Skip to main content

ప్రధాన శ్రామికుడు అంటే?

వృత్తి నిర్మాణత:
  • ఒక దేశంలో వృత్తి నిర్మాణత ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వృత్తి నిర్మాణతను నిర్ణయించే అనేక అంశాలలో సహజ వనరుల లభ్యత, తలసరి ఆదాయ స్థాయి, ఉత్పాదకతలో వృద్ధి, ప్రత్యేకీకరణపై ఆధారపడి ఉంటుంది. సంప్రదాయంగా వృత్తులను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా వర్గీకరించవచ్చు. వ్యవసాయం, అడవులు, కలప, పశు సంపద, ఫిషింగ్, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు కాగా మైనింగ్ & క్వారియింగ్, నిర్మాణ రంగం, తయారీ రంగం, విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా పారిశ్రామిక రంగ కార్యకలాపాలు రవాణా, నిల్వ, సమాచారం, వాణిజ్యం, వర్తకం, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, బీమా, కమ్యూనిటీ సేవలు, ఐ.టి. & అనుబంధ సర్వీస్‌లు, వ్యక్తిగత సేవలు, పర్యాటకం, గిడ్డంగులు సేవా రంగానికి సంబంధించిన ఉప రంగాలు.
  • అనేక అల్పాభివృద్ధి దేశాలు ప్రస్తుతం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలుగానే మిగిలిపోయాయి. వ్యవసాయ రంగంలో శ్రమ సాంద్రత సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికంగా వినియోగిస్తున్నందు వల్ల ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. ఆయా దేశాలలో వ్యవసాయ రంగంలో మూలధన - శ్రామిక నిష్పత్తిలో పెరుగుదల ఉన్నప్పటికీ వినియోగంలో ఉన్న అధిక మూలధన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఉత్పాదకతలో పెరుగుదల లేకపోవడానికి వ్యవసాయ కార్యకలాపాల లక్షణం కారణమవుతుంది. తృతీయ ప్రపంచ దేశాలలో పారిశ్రామిక రంగం చిన్నదిగా ఉండి తక్కువ శ్రామిక శక్తికి ఉపాధి కల్పిస్తుంది. ఆయా దేశాలలో పారిశ్రామిక రంగంలోనే పెద్ద తరహా తయారీ పరిశ్రమలలో ఆధారపడిన శ్రామిక శక్తి తక్కువ. పారిశ్రామిక రంగంలో అల్ప మూలధన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన చిన్నతరహా, కుటీర పరిశ్రమలు అధిక ఉపాధి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. భారతదేశంలో 1989-90లో పారిశ్రామిక రంగంపై ఆధారపడిన శ్రామిక శక్తిలో చిన్నతరహా, కుటీర పరిశ్రమల వాటా 82.2 శాతం కాగా పెద్ద, మధ్య తరహా పారిశ్రామిక యూనిట్ల వాటా 17.8 శాతం. పారిశ్రామిక రంగంతో పోల్చిన ప్పుడు సేవా రంగంలో ఉత్పాదకత ఎక్కువ. వ్యవసాయ రంగంపై ఆధారపడిన మిగులు శ్రామిక శక్తిని పారిశ్రామిక, సేవా రంగాలకు తరలించడాన్ని ఆర్థిక ప్రగతికి సూచికగా భావించవచ్చు.
  • ఒక దేశ తలసరి ఆదాయ స్థాయి శ్రామిక శక్తి వృత్తుల వారీ పంపిణీపై ఆధారపడి ఉంటుంది. తలసరి ఆదాయం తక్కువగా ఉన్న దేశాలలో జాతీయాదాయంలో అధిక భాగం వ్యవసాయ రంగంలో ఉత్పత్తిచేయబడిన వస్తువులపై అధికంగా ఉంటుంది. అధిక శ్రామిక శక్తి ఆయా దేశాలలో వ్యవసాయం, పశుసంపద, అడవులు, ఫిషరీస్‌పై ఆధారపడి ఉంటుంది. వృద్ధి, పెరుగుదలతో పాటు తలసరి ఆదాయ స్థాయి పెరిగినప్పుడు తయారీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో తయారీ రంగ ఉత్పత్తి విస్తరిస్తుంది. తద్వారా పారిశ్రామిక రంగంలో అధిక ఉపాధి కల్పన సాధ్యమవుతుంది. పారిశ్రామికీకరణ తొలి దశలో పారిశ్రామిక రంగంలో పనిచేసే శ్రామిక శక్తిలో పెద్దగా మార్పులేనప్పటికీ తలసరి ఆదాయంలో పెరుగుదల కారణంగా ఆయా ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి పెద్ద స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటయినప్పుడు ఆ రంగంపై ఆధారపడే శ్రామిక శక్తి పెరుగుతుంది.
  • భారత్ వృత్తి నిర్మాణతలో మార్పు లేకపోవడానికి కారణాలు
  • గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నిరుపయోగంగా ఉన్న మిగులు శ్రామిక శక్తిని వినియోగించుకోవడంలో ప్రణాళికా రచయితలు విఫలమయ్యారు. నిరుద్యోగ నిర్మూలనకు ప్రణాళికాయుగంలో ప్రకటించిన అనేక పథకాలు అల్ప ఉద్యోగిత, నిరుద్యోగాన్ని తగ్గించడంలో విఫలమయ్యాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయేతర ఉపాధిని పెంపొందించడంలో విధాన నిర్ణేతలు విఫలమయ్యారు.
  • భూ సంస్కరణలు లక్ష్యాల సాధనలో వైఫల్యం కావడం భారత వృత్తి నిర్మాణతలో ఆశించిన మార్పు రాకపోవడానికి కారణమయింది. శ్రామిక శక్తి వృద్ధిరేటు కూడా అధికంగా ఉండటంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లభ్యం కానందువల్ల పెరుగుతున్న శ్రామిక శక్తి వ ్యవసాయ రంగాన్నే ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగం పెరిగింది.
  • భారీ పారిశ్రామికీకరణ నేపథ్యంలో పెద్ద తరహా మూలధన వస్తు రంగానికి ప్రభుత్వాలు ప్రాధాన్యతనిచ్చినందు వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. పెద్ద తరహా పరిశ్రమలు అధిక మూలధన సాంద్రతను కలిగి ఉండి తక్కువ పెట్టుబడితో ఏర్పాటుచేయగలిగే ఎం.ఎస్.ఎం.ఇ. రంగంపై ప్రభుత్వం దృష్టిసారించనందు వల్ల పెరుగుతున్న శ్రామిక శక్తి గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగాన్నే ఆశ్రయిస్తున్నారు.
  • సంస్థాపరమైన పరపతి, మార్కెటింగ్, ఎరువు ధరలపై సబ్సిడీకి సంబంధించి ధనిక రైతులే అధికంగా ప్రయోజనం పొందుతున్నారు. ఉపాంత, చిన్న తరహా రైతులు ఈ ప్రయోజనాలను పొందలేకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. తద్వారా వారి ఆదాయాలు తగ్గి పారిశ్రామిక రంగంలో తయారయ్యే ఉత్పత్తులను డిమాండ్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలో పారిశ్రామిక రంగంలో ఆశించిన వృద్ధి జరగనందు వల్ల వ్యవసాయ రంగంపై ఆధారపడిన మిగులు శ్రామికులకు పారిశ్రామిక రంగం ఉపాధి కల్పించలేకపోతుంది.

మాదిరి ప్రశ్నలు

Published date : 17 Dec 2018 02:51PM

Photo Stories