APPSC Group 1 Prelims 2023 : గ్రూప్-1 ప్రిలిమ్స్ తీరు ఇదే.. ఎక్కడా డైరెక్ట్ ప్రశ్నలు లేకుండానే..
ఉదయం 10 గంటల నుంచి 12 వరకు పేపర్-1ను, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించారు. 2022 గ్రూప్–1 పరీక్షకు 1,26,449 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 1,06,473 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా 87,718 మంది (82.38 శాతం) పరీక్ష రాశారు.
ఎక్కడా డైరెక్ట్ ప్రశ్నలు లేకుండానే..
ఈసారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు అత్యున్నత ప్రమాణాలతో ఆయా అంశాలపై అభ్యర్థుల సమగ్ర అవగాహన, పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఉన్నాయని పలువురు నిపుణులు, అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఎక్కడా డైరెక్ట్ ప్రశ్నలు లేవన్నారు. ఈదఫా గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నలు సివిల్స్ తరహాలో ఉన్నాయని గతంలో గ్రూప్–1 పరీక్షకు హాజరు కావడంతోపాటు సివిల్స్‌లో సైతం ఇంటర్వ్యూ వరకు వెళ్లిన ఓ అభ్యర్థి తెలిపారు. పేపర్ 1లో ఇచ్చిన 120 ప్రశ్నల్లో ఆరు మినహా తక్కినవన్నీ ఆయా అంశాలపై పూర్తి అవగాహన ఉన్నవారే కచ్చితమైన సమాధానం రాయగలుగుతారని చెప్పారు.
తొలిసారి ఈ పరీక్షకు హాజరైన వారు..
పేపర్ 1, 2లో ప్రశ్నలకు ఇచ్చిన బహుళైచ్చిక సమాధానాలన్నీ సరైనవే అన్నట్లుగా ఉన్నాయని విశాఖలో తొలిసారి ఈ పరీక్షకు హాజరైన ఓ యువతి పేర్కొంది. సబ్జెక్టుపై పూర్తి అవగాహనతోపాటు క్షుణ్ణంగా అర్థం చేసుకొన్న వారే సరైన సమాధానం గుర్తించగలిగేలా ప్రశ్నలు అడిగారని తెలిపారు. పేపర్ 1 కంటే పేపర్ 2లో ప్రశ్నలు కష్టంగా ఉన్నాయని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆప్టిట్యూడ్ ప్రశ్నలకు సరైన సమాధానాలు కనుక్కోవడం ఇబ్బంది అయిందని మరో అభ్యర్థి పేర్కొన్నారు. పేపర్ 2 లో జనరల్ స్టడీస్ అంశాలు పూర్తిగా గత ఏడాదిలో చోటు చేసుకున్న పరిణామాల పరిధిలోనివేనని తెలిపారు. గతంలో అనువాదం సరిగాలేక తప్పులు దొర్లడంతో తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం వాటిల్లిందని, ఈసారి మాత్రం తెలుగు అనువాదంలో ఎక్కడా తప్పులు దొర్లలేదని పలువురు అభ్యర్థులు వెల్లడించారు.
మెయిన్స్‌కి..
ఉన్నత ప్రమాణాలతో గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించారని, దీనివల్ల మంచి పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్నవారు అర్హత సాధించగలుగుతారని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే మెయిన్స్‌కి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని నిపుణులతో పాటు అభ్యర్థులు కోరుతున్నారు.ఈసారి కూడా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి 1:50 ప్రకారం అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.
ప్రాథమిక కీ ని ఎప్పుడు విడుదల చేస్తారంటే..
ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని త్వరలోనే విడుదల చేయనున్నారు.
రెండు లేదా మూడు వారాల్లోపు ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటిస్తామన్నారు. అనంతరం మెయిన్స్ సన్నద్ధతకు తగిన వ్యవధి ఇచ్చి ఏప్రిల్ నెలాఖరున మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆపై రెండు నెలల్లో మూల్యాంకనం ముగించి జూన్ కల్లా ఫలితాలు విడుదల చేస్తామన్నారు. అనంతరం రెండువారాలు గడువు ఇచ్చి ఇంటర్వూలు నిర్వహిస్తామన్నారు. ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేస్తామన్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాల సంఖ్య వేలల్లో ఉంటున్నందున ప్రశ్నకు రూ.100 చొప్పున చెల్లించాలన్న నిబంధన పెట్టామన్నారు. సరైన అభ్యంతరమైతే ఆ మొత్తాన్ని వెనక్కు ఇచ్చేస్తామన్నారు.
☛ APPSC Group 1 Prelims 2023 Analysis : గ్రూప్-1 ప్రిలిమ్స్ 2023లో ప్రశ్నలు ఎలా వచ్చాయంటే..