APPSC Group 1 Applications Last Date : గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడగింపు.. చివరి తేదీ ఇదే.. ఈ సారి మాత్రం..
ఈ మేరకు నవంబర్ 2వ తేదీన (బుధవారం) ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వివరాలను వెల్లడించారు.
దరఖాస్తు గడువు చివరి ఇదే..
గ్రూప్-1 దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 2వ తేదీ కాగా.. ఆ తేదీని నవంబర్ 5కి మార్చినట్లు వెల్లడించారు. నవంబర్ 4వ తేదీ అర్థరాత్రి లోపు ఫీజు చెల్లించాలని ఆయన తెలిపారు. డిసెంబర్ 18న స్క్రీనింగ్ టెస్ట్, మార్చ్ 2023లో మెయిన్స్ పరీక్షలు ఉంటాయని.. ఈ దరఖాస్తు పొడిగింపును గమనించి వినియోగించుకోవాలని అర్హులకు సవాంగ్ సూచించారు.
ఏపీపీఎస్సీ మొత్తం 92 గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 30వ తేదీ(శుక్రవారం) విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ గ్రూప్-1 పోస్టులకు అక్టోబరు 13 నుంచి నవంబర్ 4వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానం, విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్..
అర్హతలు..
- ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
- వయసు: జూలై1, 2022నాటికి 18-44ఏళ్ల మధ్య ఉండాలి. డీఎస్పీ(సివిల్) పోస్ట్‌లకు 21-30ఏళ్లు, డీఎస్పీ జైల్స్‌కు 18-30ఏళ్లు, డివిజినల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పోస్ట్‌లకు 21-28ఏళ్లు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు ఉంటుంది.
మూడు దశల ఎంపిక ప్రక్రియ..
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగనుంది. అవి.. ప్రిలిమినరీ పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్),మెయిన్ ఎగ్జామినేషన్,పర్సనల్ ఇంటర్వ్యూ.
తొలి దశ ప్రిలిమినరీ..
గ్రూప్-1 పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియలో ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో నిర్దిష్ట కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులకు రెండో దశలో మెయిన్ పరీక్షను నిర్వహిస్తారు. ఒక్కో పోస్ట్‌కు 50 మందిని చొప్పున (1:50 నిష్పత్తిలో) మెయిన్‌కు ఎంపిక చేస్తారు.
- తొలి దశలో నిర్వహించే ప్రిలిమినరీ రెండు పేపర్లలో 240 మార్కులకు ఉంటుంది.
- ప్రిలిమ్స్ పరీక్ష ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండు గంటలు.
- పేపర్ 1లో ఏ,బీ,సీ,డీ అనే నాలుగు భాగాలు ఉంటాయి. ప్రతి భాగానికి 30 మార్కుల చొప్పున మొత్తం 120 మార్కులకు పేపర్1 ఉంటుంది. పార్ట్ ఏలో హిస్టరీ అండ్ కల్చర్; పార్ట్ బీలో రాజ్యాంగం, పాలిటీ, సోషల్ జస్టిస్, అంతర్జాతీయ సంబంధాలు; పార్ట్ సీలో భారత, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్; పార్ట్ డీలో జాగ్రఫీ ఉంటుంది.
- అదేవిధంగా పేపర్ 2లో పార్ట్ ఏ 60 మార్కులకు, పార్ట్ బీ 60 మార్కులకు ఉంటాయి. పార్ట్-ఎలో పేర్కొన్న అంశాల నుంచి 60 ప్రశ్నలు, పార్ట్-బి-1 నుంచి 30 ప్రశ్నలు, పార్ట్-బి-2 నుంచి 30 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. పార్ట్ ఏలో జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్; పార్ట్ బీలో సైన్స్ అండ్ టెక్నాలజీస్, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
మెయిన్‌లో ఏడు పేపర్లు...
- రెండో దశ మెయిన్ పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఏడు పేపర్లలో నిర్వహిస్తారు.
- ఒక్కో పేపర్‌కు పరీక్ష సమయం 3 గంటలు.
- తెలుగు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేపర్లను కేవలం అర్హత పేపర్లుగానే పరిగణిస్తారు. ఇందులో కనీస ఉత్తీర్ణత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓసీ అభ్యర్థులు 40 శాతం, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి. అప్పుడే మెయిన్‌లోని మిగతా అయిదు పేపర్ల మూల్యాంకన చేస్తారు.
- పేపర్-1లో జనరల్ ఎస్సే(ప్రాంతీయ,జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న సమకాలీన అంశాలు 150 మార్కులకు ఉంటుంది.
- పేపర్-2 ఏపీ, భారత చరిత్ర, సంస్కృతి భౌగోళిక శాస్త్రంపై 150 మార్కులకు ఉంటుంది.
- పేపర్-3 పాలిటీ, రాజ్యాంగం, పాలన, లా, ఎథిక్స్‌పై 150 మార్కులకు నిర్వహిస్తారు.
- పేపర్-4 ఎకానమీ, భారత దేశ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 150 మార్కులకు జరుగుతుంది.
- పేపర్-5లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ అంశాలు 150 మార్కులకు ఉంటాయి.
- ఇలా ఈ అయిదు పేపర్ల మొత్తం 750 మార్కులకు అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది దశ ఇంటర్వ్యూ ఎంపిక చేస్తారు.
పర్సనల్ ఇంటర్వ్యూ ఇలా..
మెయిన్‌లో పొందిన మార్కులు ఆధారంగా.. రిజర్వేషన్లు ఇతర నిబంధనలను అనుసరించి 1:2 నిష్పత్తిలో చివరి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూకు 75 మార్కులు కేటాయించారు. మెయిన్ ఎగ్జామినేషన్‌లో 750మా ర్కులు,పర్సనల్ ఇంటర్వ్యూ 75 మార్కులు మొత్తం 825మార్కులకుగాను అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుదివిజేతలను ఖరారు చేస్తారు.
