Skip to main content

రియో ఒలింపిక్స్ 2016

బ్రెజిల్‌లోని రియో-డి-జెనీరో నగరంలో 31వ ఒలింపిక్స్ ఆగస్టు 5 నుంచి 21 వరకు నిర్వహించారు. 120 ఏళ్ల ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో ప్రతిష్టాత్మకమైన ఈ క్రీడలను దక్షిణ అమెరికా ఖండంలోని ఒక నగరంలో నిర్వహించడం ఇదే ప్రథమం.
బ్రెజిల్ దేశ జంతుజాతిని ప్రతిబింబించే ‘వినీసియస్’ను రియో ఒలింపిక్స్ చిహ్నంగా ప్రకటించారు. ఈ క్రీడల నినాదం ‘ఏ న్యూ వరల్డ్’. ఈ ఒలింపిక్స్‌లో మొత్తం 206 దేశాలతోపాటు ఒక శరణార్థుల జట్టు పాల్గొన్నాయి. అన్ని దేశాల నుంచి 11 వేల మందికి పైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. మొత్తం 28 క్రీడలకు సంబంధించి 306 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ ఒలింపిక్స్‌లో తొలిసారిగా రగ్బీ సెవెన్‌‌సను ప్రవేశపెట్టారు. 1904లో సెయింట్ లూయిస్ ఒలింపిక్స్ తర్వాత గోల్ఫ్‌ను ఒలింపిక్స్ నుంచి తొలగించారు. మళ్లీ 112 ఏళ్ల తర్వాత గోల్ఫ్‌ను రియో ఒలింపిక్స్‌లో చేర్చారు.

రియో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను ఆగస్టు 5న ‘మారకానా స్టేడియం’లో నిర్వహించారు. వీటిని బ్రెజిల్ ఉపాధ్యాక్షుడు (ప్రస్తుత అధ్యక్షుడు) మిషెల్ టెమర్ ప్రారంభించారు. రియో ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణ పతకాన్ని అమెరికాకు చెందిన మహిళా షూటర్ వర్జీనియా త్రషర్ గెలుచుకుంది. చివరి బంగారు పతకాన్ని కూడా ఇదే దేశానికి చెందిన పురుషుల బాస్కెట్‌బాల్ జట్టు గెలుచుకుంది. 46 స్వర్ణ పతకాలతో అమెరికా.. పతకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. బ్రిటన్ రెండో స్థానంలో, చైనా మూడో స్థానంలో నిలిచాయి. ఆతిథ్య దేశమైన బ్రెజిల్ ఏడు స్వర్ణ, ఆరు రజత, ఆరు కాంస్య పతకాలతో (మొత్తం 19) 13వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారిగా ఫుట్‌బాల్‌లో బ్రెజిల్ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. భారతదేశంతోపాటు మంగోలియా ఒక రజతం, ఒక కాంస్య పతకం సాధించి పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచాయి.

రియోలో భారత్
రియో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున 118 మంది క్రీడాకారులు మొత్తం 15 క్రీడల్లో పాల్గొన్నారు. భారత్ ఒక రజతం, ఒక కాంస్యం సాధించి 67వ స్థానంలో నిలిచింది.

సాక్షి మాలిక్:
హర్యానాకు చెందిన సాక్షి మాలిక్ ఆగస్టు 17న మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ పోటీల 58 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్. ఈమె గతంలో 2014లో గ్లాస్గోలో నిర్వహించిన కామన్‌వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించింది. భారత్ తరఫున ఒలింపిక్స్‌లో పతకం సాధించిన నాలుగో క్రీడాకారిణి సాక్షి మాలిక్. అంతకు ముందు కరణం మల్లీశ్వరి (వెయిట్‌లిఫ్టింగ్, 2000-సిడ్నీ), మేరీ కోమ్ (బాక్సింగ్, 2012 -లండన్), సైనా నెహ్వాల్ (బాడ్మింటన్, 2012 -లండన్) పతకాలు సాధించారు. ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమానికి సాక్షి మాలిక్‌ను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆ రాష్ట్ర ప్రచారకర్తగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు 2016 సంవత్సరానికి ‘రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర అవార్డు’ ప్రదానం చేసింది.

పి.వి. సింధు:
హైదరాబాద్‌కు చెందిన పూసర్ల వెంకట సింధు ఆగస్టు 19న బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో రజత పతకం సాధించింది. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణి పి.వి. సింధు. ఫైనల్‌లో ఆమె స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్ చేతిలో 21-19, 12-21, 15-21తో ఓటమి పాలైంది. కరోలినా మారిన్ బాడ్మింటన్‌లో ప్రపంచ నెంబర్‌వన్ క్రీడాకారిణి.

పి.వి. సింధు 2013, 2014ల్లో నిర్వహించిన ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీల్లో వరసగా కాంస్య పతకాలు గెలుచుకుంది. 2014లో గ్లాస్గోలో నిర్వహించిన కామన్‌వెల్త్ క్రీడల్లోనూ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పి.వి. సింధుకు 2013లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ అవార్డు, 2016లో రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర పురస్కారాలు లభించాయి.

