Skip to main content

Agricultural Scientist: స్వామినాథ‌న్.. ఓ వ్య‌వ‌సాయ శాస్త్రవేత్త‌

భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్రొఫెస‌ర్ స్వామినాథ‌న్ గురించి మాట్లాడారు. ఆయ‌న‌తో ఉన్న అనుబంధం, ఆయ‌న చేసిన కార్య‌క్ర‌మాలు, చేపట్టిన వ్య‌వ‌సాయాలు, వివిధ రంగాల్లో వ్య‌వ‌సాయ కార్యాలు వంటివాటి గురించి వివ‌రించారు. వ్య‌వ‌సాయ రంగంలో ఆయ‌న చేసిన సేవ‌లు, ప‌నుల గురించి అందికీ తెలిపారు. ప్రొఫెస‌ర్ స్వామినాథ‌న్ కు త‌న జ‌న్మ‌భూమి పై ఉన్న ఇష్టాన్ని పేర్కొన్నారు..
PM Narendra Modi about MS Swaminathan,Agricultural work in various fields highlighted by Prime Minister Modi
PM Narendra Modi about MS Swaminathan

వ్యవసాయ శాస్త్రంలో చదువు ముగించిన స్వామినాథన్‌కు తొలినాళ్లలోనే ప్రపంచ ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ నార్మన్‌ బోర్లాగ్‌తో పరిచయం ఏర్పడింది. నాటి నుంచీ పూర్తిగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో 1950 లోనే అమెరికాలో అధ్యాపకుడిగా ఆయనకు అవకాశం వచ్చింది. కానీ, జన్మభూమి సేవలో తరించడమే తన ధ్యేయమంటూ దాన్ని తిరస్కరించారు. పెను సవాళ్లతో నిండిన అప్పటి పరిస్థితుల్లో... స్వామినాథన్‌  మన దేశాన్ని ఆత్మవిశ్వాసంతో స్వావలంబన వైపు నడిపించడాన్ని ఒకసారి ఊహించుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి రెండు దశాబ్దాల్లో మనకు ఎదురైన సవాళ్లలో ఆహార కొరత ప్రధానమైనది. 1960వ దశకం తొలినాళ్లలో భారతదేశం కరువు కాటకాలు కమ్ముకుని అల్లాడుతోంది.

Russia President Vladimir Putin : నిరుపేద కుటుంబంలో పుట్టిన పుతిన్.. రష్యా అధ్యక్షుడుగా ఎలా అయ్యాడంటే..?

అటువంటి గడ్డు పరిస్థితుల నడుమ స్వామినాథన్‌ మొక్కవోని పట్టుదల, నిబద్ధత, ముందుచూపుతో ఉజ్వల వ్యవసాయ శకానికి నాంది పలికారు. వ్యవసాయం రంగంలో, ముఖ్యంగా గోధుమ సాగు వంటి నిర్దిష్ట ఆహార పంటల సమృద్ధి దిశగా మార్గదర్శకుడై నిలిచారు. తద్వారా ఆహార కొరతతో అల్లాడిన భారత్‌ స్వయం సమృద్ధ దేశంగా రూపొందింది. వ్యవసాయ రంగంలో దేశం సాధించిన ఈ అద్భుత విజయమే ఆయనకు ‘భారత హరిత విప్లవ పితామహుడు’ బిరుదును ఆర్జించి పెట్టింది. ‘ఏదైనా సాధించగలం’ అనే భారత ఆత్మస్థైర్యానికి హరిత విప్లవం ఒక సమగ్ర ఉదాహరణగా నిలిచింది. మనకు లక్ష సవాళ్లున్నా, ఆవిష్కరణల ఆలంబనగా వాటిని అధిగమించగల పది లక్షల మేధావుల అండ ఉన్నదని రుజువైంది.

Richest Persons 2023: ప్రపంచంలో అత్యంత ధనవంతులు 2023 విరే..

