Skip to main content

Success Story : గ్రూప్‌–1 ఉద్యోగం కొట్ట‌డంలో.. నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే..

అతడి సంకల్పబలం ముందు పేదరికం ఓడిపోయింది. మనోధైర్యమే ముందుకు నడిపింది. దివ్యాంగుడైన కొడుకుకు వైద్యం చేయించడమే లక్ష్యమైంది. లక్ష్యసాధనకు స్నేహితుడి సహకార హస్తం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడైంది.
బూడిద సునీల్‌, DSP
బూడిద సునీల్‌, DSP

చదువే ఊపిరైంది. 16 గంటలసేపు పుస్తకాలతో గడిపేలా చేసింది. విజయలక్ష్మి తలుపుతట్టింది. డీఎస్పీ పదవిలో అలంకరించింది. ఏపీపీఎస్పీ గ్రూప్‌–1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 29వ ర్యాంకు సాధించిన జగ్గయ్యపేట బూదవాడకు చెందిన బూడిద సునీల్‌ విజయప్రస్థానంపై ప్రత్యేక కథనం మీకోసం..

Success Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించానిలా..

కుటుంబ నేప‌థ్యం  :
నాది కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామం. నిరుపేద కుటుంబంలో పుట్టాను. నేను డిగ్రీ చ‌దివే టైమ్‌లో మా నాన్న‌ చనిపోవడంతో.. మా అమ్మ కూలీనాలీ చేస్తూ చదివించింది. 

నా ఎడ్యుకేష‌న్ : 
ఒకటి నుంచి ఐదు వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివాను. ప‌దోత‌ర‌గ‌తిలో 548 మార్కులు వ‌చ్చాయి. అలాగే ఇంటర్‌ జగ్గయ్యపేటలోని జేఆర్సీ కళాశాలో చ‌దివి 95శాతం మార్కులు సాధించాను. డిగ్రీ కూడా జగ్గయ్యపేట విశ్వభారతి కళాశాలలో బీఎస్సీ, బీజడ్‌సీలో 80 శాతం మార్కులు సాధించాను. నా చిన్న వ‌య‌స్సులోనే కుటుంబ భారం మీద ప‌డ‌టంతో కొద్ది రోజులు పాటు చ‌దువుకు స్వ‌స్తీ చెప్పి కూలీ ప‌నులు కూడా వెళ్లాను.

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

వైద్యం కోసమే..
కొడుకు పుట్టుకే గ్రూప్స్‌కు సిద్ధం చేసింది. డిగ్రీ పూర్తవగానే ఐదేళ్ల పాటు గ్రామంలోని జేపీ సిమెంట్స్‌ కర్మాగారంలో ప్రైవేట్‌ ఉద్యోగం చేశాను. 2012లో శ్యామలతో వివాహమైంది. ఇద్దరు మగ పిల్లలు. పెద్ద కుమారుడు పుట్టుకతోనే చెవుడు, కళ్లు కనిపించని లోపంతో పుట్టాడు. కుమారుడికి మెరుగైన వైద్యం చేయించాలని నిశ్చయించుకున్నాను. కుటుంబ సభ్యులతో మాట్లాడి గ్రూప్‌–1కు ప్రిపేరవుతానని సహకరించాలని కోరాను. వారు కూడా అంగీకరించడంతో పాటు తన ఇంటర్‌ స్నేహితుడు లాహోరు నరసింహారావు ఆర్థికంగా సహకరించడంతో ముందడుగు వేశాను.

Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

ఇలా చ‌దివా..
2016లో గ్రూప్స్‌ పరీక్షలు రాసేందుకు గ్రామం విడిచి హైదరాబాద్‌కు వెళ్లిపోయాను. రెండేళ్లపాటు పిల్లలకు, భార్యకు దూరంగా ఉండి పట్టుదలతో గ్రూప్‌–1కు సిద్ధమయ్యాను. రాత్రింబవళ్లు చదివా. నా కుమారుడి లోపమే కళ్లముందు కదలాడింది. ఉద్యోగ సాధనే లక్ష్యంగా కదిలాను. నిత్యం పత్రికలు, రాజ్యసభ టీవీ కార్యక్రమాల వీక్షణతోపాటు ఎన్‌సీఆర్టీ పుస్తకాలను రోజుకు 16 గంటలు చదివేవాడిని. 2016 డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 2017లో ప్రిలిమ్స్‌కు, ఆగస్టులో మెయిన్స్‌కు అర్హత సాధించడంతో ఆ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఎంపికయ్యాను.

Inspirational Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా

నా ఇంటర్వ్యూలో..
ఇంటర్వ్యూలో వ్యక్తిగత అంశాలతో పాటు జిల్లా, జాతీయ, అంతర్జాతీయ కరంట్‌ అఫైర్స్‌పై అనేక ప్రశ్నలు అడిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వంటి అంశాలు కూడా స్పృశించారు. స్థానిక అంశాలపై కూడా ప్రశ్నలు అడిగారు.

నా మొదటి పోస్టింగ్‌..
2018లో గ్రూప్‌-1లో ఉత్తీర్ణత సాధించి డీఎస్పీ పోస్టుకు ఎంపికయ్యాను. అనంతపురం, విశాఖపట్నం, తాడేపల్లె తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. నా మొదటి పోస్టింగ్‌ను కడప డీఎస్పీగా ఇచ్చారు.

Success Story: రాష్ట్ర కొలువుతో పాటు కేంద్ర కొలువు కొట్టానిలా.. కానీ ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే..

నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే..
కోచింగ్‌ కేంద్రాల్లో నేర్పించే అంశాలు 15 నుంచి 20 శాతం మేర మాత్రమే ఉపయోగపడతాయి. 80 శాతం వ్యక్తిగతంగా చదువుకుంటే ఎంచుకొన్న లక్ష్యాన్ని అదిగమించవచ్చు. యువత కూడా ప్రస్తుతం చదువులో ఛాలెంజ్‌గా తీసుకోవాలి.

నా విజ‌య యాత్ర‌లో ఈ ముగ్గురు..
నా విజయ యాత్రలో ముగ్గురున్నారు. పుట్టుక లోపం కలిగిన నా కుమారుడు, వాడిని రెండేళ్లు నేను లేని లోటు లేకుండా చూసుకున్న నా భార్య శ్యామల ఆమె కుటుంబ సభ్యులు, మూడో వ్యక్తి నా స్నేహితుడు నరసింహారావు.

Success Story: గ్రూప్-2లో విజయం సాధించా.. మళ్లీ గ్రూప్-2 రాశా.. ఎందుకంటే..?

సునీల్‌ గ్రూప్స్‌కు సిద్ధమవుతున్నాడని తెలిసి..
సునీల్‌ ఇంటర్‌లో పరిచయమయ్యాడు. నాకు డిగ్రీ పూర్తవగానే ఎస్‌బీఐలో ఉద్యోగం వచ్చింది. సునీల్‌ గ్రూప్స్‌కు సిద్ధమవుతున్నాడని తెలిసి ఆర్థికంగా సహాయపడ్డాను. అతడిని యువత ఆదర్శంగా తీసుకోవాలి.
                                                                                        – లాహోరి నరసింహారావు, సునీల్‌ స్నేహితుడు

​​​​​​​Y.Obulesh, Group 1 Ranker : ప్ర‌భుత్వ స్కూల్‌లో చ‌దివా...ప్ర‌భుత్వ ఉద్యోగం కొట్టానిలా..

Published date : 06 May 2022 03:49PM

Photo Stories