Skip to main content

APPSC Group 2 Mains Competition 2024 : గ్రూప్‌-2 మెయిన్స్‌లో ఒక్కొక్క పోస్టుకు ఎంత మంది పోటీ అంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు 1:100 నిష్పత్తిలో గ్రూప్‌–2 మెయిన్స్‌కు ఎంపిక చేశారు. చరిత్రలో ఇంతమంది నిరుద్యోగులకు అవకాశం కల్పించడం ఇదే ప్రథమం.
APPSC Group 2 Mains Competition 2024

అలాగే గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన త‌ర్వాత‌ కేవ‌లం 45 రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో ఫలితాల చేశారు. గత ఏడాది డిసెంబర్‌ 7న ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ జారీ చేయగా.. 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ముందే ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు ఫిబ్రవరి 25న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షకు 4,04,039 మంది (87.17 శాతం) హాజరయ్యారు. గతంలో నిర్వహించిన గ్రూప్‌–2తో పాటు ఇతర పరీక్షలకు గరిష్టంగా 70 శాతం మాత్రమే హాజరవగా, ఈ ఏడాది ప్రిలిమ్స్‌కు మాత్రం భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరు కావడం గమనార్హం.

ఒక పోస్టుకు 100 చొప్పున అభ్యర్థులను ఎంపిక..
తొలుత మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కమిషన్‌ నిర్ణయించింది. అయితే, నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఏపీపీఎస్సీకి అందిన విజ్ఞప్తుల మేరకు ఎక్కువ మందికి మెయిన్స్‌ రాసేందుకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఒక పోస్టుకు 100 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేశారు.

పెరిగిన గ్రూప్‌-2 పోస్టులు ఇవే..
ఏపీపీఎస్సీ డిసెంబర్‌ 7వ తేదీన 897 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసి 21 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించింది. అనంతరం మరో 8 పోస్టులు నోటిఫికేషన్‌కు కలిపారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 905కి పెరిగాయి. పెరిగిన పోస్టుల ఆధారంగా మెయిన్స్‌కు మొత్తం 92,250 మందిని ఎంపిక చేశారు.గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షను జూలై 28న నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

గ్రూప్‌–2, గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు సవాళ్లు, ఆటంకాలు..
సర్విస్‌ కమిషన్‌ పరీక్షల నిర్వహణలో అనేక సవాళ్లు, ఆటంకాలు ఎదురయ్యాయని, అయినా.. గ్రూప్‌–2, గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ను విజయవంతంగా నిర్వహించామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం అందించిన పూర్తి సహకారంతో తక్కువ సమయంలోనే గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ ఫలితాలను సైతం ప్రకటించామని ఆయన తెలిపారు.

92,250 మందికి మెయిన్స్‌కి చాన్స్ ఇలా..

appsc group 2 mains competition details in telugu

2018లో నిర్వహించిన గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ రాసినవారి నుంచి 1:12 నిష్పత్తిలో మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయగా.. ఈసారి ఎక్కవ సంఖ్యలో 92,250 మంది అభ్యర్థులకు మెయిన్స్‌ రాసే ఛాన్స్‌ లభించింది. గ్రూప్‌ పరీక్షలకు 1:100 విధానంలో ఎంపిక చేయడం సర్విస్‌ కమిషన్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.

పోస్టుల వివ‌రాలు ఇవే..
గ్రూప్‌–2 నోటిఫికేషన్‌లో 114 డిప్యూటీ తహసీల్దార్, 150 ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, గ్రేడ్‌–3 మునిసిపల్‌ కమిషనర్‌ పోస్టులు 4, గ్రేడ్‌–2 సబ్‌ రిజి్రస్టార్‌ 16, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ 28 పోస్టులతో కలిపి 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఏఏఓ), సీనియర్‌ ఆడిటర్, ఆడిటర్‌ ఇన్‌ పే అండ్‌ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 566 ఉన్నాయి.

APPSC గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ఫ‌లితాలు ఇలా..

Published date : 11 Apr 2024 01:40PM

Photo Stories