Skip to main content

సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ)

పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి రాజ్యాంగంలో ప్రత్యేక ప్రస్తావన లేదు. అయితే ప్రకరణ 105లో వీటి గురించి పరోక్షంగా ప్రస్తావించారు. వీటి నిర్మాణం, విధులు, అధికారాలు పార్లమెంటు నిర్ణయిస్తుంది.
జేపీసీలకు సంబంధించి కూడా రాజ్యాంగంలో ప్రస్తావన లేదు. పార్లమెంటులో ఆయా శాఖలకు సంబంధించి శాశ్వత కమిటీలు, ప్రత్యేక అంశాలపై వేసే తాత్కాలిక కమిటీలు ఉంటాయి. జేపీసీలు తాత్కాలిక కమిటీల విభాగంలోకి వస్తాయి.

జేపీసీ నిర్మాణం
  1. ఉభయ సభలకు చెందిన సుమారు 15-30 మందిని ఇందులో సభ్యులుగా తీసుకోవచ్చు. అధికార పక్ష సభ్యునికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీ.
  2. పార్లమెంటు ఉభయసభల్లో ఏదైనా ఒక సభలో ఈ కమిటీ ఏర్పాటు కోసం సాధారణ మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించిన తరువాత మరొక సభ దానిని అంగీకరిస్తే లేదా మద్దతిస్తే సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటవుతుంది.
  3. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఇద్దరూ పరస్పర అవగాహనతో జేపీసీని ఏర్పాటుచేస్తారు.
ఇప్పటి వరకూ ఏర్పాటైన పలు జేపీసీలు
  1. బోఫోర్స్ కుంభకోణం- 1987 ఆగస్టు 6
    అధ్యక్షులు:
    శంకరానంద్(కాంగ్రెస్). 50 పర్యాయాలు సమావేశమైంది. 1998 ఏప్రిల్ 26న నివేదిక సమర్పించింది. ప్రతిపక్షాలు దీన్ని తోసిపుచ్చాయి.
  2. స్టాక్ మార్కెట్ కుంభకోణం (హర్షద్ మెహతా కుంభకోణం): 1992 ఏప్రిల్ 6
    అధ్యక్షులు:
    రాం నివాస్ మీర్ధా(కాంగ్రెస్). 105 సార్లు సమావేశమైంది. 1993 డిసెంబర్ 21 నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ప్రభుత్వం ఆమోదించలేదు, తిరస్కరించలేదు.
  3. కేతన్ పరేఖ్ కుంభకోణం(స్టాక్ మార్కెట్ కుంభకోణం): 2001 ఏప్రిల్ 26
    అధ్యక్షులు:
    ప్రకాశ్ మణి(బీజేపీ). 109 సార్లు సమావేశమైంది. నివేదికను 2002 డిసెంబర్ 19న ఇచ్చింది. స్టాక్‌మార్కెట్ నియంత్రణలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
  4. శీతల పానీయాల్లో పురుగుల మందు: 2003 ఆగస్టు 8
    అధ్యక్షులు:
    శరద్ పవార్(నేషనలిస్ట్ కాంగ్రెస్). 17 సార్లు సమావేశమైంది. 2004 ఫిబ్రవరి 4న నివేదిక సమర్పించింది. శీతల పానీయాల్లో పురుగుల మందుల అవశేషాలు నిజమేనని తేల్చింది. ఆహార భద్రత ప్రమాణాల సంస్థ ఏర్పాటైంది.
  5. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం: 2011 మార్చి 1
    అధ్యక్షులు:
    పీసీ చాకో(కాంగ్రెస్). మొత్తం సభ్యుల సంఖ్య 30. లోక్‌సభ నుంచి 20, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు.
పార్లమెంటరీ సంఘాలు- ప్రభావం
పార్లమెంటరీ కమిటీలు భారత రాజకీయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలు పనిచేసే విధానాన్ని నిరంతరం సమీక్షిస్తూ, పరిపాలన యంత్రాంగం సమర్థంగా పనిచేయడానికి దోహదం చేస్తున్నాయి. నిరంతర పర్యవేక్షణ ద్వారా ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను బాధ్యత వహించేటట్లు చేస్తూ, దుబారా, లంచగొండితనం, పక్షపాత వైఖరి, బాధ్యతారాహిత ్య ధోరణులను సాధ్యమైనంత వరకూ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి.
Published date : 02 Jul 2015 03:39PM

Photo Stories