Skip to main content

ఉత్తరప్రదేశ్‌ తర్వాత గోధుమను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం?

ప్రాంతీయ అసమానతలు :
భారత్‌ లాంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో వివిధ ప్రాంతాల మధ్య వనరుల లభ్యతలో వ్యత్యాసాల కారణంగా దేశంలో ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. స్వాతంత్య్రానంతరం కేంద్రీకృత ప్రణాళికను చేపట్టడంలో ఉద్దేశం ప్రాంతీయ అసమానతలను రూపుమాపడం. ప్రణాళికా యుగంలో అనేక చర్యలు తీసుకున్నా, ఇప్పటికీ దేశంలో వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య సాంఘిక–ఆర్థికాభివృద్ధిలో వ్యత్యాసాలు కొనసాగుతున్నాయి. భారత్‌లో చారిత్రక, భౌగోళిక అంశాలతోపాటు అవస్థాపనా సౌకర్యాలు సరిపోయినంతగా లేకపోవడం, ప్రణాళికా యుంత్రాంగం వైఫల్యం, హరిత విప్లవ ప్రభావం అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఆశించినంత లేకపోవడం, వెనుకబడిన రాష్ట్రాల్లో అనుబంధ పరిశ్రమల వృద్ధి తక్కువగా ఉండటం లాంటి అంశాలు దేశంలో ప్రాంతీయ అసమానతలు పెరగడానికి కారణాలుగా పేర్కొనవచ్చు. చరిత్రాత్మకంగా భారత్‌లో ప్రాంతీయ అసమానతలు బ్రిటిష్‌ కాలంలో ప్రారంభమయ్యాయి. దేశంలో తయారీ, వాణిజ్య కార్యకలాపాలను కొన్ని ప్రాంతాల్లోనే బ్రిటిష్‌ పాలకులు, పారిశ్రామిక వేత్తలు కొనసాగించారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలతోపాటు కోల్‌కతా, ముంబై, చెన్నై లాంటి మెట్రోపాలిటన్‌ నగరాల్లో బ్రిటిష్‌ పారిశ్రామిక వేత్తల కార్యకలాపాలు కేంద్రీకృతమయ్యాయి. పారిశ్రామిక పెట్టుబడులతోపాటు, విద్యుత్, రవాణా, సమాచారం, నీటి పారుదల లాంటి సౌకర్యాలు దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కావడం వల్ల బ్రిటిష్‌ కాలంలో దేశంలో ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తర కశ్మీర్‌తోపాటు, ఉత్తరప్రదేశ్, బిహార్, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాలు ఉన్న జిల్లాలు, ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సౌకర్యాల కొరత కారణంగా ఆయా ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయి. వాతావరణ అననుకూలతతోపాటు వరదల్లాంటి అంశాల కారణంగా వ్యవసాయ ఉత్పాదకత క్షీణించి దేశంలో కొన్ని పాంత్రాలు అభివృద్ధికి నోచుకోలేకపోయాయి. ఒక ప్రాంత అభివృద్ధికి ఆర్థిక అవస్థాపనలైన రవాణా, సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం, బ్యాంకింగ్, బీమా, విద్యుచ్ఛక్తి లాంటి సౌకర్యాలు అవసరం. బ్రిటిష్‌ కాలంలో ఆర్థిక అవస్థాపనా సౌకర్యాలు అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ జరిగింది. హిమాచల్‌ప్రదేశ్, బిహార్, ఈశాన్య రాష్ట్రాల్లో ఆయా సౌకర్యాల కొరత కారణంగా అభివృద్ధిలో వెనుకబడ్డాయి.

జి.ఎస్‌.డి.పి. వృద్ధి :