హరిత విప్లవం శ్రీకారం చుట్టుకున్న ఐదు దశాబ్దాల తర్వాత నేడు భారత వ్యవసాయ రంగం అత్యధునాతనం, ప్రగతిశీలమైనదిగా మారిందంటే కారణం స్వామినాథన్‌ వేసిన పునాదులేననే వాస్తవాన్ని మరువలేం. దేశ ఆహార కొరతను అధిగమించడంలో విజయం తర్వాత, ఏళ్ల తరబడి బంగాళాదుంప పంటను దెబ్బతీస్తున్న పరాన్నజీవుల ప్రభావాన్ని అరికట్టే దిశగా ఆయన పరిశోధన చేపట్టి సఫలమయ్యారు. అంతేకాకుండా, ఈ పంట చలి వాతావరణాన్ని కూడా తట్టుకోగలిగింది. ఇక ప్రపంచం నేడు చిరుధాన్యాలు లేదా ‘శ్రీఅన్న’ను అద్భుత ఆహార ధాన్యాలుగా పరిగణిస్తోంది. స్వామినాథన్‌ 1990లలోనే చిరుధాన్యాలపై చర్చను ముమ్మరం చేయడమేగాక వాటి సాగును ఇతోధికంగా ప్రోత్సహించారు.

స్వామినాథన్‌తో నాకు వ్యక్తిగత సంబంధాలు ఉండేవి. 2001లో నేను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆ రోజుల్లో గుజరాత్‌ వ్యవసాయపరంగా పెద్దగా నైపుణ్యంగల రాష్ట్రం కాదు. దీనికితోడు వరుస కరువులు, తుపానులు, భూకంపం వంటివి రాష్ట్ర ప్రగతిని దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో మేం ప్రారంభించిన అనేక కార్యక్రమాలలో భూసార కార్డుల పథకం ఒకటి. ఇది భూసారాన్ని చక్కగా అర్థం చేసుకోవడంలో తోడ్పడింది. సమస్యలు తలెత్తినపుడు వాటిని సులువుగా పరిష్కరించడం సాధ్యమైంది. ఈ పథకం అమలు సమయంలోనే నేను స్వామినాథన్‌ను కలిశాను. ఆయన ఈ పథకాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. దాన్ని మరింత మెరుగుపరచడం కోసం విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏదైనా పథకంపై సందేహాలు వెలిబుచ్చేవారు స్వామినాథన్‌ మాటతో ఒక్కసారిగా ఏకాభిప్రాయానికి వచ్చేవారు.

Planet Color History: అంగార‌క గ్ర‌హం అంటే..? దాని రంగుకు ఉన్న చ‌రిత్ర‌

నేను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మాత్రమేగాక, ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక కూడా మా మధ్య సంబంధాలు కొనసాగాయి. 2016 నాటి అంతర్జాతీయ వ్యవసాయ–జీవవైవిధ్య మహాసభలలో ఆయనను కలిశాను. మరుసటేడాది 2017లో ఆయన రెండు భాగాలుగా రాసిన పుస్తకాన్ని నేనే ఆవిష్కరించాను. ప్రపంచాన్ని పరస్పరం అనుసంధానించే సూదితో ‘తిరుక్కురళ్‌’లోని ఒక ద్విపద రైతుల గురించి అభివర్ణిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ అన్నదాత రైతే! ఈ సూక్తిని స్వామినాథన్‌ చక్కగా జీర్ణించుకున్నారు. కాబట్టే, ప్రజలు ఆయనను ‘వ్యవసాయ శాస్త్రవేత్త’గా పిలుస్తారు. కానీ, ఆయన ప్రతిభా వ్యుత్పత్తులు అంతకుమించినవని నా విశ్వాసం. ఆయన నిజమైన ‘రైతు శాస్త్రవేత్త’. ఆయన మెదడులో శాస్త్రవేత్త ఉంటే, హృదయంలో రైతు ఉన్నాడన్నది నా అభిప్రాయం.

