Skip to main content

ఎస్మా చట్టం

‘ఎసెన్షియల్ సర్వీసెస్ మెయిన్‌టెనెన్స్ యాక్ట్ (అత్యవసర సేవల నిర్వహణ చట్టం)’ సంక్షిప్త రూపం ఎస్మా. సమ్మెలు, హర్తాళ్ (బంద్) వంటి సందర్భాల్లో ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా, కొన్ని రకాల ‘అత్యవసర సేవల నిర్వహణ’ అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చూసేందుకు 1981లో రూపొందించిన చట్టం.
అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా, ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మె చేపడితే దీన్ని ప్రయోగించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది.

ఎస్మాను ఎప్పుడు ప్రయోగిస్తారు..?
నిరంతరం శ్రమించే కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెబాట పడుతుంటారు. కార్మిక సంఘాలు, ప్రభుత్వ పెద్దల నడుమ చర్చలు జరుగుతాయి. కోర్కెలు న్యాయబద్ధమైనవని ప్రభుత్వం భావించి సమస్యలు పరిష్కరిస్తే ఆందోళన విరమించి అంతటితో సద్దుమణుగుతుంది. లేని పక్షంలో సమ్మె మరిం త ఉధృతరూపం దాల్చుతుంది. అదే సమయంలో ప్రజా జీవనానికి అంతరాయం ఏర్పడకుండా అత్యవసర సేవలందిస్తుంటారు. దైనందిన జీవితానికి ఆటంకం ఏర్పడే పరిస్థితులు నెలకొన్న సందర్భాల్లో చివరకు సర్కారు కార్మికులపై ‘ఎస్మా’ చట్టాన్ని ప్రయోగిస్తుంది. ఒకసారి ప్రయోగిస్తే ఈ చట్టం ఆరు నెలలపాటు అమల్లో ఉంటుంది. అవసరమైన మేరకు పొడిగించుకొనే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. ఈ చట్టం ప్రకారం ప్రజా ప్రయోజనాల రీత్యా సమ్మె చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవచ్చు. సస్పెన్షన్, డిస్మిస్, జైలు శిక్ష, జరిమానా విధించే హక్కు ప్రభుత్వాలకు సంక్రమిస్తుంది.

ఎప్పుడొచ్చింది?
1980లో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికిపోయింది. ముఖ్యంగా కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు తేవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఉధృతస్థాయిలో ఉద్యమించాయి. 1981లో కార్మిక సంఘాలు పార్లమెంటు ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నింటా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. క్రమేపీ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతున్నట్లు స్పష్టమవడంతో ప్రభుత్వం ముందుగా 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ ‘ఎస్మా’ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. తర్వాత ఈ ఆర్డినెన్స్ స్థానంలో ‘ఎస్మా’ చట్టం తెచ్చారు. జమ్మూ కశ్మీర్‌తోపాటు దేశవ్యాప్తంగా ఇది వర్తిస్తుంది.

ఉల్లంఘిస్తే?
ఎస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగినట్లు ఎవరిపైనైనా బలమైన అనుమానం ఉంటే, నేరశిక్షాస్మృతి (సీపీసీ)తో సంబంధం లేకుండానే పోలీసులు వారంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్ చేయడంతోపాటు వివిధ రకాల క్రమశిక్షణ చర్యలు చేపట్టవచ్చు. సమ్మెలో పాల్గొంటున్న వారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి జైలు, జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. ఈ చట్టం ప్రకారం సమ్మెకు ఆర్థిక సహకారం అందించేవారూ శిక్షార్హులే.

గతంలో ఎక్కడెక్కడ విధించారు?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మెలపై ‘ఎస్మా’ ప్రయోగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 2003లో తమిళనాడు ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ సమయంలో జయలలిత ప్రభుత్వం ఎస్మా ప్రయోగించి దాదాపు 1,70,000 మందిని విధుల్లోంచి తొలగించింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాతగానీ వారంతా విధుల్లో చేరలేకపోయారు. సమ్మె కట్టిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బందిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశ వ్యాప్తంగా చాలా చోట్ల ఎస్మా ప్రయోగించారు. 2006లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా విమానాశ్రయ సిబ్బంది సమ్మెకు దిగినపుడు, 2009లో ట్రక్కు రవాణా దారులు సమ్మె చేసినపుడు, అదే ఏడాది చమురు, గ్యాస్ సిబ్బంది సమ్మె చేసినపుడు.. ఇలా పలు సందర్భాల్లో ఎస్మా ప్రయోగించారు.
Published date : 16 Jul 2015 02:49PM

Photo Stories