  • సంస్కరణ కాలంలో అన్ని రాష్ట్రాల్లో స్థూల దేశీయోత్పత్తి (జి.ఎస్‌.డి.పి.)లో వృద్ధి వేగవంతమైంది. కానీ జి.ఎస్‌.డి.పి. వృద్ధిలో వివిధ కాలాల్లో మార్పులను గమనించవచ్చు. 2012–13 నుంచి 2017–18 మధ్యకాలంలో మహరాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు అధిక వృద్ధి నమోదైంది. ఈ కాలంలో జి.ఎస్‌.డి.పి. వృద్ధి సగటు గుజరాత్‌లో 10.10 శాతం. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2014–15లో మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడులు ధనిక రాష్ట్రాలు. మహారాష్ట్ర జి.డి.పి. వృద్ధి అధికంగా ఉండటానికి అనేక పరిశ్రమలు ఆ రాష్ట్రంలో కేంద్రీకృతం కావడానికి కారణమైంది.
  • ఐ.ఎం.ఎఫ్‌. ‘వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ 2015’ భారత్‌లోని వివిధ రాష్ట్రాల జి.ఎస్‌.డి.పి.ను ప్రపంచంలోని 188 దేశాల జి.డి.పి.తో పోల్చి ర్యాంకులను ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ ర్యాంకింగ్‌లో జి.డి.పి. పరంగా మొదటి 50 ర్యాంకుల్లో మహారాష్ట్ర స్థానం పొందింది. మహారాష్ట్ర జి.డి.పి.ని 289 బిలియన్‌ డాలర్లుగాను, కొనుగోలు శక్తి సామర్థ్యం (పి.పి.పి.) వద్ద 1040 బిలియన్‌ డాలర్లుగాను నివేదిక పేర్కొంది. నామినల్‌ బేసిస్‌ ప్రకారం మహారాష్ట్ర జి.డి.పి. హాంకాంగ్‌ జి.డి.పి.కి సమానం. కొనుగోలు శక్తి సామర్థ్యం(పి.పి.పి.) ప్రకారం నైజీరియా జి.డి.పి.కి మహారాష్ట్ర జి.డి.పి. సమానం. మొత్తం 188 దేశాల్లో ప్రపంచ ర్యాంకింగ్‌లో నామినల్‌ జి.డి.పి. పరంగా ఉత్తరప్రదేశ్‌ జి.డి.పి. కువైట్‌ జి.డి.పి.తో సమానం. పి.పి.పి. పరంగా తమిళనాడు జి.డి.పి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ జి.డి.పి. తో సమానం.
వివిధ రాష్ట్రాల మధ్య అభివృద్ధిలో వ్యత్యాసం :
  • బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌తో పోల్చినప్పుడు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వృద్ధిరేటు అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు. ఆర్థిక ప్రణాళికలు ప్రారంభమైన తదుపరి పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్‌లు ఆర్థికాభివృద్ధి సాధించాయి. వ్యవసాయాభివృద్ధి పంజాబ్, హర్యానా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీకృతమైంది. బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లు వ్యవసాయభివృద్ధిలో వెనుకబడ్డాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులు పారిశ్రామికంగా ముందంజలో ఉన్నాయి. ఖనిజ ఉత్పత్తులు, అడవులు, భూసారం లాంటి సహజ వనరులు అధికంగా ఉన్నప్పటికీ ఆయా వనరులను అభిలషణీయంగా ఉపయోగించుకోవడంలో విఫలమైనందువల్ల బిహార్, ఒడిషా, మధ్యప్రదేశ్‌లు పేద రాష్ట్రాలుగానే మిగిలిపోయాయి.
  • భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు పెరగడానికి అవస్థాపనా సౌకర్యాల కొరత, వనరుల పంపిణీ సక్రమంగా లేకపోవడం, లోపభూయిష్టమైన హరిత విప్లవ విధానం, వెనుకబడిన రాష్ట్రాల్లో అనుబంధ పరిశ్రమల వృద్ధి తక్కువగా ఉండటం, విత్త సంస్థల పరపతి విధానం లోపభూయిష్టంగా ఉండటం, రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ విధానాలు, అక్షరాస్యతలో వ్యత్యాసాల్లాంటి అంశాలను కారణాలుగా పేర్కొనవచ్చు. మొత్తంగా దేశంలో ప్రాంతాల మధ్య అభివృద్ధిలో సమతుల్యత లోపించింది. ప్రాంతీయ అసమానతల నివారణకు వెనుకబడిన రాష్ట్రాలకు అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇవ్వాలి. వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్ర వనరుల పంపిణీలో ప్రాధాన్యమివ్వాలి.
  • తక్కువ వర్షపాతం ఉన్న రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లాంటి రాష్ట్రాల్లో డ్రై లాండ్‌ ఫార్మింగ్‌ కోసం ప్రత్యేక ప్రాజెక్టులను చేపట్టాలి. వెనుకబడిన రాష్ట్రాల్లో పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేయడానికి పన్ను రాయితీలు, సబ్సిడీలాంటి ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించాలి.
  • వెనుకబడిన రాష్ట్రాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహించాలి. వెనుకబడిన ప్రాంతాల్లో వొకేషనల్‌ ట్రైనింగ్‌ ద్వారా శ్రమశక్తిలో నైపుణ్యతాభివృద్ధికి చర్యలు అవసరం. సబ్సిడీ ధరల వద్ద వెనుకబడిన ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువుల సప్లయ్‌ ద్వారా వ్యవసాయ రంగ అభివృద్ధికి చర్యలు అవసరం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అమలు పరుస్తున్న అనేక కార్యక్రమాల్లో అవినీతి నిర్మూలనకు చర్యలు అవసరం.

మాదిరి ప్రశ్నలు

1. బ్రిటిష్‌ పారిశ్రామిక వేత్తలు భారత్‌లో కింది ఏ రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను అధికంగా కొనసాగించారు?
 ఎ) పశ్చిమబెంగాల్‌ 
 బి) ఆంధ్రప్రదేశ్‌
 సి) మహారాష్ట్ర 
 డి) కేరళ
 1) ఎ, డి 
 2) ఎ, సి
 3) బి, డి 
 4) ఎ, బి, సి, డి

Published date : 11 May 2019 05:30PM

Photo Stories