Skip to main content

స్వలింగ సంపర్కం నేరం కాదు : సుప్రీంకోర్టు

పరస్పర అంగీకారంతో ఇద్దరు వయోజనుల(మేజర్లు) మధ్య జరిగే స్వలింగ సంపర్కం లేదా స్త్రీ-పురుషుల మధ్య ప్రైవేటుగా జరిగే లైంగిక చర్య నేరం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 377లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 2018, సెప్టెంబర్ 6న తీర్పు వెలువ‌రించింది. అయితే జంతువులు, చిన్న పిల్లలు, మైనర్లతో, అలాగే మేజర్లతోనూ పరస్పర అంగీకారం లేకుండా జరిగే లైంగిక కేసుల విషయంలో 377 సెక్షన్‌లోని నిబంధనలు కొనసాగుతాయని కోర్టు పేర్కొంది.
 
ఎల్‌జీబీటీక్యూలు..
సమాజంలో ఎల్‌జీబీటీక్యూ (లెస్పియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్)లు దేశంలోని మిగిలిన పౌరుల్లాగే అన్ని రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందవచ్చని కోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 377 కారణంగానే ఎల్‌జీబీటీక్యూలు ఇన్నాళ్లుగా దేశంలో ద్వితీయశ్రేణి పౌరుల్లా బతకాల్సి వచ్చిందని జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలు సభ్యులుగా ఉన్న ధర్మాసనం అభిప్రాయపడింది.

నవ్‌తేజ్ జౌహార్, జర్నలిస్ట్ సునీల్ మెహ్రా, చెఫ్ రితూ దాల్మియా, హోటల్ యజమానులు అమన్‌నాథ్, కేశవ్ సూరీ, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అయేషా కపూర్ సహా 20 మంది ఐఐటీ విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ చారిత్రక తీర్పునిచ్చింది. తాజా తీర్పు ద్వారా ప్రపంచంలో స్వలింగ సంపర్కాన్నీ చట్టబద్ధం చేసిన 26వ దేశంగా భారత్ నిలిచింది.

సెక్షన్ 377 నేప‌థ్యం
భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) లోని 16వ అధ్యాయంలో 377వ సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ ముసాయిదాను బ్రిటిష్ పాలనలో 1838లో థామస్ మెకాలే రూపొందించగా 1861లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం బ్రిటిష్ సొడొమీ చట్టం(బగ్గరీయాక్ట్ 1533) ఆధారంగా రూపొందింది. సహజ విరుద్ధంగా జరిగే ఎలాంటి శృంగారమైనా నేరమేనని ఈ చట్టం చెబుతోంది. నేరస్తులకు గరిష్టంగా జీవిత ఖైదు, కనీసం పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించేందుకు సెక్షన్ 377 వీలు కల్పించింది.

చట్టంలో ఏముంది?
భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 377వ సెక్షన్ అసహజ నేరాలను నిర్వచించింది. 158 ఏళ్ల క్రితం చేసిన ఈ చట్టం ప్రకారం మైనారిటీ తీరిన హోమోసెక్సువల్స్ (ఇద్దరు పురుషులు), హెటిరో సెక్సువల్స్ (ఓ ఆడ, ఓ మగ), లెస్బియన్స్ (ఇద్దరు ఆడవాళ్లు) మధ్య పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధాన్ని ఏర్పర్చుకోవడం నేరం, రాజ్యాంగ వ్యతిరేకం. అలాగే మగవారైనా, ఆడవారైనా జంతువుతో శృంగారంలో పాల్గొనటాన్ని ఈ చట్టం తప్పుగా పరిగణిస్తోంది. పరస్పర అంగీకారం లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య బలవంతంగా లైంగిక చర్య జరగటాన్నీ కూడా నేరంగా పరిగణిస్తోంది.

చట్టబద్ధం చేసిన ఢిల్లీ హైకోర్టు
పరస్పర సమ్మతితో కూడిన స్వలింగ సంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు 2009లో తీర్పు ఇచ్చింది. సెక్షన్ 377 స్వలింగ సంపర్కుల ‘పరిపూర్ణ వ్యక్తిత్వ హక్కు’ను నిరాకరిస్తోందని, అందువల్ల ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమంది.

హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
ఢిల్లీ హైకోర్టు తీర్పును 2013, డిసెంబర్‌లో సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.సెక్షన్ 377 రాజ్యాంగబద్ధమేనని జస్టిస్ జీఎస్ సంఘ్వి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలంది.

ట్రాన్స్జెండర్లపై తీర్పు
ట్రాన్స్ జెండర్లను(లింగ మార్పిడి చేసుకున్న వారు) థర్డ్ జెండర్‌గా ప్రకటించాలని, ఓబీసీ కోటాలో వారిని కూడా చేర్చాలని సుప్రీం కోర్టు 2014లో కేంద్రాన్ని ఆదేశించింది. వారికి కూడా అందరిలా వివాహం, దత్తత, విడాకులు, వారసత్వం తదితర హక్కుల్ని కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది.

71 దేశాల్లో నేరమే..
ప్రపంచవ్యాప్తంగా 71 దేశాలు ఇప్పటికీ స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్నారుు. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, యూఏఈ. ఖతార్, మౌరిటానియాలో స్వలింగ సంపర్కులకు మరణశిక్ష విధించేలా చట్టాలున్నాయి.
Published date : 28 Oct 2021 04:36PM

Photo Stories