Prakasam Barrage: ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజ్‌

స్వామినాథన్‌ పరిశోధనలు కేవలం ఆయన విద్యా నైపుణ్యానికి పరిమితం కాదు; వాటి ప్రభావం ప్రయోగశాలల వెలుపలకు... వ్యవసాయ క్షేత్రాలు–పొలాలకు విస్తరించాయి. శాస్త్రీయ జ్ఞానం–ఆచరణాత్మక అనువర్తనాల మధ్య అంతరాన్ని ఆయన పనితీరు తగ్గించింది. వ్యవసాయం రంగంలో సుస్థిరత కోసం ఆయన సదా పాటుపడ్డారు. మానవ పురోగమనం, పర్యావరణ సుస్థిరత నడుమ సున్నిత సమతౌల్యాన్ని నొక్కిచెప్పారు. సన్న–చిన్నకారు రైతుల జీవితాలను మెరుగుపరచడం, ఆవిష్కరణల ఫలాలు వారికి అందించడంలో స్వామినాథన్‌ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడాన్ని నేను తప్పక ప్రస్తావించాలి. ముఖ్యంగా మహిళా రైతుల జీవితాల సాధికారతపై ఆయనెంతో శ్రద్ధాసక్తులు చూపారు.

స్వామినాథన్‌లోని మరో విశిష్ట కోణం గురించి కూడా చెప్పాలి. ఆవిష్కరణల విషయంలోనే కాకుండా మార్గదర్శకత్వం వహించడంలోనూ ఆయనొక ఆదర్శమూర్తి. 1987లో ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌’ తొలి విజేతగా, దానికింద లభించిన సొమ్ముతో లాభాపేక్ష రహిత పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ఇప్పటిదాకా వివిధ రంగాలలో విస్తృత, విశిష్ట పరిశోధనలు నిర్వహించింది. అలాగే ఆయన ఎందరో పరిశోధకులను తీర్చిదిద్దారు. అభ్యాసం, ఆవిష్కరణలపై ఎందరిలోనో శ్రద్ధాసక్తులు రగిలించారు. వేగంగా మారిపోతున్న నేటి ప్రపంచ పరిస్థితుల నడుమ విజ్ఞానం, మార్గదర్శకత్వం, ఆవిష్కరణలకు గల శక్తిసామర్థ్యాలను ఆయన జీవితం ప్రతిబింబిస్తుంది. ఆయన స్వయంగా ఓ సంస్థ స్థాపకులేగాక శక్తిమంతమైన పరిశోధనలు సాగిస్తున్న మరెన్నో సంస్థల స్థాపనకు ఊపిరి పోసినవారు. మనీలాలోని అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం డైరెక్టర్‌గానూ ఆయన పనిచేయడం ఇందుకు నిదర్శనం. ఈ సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధన కేంద్రం 2018లో వారణాసి నగరంలో ప్రారంభమైంది.

M. S. Swaminathan: ఆకలిపై పోరాటం జరిపిన శాస్త్రవేత్త

డాక్టర్‌ స్వామినాథన్‌కు నివాళి అర్పిస్తున్న ఈ సందర్భంలో నేను మరో ద్విపదను ప్రస్తావించదలిచాను. ‘ప్రణాళిక రూపకర్త దృఢ మనస్కుడైతే... తానేది ఏ రీతిలో ఆకాంక్షించాడో ఆ రీతిలో దాన్ని సాధించగలడు’ అని ఈ ద్విపద చెబుతుంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలనీ, రైతులకు సేవలందించాలనీ చిరుప్రాయంలోనే నిర్ణయించుకున్న మహనీయుడాయన. ఆ విధంగానే వినూత్నంగా, ఆవిష్కరణాత్మకంగా, భావోద్వేగాలతో తాను నిర్దేశించుకున్న లక్ష్యం సాధించారు. వ్యవసాయ ఆవిష్కరణలు, సుస్థిరత దిశగా మన పయనంలో స్వామినాథన్‌ కృషి, పరిశ్రమ మనకు సదా స్ఫూర్తిదాయక మార్గనిర్దేశం చేస్తాయి. మనం కూడా ఆయనెంతో ప్రీతిగా అనుసరించిన సూత్రాల అమలుకు మన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ముందుకు సాగాలి. రైతుల సంక్షేమం ప్రాతిపదికగా శాస్త్రీయ ఆవిష్కరణల ఫలాలు మూలాలకు చేరేలా చూడాలి. తద్వారా భవిష్యత్తరాలను వృద్ధి, సుస్థిరత, సౌభాగ్యం వైపు ప్రోత్సహించాలి. 

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి 

Published date : 09 Oct 2023 01:30PM

Photo Stories