సన్నద్ధతకు అడుగులు ఇలా..
- ఆయా సిలబస్ అంశాలను చదివేటప్పుడు వాటిని సమకాలీన పరిణామాలతో సమన్వయం చేసుకుంటూ డిస్క్రిప్టివ్ విధానంలో ప్రిపరేషన్ సాగించాలి. అదేవిధంగా అభ్యర్థులు ప్రిలిమ్స్ నుంచే ఆయా అంశాలను విశ్లేషించుకుంటూ అభ్యసించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. సమకాలీన అంశాలపై పూర్తి స్థాయి అవగాహన, విశ్లేషణ, స్వీయ అభిప్రాయ దృక్పథం పెంచుకోవాలి.
- ముఖ్యమైన అంశాలకు సంబంధించి సినాప్సిస్, నేపథ్యం, ప్రభావం, ఫలితం, పర్యవసానా లు.. ఇలా అన్ని కోణాల్లో అవగాహన పెంచుకోవాలి.
- ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ముఖ్యంగా నవరత్నాలు, వాటికింద అమలు చేస్తున్న పథకాలు, లక్షిత వర్గాలు, బడ్జెట్ కేటాయింపులు, ఇప్పటి వరకు లబ్ధి పొందిన వారి సంఖ్య తదితర వివరాల ఔపోసన పట్టాలి. దీంతోపాటు రాష్ట్ర స్థాయిలో అమలవుతున్న ఆర్థిక విధానాలు, వాటి ద్వారా కలిగిన అభివృద్ధిపైనా దృష్టి సారించాలి.
చరిత్ర, జాగ్రఫీ..
- రాష్ట్ర చరిత్రకు సంబంధించి ప్రాచీన చరిత్ర మొదలు ఆధునిక చరిత్ర వరకు ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాలి. జాతీయోద్యమంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర గురించి అవగాహన పెంచుకోవాలి. అలాగే భారత దేశ చరిత్రకు సంబంధించిన అంశాలపైనా పట్టు సాధించాలి.
- జాగ్రఫీకి సంబంధించి రాష్ట్రంలోని భౌగోళిక వనరులు, అడవులు, జీవ సంపద, వ్యవసాయ వనరులు గురించి తెలుసుకోవాలి. వీటిని తాజా పరిస్థితులతో అన్వయం చేసుకోవాలి. అదే విధంగా గతేడాది కాలంలో చేపట్టిన వ్యవసాయ, నీటి పారుదల ప్రాజెక్ట్‌లు, వాటి ద్వారా లబ్ధి చేకూరే ప్రాంతాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
చదవండి: Geography Important Bit Bank: భారతదేశంలో మొట్టమొదటిగా కనుగొన్న చమురు క్షేత్రం ఏది?
పాలిటీపై పట్టు కోసం..
- రాజనీతి శాస్త్రం, రాజ్యాంగానికి సంబంధించి ప్రాథమిక అంశాలు, భావనలు మొదలు తాజా పరిణామాలు వరకూ తెలుసుకోవాలి.
- గవర్నెన్స్, లా, ఎథిక్స్‌కు సంబంధించి సుపరిపాలన దిశగా చేపడుతున్న చర్యలు, పబ్లిక్ సర్వీస్‌లో పాటించాల్సిన విలువలు, ప్రజా సేవలో చూపించాల్సిన నిబద్ధత, అంకిత భావం వంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలి. వీటితోపాటు స్ఫూర్తి దాయక నేతల వివరాలు, వారు పాలించిన తీరు తదితర అంశాలను సేకరించుకోవాలి. న్యాయపరమైన అంశాలపైనా పట్టు సాధించాలి.
- ప్రాథమిక హక్కులు,విధులు,కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు, వీటికి సంబంధించి న్యాయ వ్యవస్థకున్న అధికారాల గురించి తెలుసుకోవాలి. అదే విధంగా, సివిల్ అండ్ క్రిమినల్ లా, కార్మిక చట్టాలు, సైబర్ చట్టాలు, ట్యాక్స్ లాస్ గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.
చదవండి: Indian Polity Bit Bank For All Competitive Exams:దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి?
ఆర్థికం.. విస్తృత అధ్యయనం..
ప్రిపరేషన్ ప్రారంభ దశలో ఎకానమీకి సంబంధించి మౌలిక భావనలు మొదలు తాజా వృద్ధి రేట్ల వరకూ..గణాంక సహిత సమాచారం సేకరించుకుని పరీక్షకు సన్నద్ధం కావాలి. ఇటీవల కాలంలో చేపట్టిన ప్రధాన ఆర్థిక సంస్కరణలు, వాటి ద్వారా లబ్ధి చేకూరే వర్గాలు, అదే విధంగా జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఇటీవల కాలంలో తీసుకొచ్చిన విధానాలపై పట్టు సాధించాలి.ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు, ఎకనామిక్ సర్వేలపై అవగాహన పెంచుకోవాలి.
చదవండి: AP Economy
ఎస్ అండ్ టీ :
సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి దేశంలో, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త ఐసీటీ విధానాలు, ప్రధాన సంస్థలు, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, డీఆర్‌డీఓ, ఇంధన వనరులు, విపత్తు నిర్వహణకు అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. పర్యావరణ సంబంధిత అంశాలపైనా దృష్టి సారించాలి. అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్న చట్టాలు, విధానాలపై అవగాహన పొందాలి.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం :
గ్రూప్-1 అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. విభజన తర్వాత ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు గురించి సమకాలీన అంశాలతో కూడిన సమాచారంతో సన్నద్ధత సాధించాలి.