దీపా కర్మాకర్:
ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత తొలి మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్. రియో ఒలింపిక్స్‌లో ఈమె తృటిలో పతకాన్ని చేజార్చుకుంది. 0.15 పాయింట్ల తేడాతో కాంస్య పతకాన్ని కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచింది. త్రిపురకు చెందిన దీపా కర్మాకర్‌కు 2016 సంవత్సరానికి రాజీవ్ గాంధీ ఖేల్త్న్రను, ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నందికి ద్రోణాచార్య అవార్డును బహూకరించారు. 2014లో గ్లాస్గోలో నిర్వహించిన కామన్‌వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన దీపా కర్మాకర్, 2014లో ఇంచియాన్‌లో నిర్వహించిన ఆసియా క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచింది.

ఇతరులు:
రియో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పాల్గొన్న ఇతర క్రీడాకారుల్లో.. 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ పోటీల్లో భారత మహిళా అథ్లెట్ లలితా బాబర్ పదో స్థానంలో నిలిచింది. టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ పోటీల్లో భారత జోడీ రోహన్ బోపన్న, సానియా మీర్జా కాంస్య పతకం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన రాడెక్ స్టెపానెక్, లూసీ హ్రదేకా జోడీ చేతిలో ఓడిపోయింది. అయిదో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అభినవ్ బింద్రా షూటింగ్‌లో నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. కిదాంబి శ్రీకాంత్ బాడ్మింటన్ సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. భారత్‌కు చెందిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌పై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాలుగేళ్లపాటు నిషేధం విధించింది.

‘రియో - 2016’ హైలైట్స్
  • రియో ఒలింపిక్స్‌లో అమెరికాకు చెందిన స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ 5 స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం గెలుచుకున్నాడు. అతడు మొత్తం 5 ఒలింపిక్స్‌లో పాల్గొని 23 బంగారు, 3 రజత, 2 కాంస్య పతకాలు (మొత్తం 28) గెలుచుకున్నాడు.
  • అమెరికా మహిళా స్విమ్మర్ కేటీ లెడెకీ నాలుగు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం సాధించింది.
  • అమెరికా మహిళా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం సాధించింది.
  • జమైకా రన్నర్ ఉసేన్ బోల్ట్ 100 మీ., 200 మీ., 4 ప 100 మీ. రిలే పరుగు పందాల్లో మూడు స్వర్ణ పతకాలు గెలుచుకున్నాడు. ఉసేన్ బోల్ట్ 2008 బీజింగ్ ఒలింపిక్స్, 2012 లండన్ ఒలింపిక్స్‌ల్లో కూడా ఇవే అంశాల్లో స్వర్ణాలు సాధించి ‘ట్రిపుల్ ట్రిపుల్స్’ను సాధించాడు. ఆయన మొత్తం తొమ్మిది స్వర్ణాలు సాధించి అథ్లెటిక్స్‌కు వీడ్కోలు పలికాడు.
  • బ్రిటన్ అథ్లెట్ మో ఫరా 5,000 మీ., 10,000 మీ. పరుగు పందాల్లో స్వర్ణ పతకాలు గెలుచుకున్నాడు. మో ఫరా 2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ ఇవే అంశాల్లో స్వర్ణాలు గెలుచుకొని ‘డబుల్ డబుల్’ను సాధించాడు.
  • టెన్నిస్‌లో పురుషుల టైటిల్‌ను ఆండీ ముర్రే, మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఫోర్టోరికోకు చెందిన మోనికా పగ్ కైవసం చేసుకొని స్వర్ణ పతకాలు సాధించారు.
  • దక్షిణాఫ్రికాకు చెందిన వేడ్ వాన్ నీకెర్‌‌క 400 మీ. పరుగు పందెంలో ప్రపంచ రికార్డు సృష్టించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. వేడ్ వాన్ నీకెర్‌‌క మైకేల్ జాన్సన్ పేరుతో 17 ఏళ్లుగా ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించాడు.
  • మొత్తం అన్ని ఒలింపిక్స్‌లో కలిపి 1000 స్వర్ణాలు సాధించిన దేశంగా అమెరికా రికార్డు సృష్టించింది.
  • పోలాండ్‌కు చెందిన అనితా వ్లోడార్‌జిక్ మహిళల హ్యామర్ త్రోలో ప్రపంచ రికార్డు సృష్టించి బంగారు పతకాన్ని గెలుచుకుంది.
  • జమైకాకు చెందిన మహిళా స్ప్రింటర్ ఎలైన్ థాంప్సన్ 100 మీ., 200 మీ. పరుగు పందాల్లో స్వర్ణ పతకాలు గెలుచుకొని అరుదైన స్ప్రింట్ డబుల్‌ను సాధించింది.
  • పురుషుల 100 మీ. బట్టర్‌ఫ్లై స్విమ్మింగ్ పోటీల్లో సింగపూర్‌కు చెందిన జోసెఫ్ స్కూలింగ్ స్వర్ణం సాధించగా, మైకేల్ ఫెల్ప్స్ రజత పతకం గెలుచుకున్నాడు.
  • ఒలింపిక్స్‌లో తొలిసారి స్వర్ణాన్ని గెలుచుకున్న దేశాలు: బహ్రెయిన్, ఫిజీ, ఐవరీ కోస్ట్, జోర్డాన్, కొసోవో, పోర్టోరికో, సింగపూర్, తజకిస్తాన్, వియత్నాం.

