Skip to main content

దశాబ్దపు మేటి క్రికెటర్‌గా ఎంపికైన క్రీడాకారుడు?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ దశాబ్దపు మేటి క్రికెటర్‌గా ప్రకటించింది.

కోహ్లీని అత్యుత్తమ క్రికెటర్(సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డు) అవార్డుకు ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రస్తుత దశాబ్ద కాలానికి(2011, జనవరి 1-2020, అక్టోబర్ 7) సంబంధించిన అవార్డుల విజేతలను డిసెంబర్ 28న ఐసీసీ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఓటింగ్ ద్వారా అవార్డీలను ఎంపిక చేశారు. ఈ ఓటింగ్‌లో 53 లక్షల మంది పాల్గొన్నారు.

గత పదేళ్ల కాలంలో కోహ్లీ...
అవార్డుకు పరిగణించిన పదేళ్ల కాలంలో కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి అంతర్జాతీయ క్రికెట్‌లో 20396 పరుగులు చేశాడు. అదే సమయంలో భారత జట్టు 2011 ప్రపంచకప్‌ను, 2013 చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. 2017, 2018 సంవత్సరాల్లో కోహ్లి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఐసీసీ అన్ని ఫార్మాట్లలో ఈ దశాబ్దపు మేటి జట్లను ప్రకటించగా.. మూడు జట్లలోనూ చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు.

మహిళల్లో ఎలీస్ పెర్రీ బెస్ట్...
మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ ఎలీస్ పెర్రీ అందుబాటులో ఉన్న మూడు అవార్డులను సొంతం చేసుకుంది. 30 ఏళ్ల ఎలీస్ ఈ దశాబ్దపు ఉత్తమ మహిళా క్రికెటర్(రేచల్ హెహో-ఫ్లింట్ అవార్డు), ఉత్తమ వన్డే క్రికెటర్, ఉత్తమ టి20 క్రికెటర్‌గా ఎంపికై ంది. క్రికెట్‌తోపాటు ఫుట్‌బాల్ క్రీడలోనూ ఎలీస్ పెర్రీకి ప్రవేశం ఉంది.

కెప్టెన్ ధోని...
ఐసీసీ అన్ని ఫార్మాట్లలో ఈ దశాబ్దపు మేటి జట్లను ప్రకటించింది. మూడు ఫార్మాట్లలోనూ ఎంపికచేసిన ఈ ఉత్తమ జట్లలో దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని వన్డే, టీ20 జట్ల కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇక విరాట్ టెస్ట్ జట్టు సారథిగా ఎంపికయ్యాడు.

మిస్టర్ కూల్ స్ఫూర్తి...
ఐసీసీ క్రీడా స్ఫూర్తి అవార్డు ‘‘ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ ఆఫ్ ద డికెడ్’’ మిస్టర్ కూల్ ధోనికి లభించింది. నాటింగ్‌హామ్ టెస్టు(ఇంగ్లండ్-2011)లో చిత్రమైన పరిస్థితుల్లో రనౌటై వెనుదిరిగిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ ఇయాన్ బెల్‌ను తిరిగి బ్యాటింగ్ చేసేందుకు పిలిచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించినందుకు అభిమానులు ధోనీని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

ఐసీసీ దశాబ్దపు అవార్డులు-విజేతలు

  • ఐసీసీ దశాబ్దపు మేటీ పురుష క్రికెటర్(సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డు): విరాట్ కోహ్లీ
  • ఐసీసీ దశాబ్దపు మేటీ మహిళా క్రికెటర్(రేచల్ హెహో-ఫ్లింట్ అవార్డు): ఎలీస్ పెర్రీ
  • ఐసీసీ ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ ఆఫ్ ద డికెడ్: ఎంఎస్ ధోని
  • ఐసీసీ దశాబ్దపు ఉత్తమ టెస్టు క్రికెటర్(పురుషుల్లో): స్టివ్ స్మిత్
  • ఐసీసీ దశాబ్దపు ఉత్తమ వన్డే(ODI) క్రికెటర్(పురుషుల్లో): విరాట్ కోహ్లీ
  • ఐసీసీ దశాబ్దపు ఉత్తమ టి20 క్రికెటర్(పురుషుల్లో): రషీద్ ఖాన్
  • ఐసీసీ దశాబ్దపు ఉత్తమ అసోసియేటెడ్ క్రికెటర్(పురుషుల్లో): కై ల్ కోట్జెర్
  • ఐసీసీ దశాబ్దపు ఉత్తమ వన్డే(ODI) క్రికెటర్(మహిళల్లో): ఎలీస్ పెర్రీ
  • ఐసీసీ దశాబ్దపు ఉత్తమ టి20 క్రికెటర్(మహిళల్లో): ఎలీస్ పెర్రీ
  • ఐసీసీ దశాబ్దపు ఉత్తమ అసోసియేటెడ్ క్రికెటర్(మహిళల్లో): కాథరిన్ బ్రైస్
Published date : 31 Dec 2020 11:47AM

Photo Stories