Skip to main content

WHO: ఇష్టారాజ్యంగా యాంటీ‘భయో’టిక్స్‌!.. నిజంగా అవసరమైనప్పుడు మందులు పనిచేయవంటున్న అధ్యయనాలు

 తుమ్మినా..దగ్గినా..నీరసమున్నా..ఆయాసమున్నా.. వొళ్లు నొప్పులు.. వైరల్‌ జ్వరం.. ఏదైనా ఒక్కటే మందు..యాంటీబయాటిక్‌. ఇలా చిన్నాచితకా రోగానికీ యాంటీబయాటిక్స్‌ విచ్చలవిడిగా వాడటం చాలామందికి అలవాటై పోతోంది. చివరి అస్త్రంగా వాడాల్సిన వాటిని తొలిదశలోనే వాడేస్తున్నారు.
 Antibiotics Side Effects
Antibiotics Side Effects

వైద్యులు సూచించక పోయినా కొందరు సొంతంగా వాడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్‌ వాడటం వల్ల, నిజంగా అవసరమైనప్పుడు వాడినా అవి పనిచేయని పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంటే అప్పటికే మనుషుల్లో వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ క్రిములకు యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే శక్తి (యాంటీబయాటిక్స్‌ రెసిస్టెన్స్‌) వచ్చి ఉంటుందన్న మాట. వ్యవసాయ పంటలకు విచ్చలవిడిగా పురుగుమందులను (యాంటీబయాటిక్స్‌) చల్లుతున్నారు. అధిక పాల ఉత్పత్తి కోసం పాడి పశువులకు ఇంజెక్షన్లు (యాంటీబయాటిక్స్‌) ఇస్తున్నారు. ఈ విధమైన ఆహారం, పాలు తీసుకోవడం ద్వారా అప్పటికే మానవ శరీరంలో అధిక శాతం యాంటీబయాటిక్స్‌ ఉంటున్నాయని అధ్యయనాలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. 

280 కోట్ల యాంటీబయాటిక్స్‌ ప్యాక్‌ల విక్రయం
దేశంలో 2019లో 85 రకాలకు సంబంధించిన 280 కోట్ల యాంటీబయాటిక్స్‌ ప్యాక్‌లు అమ్ముడుపోయినట్లు లాన్సెట్‌ జర్నల్‌ తెలిపింది. పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా, బోస్టన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ యాంటీబయాటిక్స్‌పై చేసిన అధ్యయనం ఇటీవల లాన్సెట్‌లో ప్రచురితమైంది. ఇందులో 28 యాంటీబయాటిక్స్‌ను అత్యవసర మందుల జాబితాలో పెట్టారు. మిగితావి సాధారణ జాబితాలో ఉన్నాయి. కేంద్ర ఔషధ నాణ్యత నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) అనుమతి ఇచ్చిన యాంటీబయాటిక్స్‌ కేవలం 19 శాతమే కాగా మిగిలిన 81 శాతం రాష్ట్రాల ఔషధ నియంత్రణ సంస్థల పరిధిలో అమ్ముతున్నారు. వాస్తవానికి దేశంలోని చాలా కాంబినేషన్‌ యాంటీబయాటిక్స్‌ను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. 

Also read: Human Genome Sequence: మనిషిలో సుమారు ఎన్ని వేల జీన్స్‌ ఉంటాయి?

రెండు మూడురకాలకు చెందిన యాంటీ బయాటిక్స్‌ను కలిపి (కాంబినేషన్‌) వాడటం సరైంది కాదని పేర్కొంది. కాంబినేషన్‌ మందులను కుష్టు, క్షయ వంటి వ్యాధులకు వాడాలి. కానీ మన వద్ద చిన్న చిన్న రోగాలకు కూడా కాంబినేషన్‌ ఔషధాలు వాడుతున్నారు. ఒకటి అవసరమైనచోట రెండు వాడటం వల్ల కూడా ఆ మందు పనిచేయని పరిస్థితి వస్తుంది. అయినా కంపెనీలు ఇష్టమొచ్చినట్లుగా మార్కెటింగ్‌ చేసుకుంటున్నాయి. ఔషధాల నియంత్రణలో ఉన్న లోపాలను ఆధారం చేసుకొని దందా నిర్వహిస్తున్నాయి. అమ్ముడవుతున్న యాంటీబయాటిక్స్‌లో 85–90 శాతం ప్రైవేట్‌ ఆసుపత్రులు, ప్రాక్టీషనర్లు రాస్తున్నవేనని అధ్యయనం తేల్చిచెప్పింది.  

