Skip to main content

పౌరసత్వ (సవరణ) చట్టం 2019

పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే ‘పౌరసత్వ సవరణ బిల్లు-2019’కు 2019, డిసెంబర్ 11న రాజ్యసభ ఆమోదం తెలిపింది.
సభలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ బిల్లును డిసెంబర్ 9న లోక్‌సభ ఆమోదించింది. లోక్‌సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 311 మంది, వ్యతిరేకంగా 80 మంది ఓటేశారు. ఈ బిల్లు ప్రకారం.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మత వివక్ష ఎదుర్కొంటూ 2014, డిసెంబర్ 31 లోపు భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రై స్తవులకు భారత పౌరసత్వం కల్పిస్తారు.

ఈ బిల్లుపై చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఈ బిల్లు గురించి భారతీయ ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని, వారు భారతీయ పౌరులుగా కొనసాగుతారని, ఈ బిల్లుతో వారికి ఏ సంబంధమూ లేదని వివరణ ఇచ్చారు. ఈ బిల్లు పరిధిలో లేని ‘ఇన్నర్ లైన్ పర్మిట్’ ప్రాంతంలోకి మణిపూర్‌ను కూడా చేరుస్తున్నామన్నారు.
 
డిసెంబర్‌ 12న రాష్ట్రపతి ఆమోదం
 పౌరసత్వ సవరణ బిల్లు–2019కు 2019, డిసెంబర్‌ 12న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. దాంతో ఈ బిల్లు పౌరసత్వ (సవరణ) చట్టంగా మారింది.


ఏమిటీ బిల్లు?
పౌరసత్వ చట్టం, 1955కి తాజాగా కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ కొత్త బిల్లు ప్రకారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో నివసిస్తూ మత పరమైన హింస, వేధింపుల్ని ఎదుర్కొంటున్న ఆరు వర్గాలకు భారత పౌరసత్వాన్ని కల్పించడానికి వీలుగా చట్టానికి సవరణలు చేస్తున్నారు. హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్సీలు, జైనులు, బుద్ధులకు ఈ కొత్త సవరణ చట్టం ప్రకారం మన దేశ పౌరసత్వం లభిస్తుంది. వీరంతా భారత్‌లో ఉంటూ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, ఆ పత్రాల గడువు తేదీ ముగిసిపోయినా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆరు వర్గాల్లో ముస్లింలు లేకపోవడం మైనారిటీల్లో అసంతృప్తి రాజేస్తోంది.

ఈశాన్య రాష్ట్రాల్లో..
బంగ్లాదేశ్ నుంచి భారీ సంఖ్యలో హిందువులు కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా దేశంలోని ఈశాన్యరాష్ట్రాల్లో ప్రవేశించారు. ఇప్పుడు వారందరికీ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా పౌరసత్వం వస్తుంది. ఇప్పటికే అసోం పౌర రిజిస్టర్ ద్వారా ఎందరో దేశ పౌరసత్వాన్ని కోల్పోయారు. దశాబ్దాల తరబడి ఈ రాష్ట్రాల్లో ఉంటున్న మైనారిటీల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొంది.

మొదట 2016లో...
లోక్‌సభలో ఈ బిల్లుని మొదట 2016లో ప్రవేశపెట్టారు. అధికార బీజేపీకి అసోంలో మిత్రపక్షమైన అసోం గణ పరిషత్(ఏజీపీ) అప్పట్లో దీనిని వ్యతిరేకించింది.
Published date : 13 Dec 2019 02:31PM

Photo Stories