Skip to main content

జాతీయ మానవ హక్కుల కమిషన్‌

మానవులు గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలే మానవహక్కులు. ఇవి కుల, మత, ప్రాంత, లింగ భేదాలకు అతీతం.
దేశంలో మానవహక్కుల పరిరక్షణకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో మానవ హక్కుల కమిషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ 1993లో జాతీయ హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చింది. దీన్ని 2006లో సవరించారు.

సభ్యుల నియామకం: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షునిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి(పదవిలో ఉన్నా లేదా విరమణ చేసినా), హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(పదవిలో ఉన్నా లేదా విరమణ చేసినా), మానవ హక్కుల కార్యక్ర మాల్లో చురుగ్గా ఉన్న ఇద్దరు వ్యక్తులను సభ్యులుగా నియమిస్తారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని కమిటీ సిఫార్సు మేరకు కమిషన్ సభ్యులను రాష్ర్టపతి నియమిస్తారు. పదవీకాలం ఐదేళ్లు లేదా 70 ఏళ్లు వచ్చేంతవరకు(ఏది ముందైతే అది).

విధులు
  1. కమిషన్ స్వయంగా లేదా బాధితుని ఫిర్యాదు మేరకు లేదా కోర్టు ఉత్తర్వు మేరకు మానవ హక్కుల ఉల్లంఘన జరిగినపుడు దానిపై సమగ్ర విచారణ చేయడం
  2. న్యాయస్థానం అనుమతి మేరకు మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కార్య వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం
  3. మానవహక్కుల పరిరక్షణకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలను, శాసన సభలు రూపొందించే చట్టాలను సమీక్షించి వాటిని ప్రభావవంతంగా అమలుచేయడానికి సూచనలివ్వడం
అధికారాలు
1. సివిల్ కోర్టుకున్న అధికారాలు ఉంటాయి.
ఎ) అఫిడవిట్లను, సాక్ష్యాధారాలను సేకరించడానికి, విచారించడానికి
బి) న్యాయస్థానం లేదా ప్రభుత్వ కార్యాలయం నుంచి అవసరమైన సమాచారం పొందే అధికారం ఉంటుంది.
2. కమిషన్ తాను దర్యాప్తు చేస్తున్న కేసును మెజిస్ట్రేట్‌కు పంపడానికి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు కేసును బదిలీ చేయడానికి..
3. విచారణ ముగిసిన తర్వాత కమిషన్ దృష్టిలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే..
ఎ) బాధితునికి లేదా వారి కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం ఇవ్వాలని, కారకులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయవచ్చు.
బి) సుప్రీంకోర్టు లేదా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరవచ్చు.
Published date : 09 Apr 2015 05:18PM

Photo Stories