APPSC Group 2 Exam: ఏపీపీఎస్సీ గ్రూప్–2 రికార్డు బద్దలు, ముగిసిన ప్రిలిమ్స్, మెయిన్స్ ఎప్పుడంటే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 899 పోస్టుల భర్తీకి ఆదివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 24 జిల్లాల్లో 1,327 సెంటర్లలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు.
ఈ పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగా 87.17 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.ఏపీపీఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షలకు గరిష్టంగా 68–70 శాతం వరకు మాత్రమే హాజరయ్యేవారు. ఈ రికార్డులను బద్దలు కొడుతూ ఈసారి గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు అత్యధికంగా హాజరవడం విశేషం.
గ్రూప్-2 మెయిన్స్ ఎప్పుడంటే..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇప్పటివరకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వివిధ పరీక్షలు నిర్వహించడంతో అభ్యర్థుల్లో ఏపీపీఎస్సీ పట్ల నమ్మకం పెరిగింది. దీంతో ప్రస్తుత గ్రూప్–2 ప్రిలిమ్స్‌ను కూడా షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారన్న నమ్మకంతో అభ్యర్థులు సీరియస్‌గా పరీక్షకు సిద్ధమయ్యారు.
దీంతో పరీక్ష రాసినవారి సంఖ్య పెరిగింది. కాగా, గ్రూప్–2 ప్రిలిమ్స్ ఫలితాలను 5 నుంచి 8 వారాల్లో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ లేదా జూలైలో గ్రూప్–2 మెయిన్స్ నిర్వహిస్తామని వెల్లడించారు.