Group 2 Free Coaching: గ్రూప్–2కు ఉచిత శిక్షణ
రాయచోటి టౌన్: గిరిజన యువతకు తిరుపతిలోని ప్రముఖ విద్యాసంస్థల ద్వారా ఉచితంగా గ్రూప్ –2 కోచింగ్ ఇప్పించనున్నట్లు జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అబ్సలోము శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ(విజయవాడ) ఆదేశాల మేరకు ఐటీడీఏ (యానాదులు) నెల్లూరు కార్యాలయ ప్రాజెక్టు పరిధిలో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు తిరుపతి పట్టణంలో ప్రముఖ గ్రూప్–2 కోచింగ్ సెంటర్‌లో ఉచితంగా భోజనం, వసతి కల్పించి శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఆసక్తి గలవారు 5వ తేదీ లోపు ఆయా జిల్లాల్లోని డీఎస్‌టీడబ్ల్యూ, ఈవో, డీటీడబ్ల్యూ వారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు విద్యార్హత, కుల ధృవీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు నకళ్లు దరఖాస్తులు దరఖాస్తుతో పాటు జతపరచాలన్నారు. మరిన్ని వివరాల కోసం సెంటర్ మేనేజర్ ఎం.బాలాజీని 8187899877 నంబరులో సంప్రదించాలన్నారు.
చదవండి: Free Coaching for Group 2: ఉచితంగా గ్రూప్–2 కోచింగ్.. చివరి తేదీ ఇదే..
డీపీఎంఓగా డాక్టర్ రియాజ్ బేగ్
రాయచోటి అర్బన్: అన్నమయ్య జిల్లాలో జాతీయ ఆరోగ్యమిషన్ పర్యవేక్షణకు డీపీఎంఓ (డిస్ట్రిక్ట్ పోగ్రామ్ మానిటరింగ్ ఆఫీసర్) గా డాక్టర్ రియాజ్ బేగ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు పనిచేసిన లోకవర్ధన్ కొద్దిరోజుల క్రితం ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. డాక్టర్ రియాజ్‌బేగ్ రాయచోటి పీపీ యూనిట్ వైద్యాధికారిగా విధులు నిర్వర్తించేవారు. రియాజ్‌బేగ్ నియామకం పట్ల డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ కొండయ్య, డిస్ట్రిక్ట్ ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్ లోకవర్ధన్, అదనపు డీఎం అండ్ హెచ్‌ఓ శైలజ, డీఎస్‌ఎంఓ విష్ణువర్ధన్ రెడ్డి, ఏఓ మధుసూదన్‌రెడ్డి, డీఐఓ ఉషశ్రీ, హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్‌రఫీలు అభినందనలు తెలిపారు.
‘జేఎన్టీయూ’కు అకడమిక్ అటానమీ
కలికిరి: కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలకు అకడమిక్ అటానమీ మంజూరు చేస్తూ అనంతపురం జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ ప్రొశ్రీశ్రీసి.శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాల ఏర్పాటై పదేళ్లు పూర్తి కావడంతో అకడమిక్ అటానమీ అవకాశం కల్పించాలని అక్టోబరులో కళాశాల ప్రిన్సిపాల్ యూనివర్సిటీకి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు యూనివర్సిటీ అకడమిక్ సెనేట్ కౌన్సిల్, యూనివర్సిటీ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ పరిశీలించి ఆమోదం తెలిపాయి. దీంతో ఈ ఏడాది నుంచి బోధనాపరమైన స్వయం ప్రతిపత్తి(అకడమిక్ అటానమీ) విధానం అమలుకు వీసీ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే మూడేళ్ళపాటు ఇది అమలులో ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. సిలబస్ తయారీ, ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షలు నిర్వహించుకోవడం వంటి సదుపాయాలుంటాయని ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
చదవండి: Job mela: డిసెంబర్ 4న జాబ్‌మేళా
నూతన నియామకం
వేంపల్లె: ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ నూతన డైరెక్టర్‌గా ఎస్‌ఎస్ కుమార్ స్వామి గుప్తా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన మెకానికల్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించేవారు. డైరెక్టర్ అయిన సందర్భంగా ఆయనను కళాశాల అధ్యాపకులు అభినందించారు.
ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి
కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీఎస్ ఆర్టీసీలో అప్రెంటీస్ చేసేందుకు 1.11.2023 నుంచి 15.11.2023 తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వైఎస్సార్ జిల్లాకు చెందిన ఐటీఐ అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరఫికేషన్ కోసం కర్నూలులో హాజరు కావాలని ఏపీఎస్ ఆర్టీసీ కర్నూలు జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నజీర్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాలు, దివ్యాంగులైతే ఆయా ధృవీకరణపత్రం, మాజీ సైనికులైతే ధృవీకరణపత్రం, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు అకౌంట్ పాసుపుస్తకం, పాస్‌పోర్టు సైజ్ ఫోటో, ఆధార్‌కార్డు అన్ని సెట్ల జిరాక్స్ కాపీలతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఫీజు రూ. 118తో హాజరు కావాలన్నారు. ఏదైనా సందేహాలు ఉంటే 08518–257025 నంబర్‌లో ఆఫీసు పనివేళల్లో సంప్రదించాలన్నారు.
చదవండి: Mega Job Mela: 1256 మందికి ఉద్యోగాలు