో సంస్కరణలు

వ్యాపార, మూలధన ప్రవాహ సంస్కరణలు
 • ప్రభుత్వం 1991 నుంచి వ్యాపార రంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే దేశ వాణిజ్యాన్ని ప్రపంచ వాణిజ్యంతో అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 1991, జూలైలో రూపాయి విలువను 18-19 శాతానికి తగ్గించింది.
 • 1993-94లో కరెంట్ అకౌంట్‌లో రూపాయి పూర్తి మార్పిడి అమల్లోకి వచ్చింది. దాంతో ప్రభుత్వం కరెంట్ అకౌంట్‌కు సంబంధించిన విదేశీ మారకం అమ్మకం, కొనుగోళ్లలో బహిరంగ మార్కెట్‌కు అనుమతిచ్చింది
 • ఎగుమతి, దిగుమతులపై ఉన్న నియంత్రణ లను తొలగించింది. దాంతోపాటు అనేక వస్తువుల దిగుమతులను ఓపెన్ జనరల్ లెసైన్స్ లోకి మార్చింది.
 • తొలిసారిగా 1991-92 బడ్జెట్‌లో 300 శాతం ఉన్న దిగుమతి సుంకాలను 150 శాతానికి తగ్గించారు.
 • 1995-96లో ఈ సుంకాలను 65 శాతం నుంచి 50 శాతానికి, 1997-98లో 40 శాతానికి, 2006-07లో 12.5 శాతానికి, 2007-08లో 10 శాతానికి తగ్గించారు.
 • అనుబంధ పరిశ్రమలను పూర్తి యాజ మాన్యపు స్థాయిలో విదేశీ కంపెనీలు స్థాపించేందుకు వీలు కల్పించారు.
 • ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్‌ ను స్థాపించి, సింగిల్ విండో ద్వారా విదేశీ పెట్టుబడులకు అనుమతిచ్చారు.
 • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు క్యాపిటల్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతిచ్చారు.
 • దేశంలో విదేశీ బ్యాంకులు స్థాపించేందుకు అనేక సౌకర్యాలు కల్పించారు..
 • 1973లో విదేశీ మారక క్రమబద్దీకరణ చట్టాన్ని (ఫెరా) తీసుకొచ్చారు. ఇది 1974, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.
Published date : 29 Dec 2016 01:22PM

Photo Stories