Also read: Climate Change: మన పాపం! ప్రకృతి శాపం!!

ఆహారం ద్వారానే అత్యధిక శాతం యాంటీబయాటిక్స్‌! 
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనం ప్రకారం మన దేశంలో మాంసం, పాలు, పాల పదార్థాలు, గుడ్లు, వివిధ రకాల పంటల (ఆహార పదార్ధాలు) వినియోగం ద్వారా 80 శాతం యాంటీబయాటిక్స్‌ మానవ శరీరంలోకి వెళ్తున్నాయని తేల్చింది. చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు బ్లడ్‌ ఇన్ఫెక్షన్లుగా మారితే, అక్కడున్న పెన్సిలిన్‌కు సంబంధించిన యాంటిబయాటిక్‌కు లొంగని పరిస్థితులు 65 శాతం ఉంటున్నట్లు తెలిపింది. దీంతో డోసు ఎక్కువున్న యాంటీబయాటిక్స్‌ వాడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే ఉదర ఇన్ఫెక్షన్‌ బ్లడ్‌ ఇన్ఫెక్షన్‌గా మారితే.. యాంటీబయాటిక్స్‌కు లొంగని పరిస్థితులు 85 శాతం ఉంటున్నట్లు పేర్కొంది.  

Also read: జికా వైరస్‌ను మొదట ఏ దేశంలో గుర్తించారు?

శుభ్రత పాటించకపోవడంతో చేటు 
యాంటీబయాటిక్స్‌ విచ్చలవిడిగా వాడటానికి ఇన్‌ఫెక్షన్లే ప్రధాన కారణం. ఇప్పటికీ 54 శాతం ఇళ్లల్లో శుచీ శుభ్రత పాటించడం లేదు. సబ్బుతో చేతిని కడుక్కోలేని స్థితి ఉన్న ఇళ్లు 32 శాతం ఉన్నాయి. నీటి వసతి లేని ఆసుపత్రులు ఆరు శాతం ఉన్నాయి. పారిశుధ్యం సరిగా పాటించని ఆసుపత్రులు 22 శాతం ఉన్నాయి. వ్యర్థాలను సరిగా నిర్వీర్యం చేయని ఆసుపత్రులు 27 శాతం ఉన్నాయి. ఇలాంటి కారణాల వల్ల ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.  

Also read: 2020లో శాస్త్ర,సాంకేతిక రంగాల్లో శాస్త్రవేత్తలు సాధించిందేమిటో ఒక్కసారి చూద్దామా...

వివిధ దశల్లో 90 రకాల వ్యాక్సిన్లు  
యాంటీబయాటిక్స్‌ వాడకాన్ని తగ్గించేలా, ఇన్ఫెక్షన్‌ రాకుండా చూసేలా ప్రపంచవ్యాప్తంగా 90 రకాల వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉంది. చాలారకాల యాంటీబయాటిక్స్‌కు లొంగని, మొండి ఇన్ఫెక్షన్లకు కారణమైన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లు రాకుండా నిరోధించేందుకు ఈ వ్యాక్సిన్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్నాయి. 
– డాక్టర్‌ కిరణ్‌ మాదల,  క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ  

Also read: ప్రపంచంలో జీపీఎస్ ఆధారంగా దూసుకుపోయే ఏకైక టార్పెడో?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 13 Sep 2022 07:04PM

Photo Stories