Skip to main content

రష్యాకు శిక్ష తప్పదు.. ఆ దేశంపై ఇక మరిన్ని ఆంక్షలు

Group Of Seven (G7) Leaders Statement Tightens Sanctions To Russia War On Ukraine

హిరోషిమా/న్యూఢిల్లీ:  ఉక్రెయిన్‌లో మారణకాండ సాగిస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న రష్యాకు శిక్ష తప్పదని జి–7 దేశాల అధినేతలు హెచ్చరించారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించబోతున్నట్లు తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జి–7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కూటమి దేశాల అధినేతలు శుక్రవారం జపాన్‌లోని హిరోషిమాకు చేరుకున్నారు.

చదవండి: Operation Kaveri: సూడాన్ బాధితుల కోసం ఆపరేషన్ కావేరి

అనంతరం సమాశమై, తాజా అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఉక్రెయిన్‌పై రష్యా చట్ట విరుద్ధమైన, న్యాయ విరుద్ధమైన యుద్ధం సాగిస్తోందని మండిపడ్డారు. రష్యాకు వ్యతిరేకంగా కలిసికట్టుగా ముందుకు సాగాలని జి–7 దేశాల నేతలు ప్రతిన బూనారు. రష్యా ప్రారంభించిన ఈ యుద్ధాన్ని రష్యానే ముగించాలని అన్నారు. హిరోషిమాలోని శాంతి పార్కును వారు సందర్శించారు. రెండో ప్రపంచ యుద్ధంలో బాంబు దాడిలో దెబ్బతిన్న డోమ్‌ వద్ద గ్రూప్‌ ఫొటోలు దిగారు. అక్కడ పుష్పగుచ్ఛాలు ఉంచి, అమర వీరులకు నివాళులర్పించారు. జి–7 శిఖరాగ్ర సదస్సుకు గుర్తుగా చెర్రీ మొక్కను నాటారు.

PM Modi
దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో రాజీలేదు: మోదీ  
 
సార్వభౌమత్వం, గౌరవాన్ని కాపాడుకొనే విషయంలో భారతదేశం పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉందని, ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే  లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో భారత్‌–చైనా సంబంధాలు మెరుగుపడడం అనేది కేవలం ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని తేల్చిచెప్పారు. శుక్రవారం జపాన్‌ వార్తా సంస్థ ‘నిక్కీ ఆసియా’ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడారు. పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.

చదవండి: G7 Summit: జపాన్‌లో జీ7 సదస్సు ప్రారంభం

పొరుగు దేశాలతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలంటే సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు కొనసాగడం తప్పనిసరి అని చెప్పారు. దేశ సార్వ¿ౌమత్వాన్ని కాపాడుకోవడానికి, చట్టబద్ద పాలనకు, వివాదాలకు శాంతియుత పరిష్కారం కనుగొనడానికి తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఉద్ఘాటించారు. భారత్‌–చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి చేరుకుంటే ఇరు దేశాలకే కాకుండా ప్రపంచానికి కూడా లబ్ధి చేకూరుతుందని తెలియజేశారు.

భారత్‌ ప్రగతి పథంలో దూసుకుపోతోందని వివరించారు. 2014లో ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారు. పాకిస్తాన్‌తో సాధారణ, ఇరుగుపొరుగు సంబంధాలను నరేంద్ర మోదీ కోరుకుంటున్నట్లు నిక్కీ ఆసియా వెల్లడించింది.  

Group of Seven
హిరోషిలో మోదీ 

జి–7, క్వాడ్‌ దేశాల అధినేతల సదస్సులో పాల్గొనడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జపాన్‌లోని హిరోషిమా నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు జపాన్‌ సీనియర్‌ అధికారులు, భారత రాయబార కార్యాలయం అధికారులు స్వాగతం పలికారు. హిరోషిమాలో ల్యాండ్‌ అయ్యానంటూ మోదీ ట్వీట్‌ చేశారు. ఆయన ఈ నెల 21 దాకా హిరోషిమాలో పర్యటిస్తారు. జి–7 సదస్సుతోపాటు వివిధ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటారు. జపాన్‌ పర్యటనకు బయలుదేరేముందు ఢిల్లీలో మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘జి–20 కూటమికి ఈ ఏడాది భారత్‌ సారథ్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో హిరోషిమాలో జి–7 దేశాల అధినేతలతో సమావేశమై, చర్చించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ప్రపంచ సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించబోతున్నాం’’ అన్నారు.

చదవండి: Russia-Ukraine War: రష్యాపై ఎదురుదాడికి ఉక్రెయిన్‌ సన్నాహాలు!

సదస్సులో పాల్గొననున్న జెలెన్‌స్కీ 
జి–7 దేశాల శిఖరాగ్ర సదస్సులో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం పాల్గొనబోతున్నారు. ఆయన ఆదివారం సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ నేషనల్‌ సెక్యూరిటీ, డిఫెన్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ఒలెక్సీ డానిలోవ్‌ నిర్ధారించారు. తమ దేశంలో నెలకొన్న అస్థిరతను పరిష్కరించడానికి తమ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తారని, ఎవరినైనా  కలుస్తారని చెప్పారు.

Published date : 20 May 2023 02:03PM

Photo Stories