తొలి పది స్థానాల్లో నిలిచిన దేశాలు

ర్యాంక్

దేశం

స్వర్ణం

రజతం

కాంస్యం

మొత్తం

1.

యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా

46

37

38

121

2.

గ్రేట్ బ్రిటన్

27

23

17

67

3.

చైనా

26

18

26

70

4.

రష్యా

19

18

19

56

5.

జర్మనీ

17

10

15

42

6.

జపాన్

12

8

21

41

7.

ఫ్రాన్స్‌

10

18

14

42

8.

దక్షిణ కొరియా

9

3

9

21

9.

ఇటలీ

8

12

8

28

10.

ఆస్ట్రేలియా

8

11

10

29

67.

భారత్

0

1

1

2


మాదిరి ప్రశ్నలు
  1. రియో డి జెనీరోలో నిర్వహించిన ఒలింపిక్స్‌లో తొలిసారి పాల్గొన్న దేశాలు?
    1) నౌరు, భూటాన్
    2) దక్షిణ సూడాన్, కొసోవో
    3) లైబీరియా, కిరిబాతి
    4) స్వాజిలాండ్, సోలోమన్ ఐలాండ్‌‌స
  2. రెజ్లర్ సాక్షి మాలిక్‌కు ఏ రాష్ట్రం ‘రాణి లక్ష్మీబాయి’ పురస్కారాన్ని ప్రకటించింది?
    1) హర్యానా
    2) ఉత్తరప్రదేశ్
    3) మధ్యప్రదేశ్
    4) పంజాబ్
  3. అతి చిన్న వయసులో ఒలింపిక్ పతకం సాధించిన భారత క్రీడాకారిణి ఎవరు?
    1) సాక్షి మాలిక్
    2) సైనా నెహ్వాల్
    3) పి.వి. సింధు
    4) కరణం మల్లీశ్వరి
  4. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) ప్రస్తుత అధ్యక్షుడైన థామస్ బాచ్ ఏ దేశానికి చెందినవారు?
    1) స్విట్జర్లాండ్
    2) బెల్జియం
    3) ఫ్రాన్‌‌స
    4) జర్మనీ
  5. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ)లో సభ్యురాలైన భారత తొలి మహిళ ఎవరు?
    1) అంజూ బాబి జార్‌‌జ
    2) ఇందూ జైన్
    3) నీతా అంబానీ
    4) అంజలీ భగవత్
  6. ‘ప్రొడునోవా’ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది?
    1) గోల్ఫ్
    2) జిమ్నాస్టిక్స్
    3) అథ్లెటిక్స్
    4) ఆర్చరీ
  7. రియో ఒలింపిక్స్‌లో గోల్ఫ్ పోటీలో పాల్గొన్న భారత క్రీడాకారిణి ఎవరు?
    1) హీనా సిద్దు
    2) అయోనికా పాల్
    3) అపూర్వి చందేలా
    4) అదితి అశోక్
  8. భారత్ తరఫున ఏడు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న ఏకైక క్రీడాకారుడు?
    1) అభినవ్ బింద్రా
    2) లియాండర్ పేస్
    3) యోగేశ్వర్ దత్
    4) గగన్ నారంగ్
  9. కింద పేర్కొన్న వారిలో త్రిపురకు చెందిన ఒలింపిక్ క్రీడాకారిణి ఎవరు?
    1) మేరీ కోమ్
    2) దీపికా కుమారి
    3) దీపా కర్మాకర్
    4) సాక్షి మాలిక్
  10. అన్ని ఒలింపిక్స్ క్రీడల్లోనూ కనీసం ఒక స్వర్ణ పతకాన్ని సాధించిన ఏకైక దేశం?
    1) అమెరికా
    2) బ్రిటన్
    3) ఫ్రాన్‌‌స
    4) జర్మనీ
  11. రియో ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశ పెట్టిన పురుషుల రగ్బీ సెవెన్‌‌స క్రీడలో స్వర్ణ పతకం సాధించిన దేశం ఏది?
    1) ఫిజీ
    2) న్యూజిలాండ్
    3) అమెరికా
    4) దక్షిణాఫ్రికా
  12. రియో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఒ.పి. జైశా ఏ క్రీడలో పాల్గొంది?
    1) స్విమ్మింగ్
    2) మారథాన్
    3) షూటింగ్
    4) వెయిట్‌లిఫ్టింగ్

సమాధానాలు
1) 2; 2) 2; 3) 3; 4) 4; 5) 3; 6) 2; 7) 4; 8) 2; 9) 3; 10) 2; 11) 1; 12) 2.
Published date : 13 Sep 2016 12:30PM

Photo Stories